< జెకర్యా 4 >
1 ౧ అప్పుడు నాతో మాట్లాడుతున్న దూత తిరిగి వచ్చి నిద్రపోతున్న ఒకణ్ణి లేపినట్లు నన్ను లేపాడు.
2 ౨ “నీకు ఏమి కనిపిస్తుంది?” అని నన్ను అడిగాడు. నేను “బంగారు దీపస్తంభం నాకు కనిపిస్తుంది. దీపస్తంభం మీద ఒక నూనె పాత్ర ఉంది. దీపస్తంభానికి ఏడు దీపాలు, ఒక్కో దీపానికి ఏడేసి గొట్టాలు కనిపిస్తున్నాయి.
3 ౩ దీపస్తంభానికి కుడి పక్కన ఒకటి, ఎడమ పక్కన ఒకటి చొప్పున రెండు ఒలీవ చెట్లు కనబడుతున్నాయి” అని చెప్పాను.
4 ౪ తరువాత నేను నాతో మాట్లాడుతున్న దూతతో “స్వామీ, ఇది ఏమిటి?” అని అడిగాను.
5 ౫ అప్పుడు నాతో మాట్లాడుతున్న దూత “ఇదేమిటో నీకు తెలియదా” అని అడిగాడు. నేను “స్వామీ, నాకు తెలియదు” అన్నాను.
6 ౬ అప్పుడు ఆ దూత నాతో ఇలా చెప్పాడు. “జెరుబ్బాబెలుకు ప్రత్యక్షమైన యెహోవా వాక్కు ఇదే. నీ శక్తి వల్లనైనా, నీ బలం వల్లనైనా ఇది జరగదు. కేవలం నా ఆత్మ వల్లనే ఇది జరుగుతుంది” అని సేనల ప్రభువు యెహోవా చెప్పాడు.
7 ౭ మహా పర్వతమా, నువ్వు ఏపాటి దానివి? జెరుబ్బాబెలును అడ్డగించాలని ప్రయత్నించే నువ్వు నేలమట్టం అవుతావు. కృప కలుగు గాక, కృప కలుగు గాక అంటూ ప్రజలు జయజయధ్వానాలు చేస్తూ ఉండగా అతడు పై రాయి తీసుకుని ఆలయంపై పెట్టిస్తాడు.
8 ౮ యెహోవా వాక్కు మళ్ళీ నాకు ప్రత్యక్షమై ఇలా చెప్పాడు.
9 ౯ “జెరుబ్బాబెలు తన చేతులతో ఈ ఆలయం పునాది వేశాడు. అతడు ఈ కార్యం ముగిస్తాడు. అప్పుడు ఇదే సేనల ప్రభువు యెహోవా నన్ను మీ దగ్గరికి పంపించాడని నువ్వు తెలుసుకుంటావు.
10 ౧౦ స్వల్పమైన పనులు జరిగే కాలాన్ని ఎవరు తృణీకరిస్తారు? లోకమంతా సంచారం చేసే యెహోవా ఏడు కళ్ళు జెరుబ్బాబెలు చేతిలో ఉన్న గుండునూలును చూసి సంతోషిస్తాయి.”
11 ౧౧ నేను ఆ దూతను “దీపస్తంభానికి రెండు వైపులా ఉన్న ఈ రెండు ఒలీవచెట్ల భావం ఏమిటి?”
12 ౧౨ “రెండు బంగారపు కొమ్ముల్లో నుండి బంగారు నూనె కుమ్మరించే ఒలీవ చెట్లకున్న రెండు కొమ్మల భావం ఏమిటి?” అని అడిగాను.
13 ౧౩ అప్పుడు అతడు నాతో “ఇవి ఏమిటో నీకు తెలియదా?” అన్నాడు. నేను “స్వామీ, నాకు తెలియదు” అని చెప్పాను.
14 ౧౪ అతడు “వీరిద్దరూ సర్వలోకనాధుడైన యెహోవా దగ్గర నిలిచి తైలం పోసే సన్నిధాన సేవకులు” అని చెప్పాడు.