< ప్రకటన గ్రంథము 4 >
1 ౧ ఇదంతా జరిగాక నేను చూస్తూ ఉన్నాను. అప్పుడు పరలోకంలో ఒక తలుపు తెరుచుకుని ఉంది. నేను ఇంతకు ముందు విన్న స్వరం భేరీ నాదంలా నాతో మాట్లాడుతుంటే విన్నాను. ఆ స్వరం, “పైకి రా. తరువాత జరగాల్సినవి నీకు చూపిస్తాను” అని పలికింది.
2 ౨ వెంటనే నేను ఆత్మ స్వాధీనంలోకి వెళ్ళాను. అప్పుడు పరలోకంలో ఉన్న ఒక సింహాసనాన్నీ, ఆ సింహాసనంపై కూర్చున్న ఒక వ్యక్తినీ చూశాను.
3 ౩ అలా కూర్చున్న వ్యక్తి చూడడానికి సూర్యకాంత మణిలాగా కెంపులాగా ఉన్నాడు. ఆ సింహాసనం చుట్టూ మరకతంలా ప్రకాశిస్తూ ఒక ఇంద్రధనుస్సు ఆవరించి ఉంది.
4 ౪ ఆ సింహాసనం చుట్టూ ఇరవై నాలుగు వేరే సింహాసనాలున్నాయి. వాటి మీద ఇరవై నలుగురు పెద్దలు కూర్చుని ఉన్నారు. వీరంతా తెల్లటి బట్టలు కట్టుకుని ఉన్నారు. వారి తలలపై బంగారు కిరీటాలున్నాయి.
5 ౫ ఆ సింహాసనం నుండి మెరుపులు, శబ్దాలు, ఉరుములు వస్తున్నాయి. సింహాసనం ముందు ఏడు దీపాలు వెలుగుతూ ఉన్నాయి. అవి దేవుని ఏడు ఆత్మలు.
6 ౬ ఆ సింహాసనం ఎదురుగా స్ఫటికంలాటి సముద్రంలాటిది ఉంది. ముందూ వెనకా కళ్ళు ఉన్న నాలుగు ప్రాణులు సింహాసనం చుట్టూ ఉన్నాయి.
7 ౭ మొదటి ప్రాణి సింహంలా ఉంది. రెండవది దూడలా ఉంది. మూడవ ప్రాణికి మనిషి ముఖంలాటి ముఖం ఉంది. నాలుగవ ప్రాణి ఎగురుతూ ఉన్న డేగలా ఉంది.
8 ౮ ఈ నాలుగు ప్రాణుల్లో ప్రతి ప్రాణికీ ఆరు రెక్కలున్నాయి. వాటి చుట్టూ, లోపలా, రెక్కల లోపల కూడా కళ్ళతో నిండి ఉన్నాయి. అవి పగలూ రాత్రీ మానకుండా ఈ విధంగా చెబుతున్నాయి, “పూర్వం ఉండి, ప్రస్తుతముంటూ, భవిష్యత్తులో వచ్చేవాడూ, అంతటినీ పరిపాలించే వాడూ, దేవుడూ అయిన ప్రభువు పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు!”
9 ౯ ఆ ప్రాణులు సింహాసనంపై కూర్చుని శాశ్వతంగా జీవిస్తున్న వాడికి ఘనత, కీర్తి, కృతజ్ఞతలూ సమర్పిస్తూ ఉన్నప్పుడు (aiōn )
10 ౧౦ ఆ ఇరవై నలుగురు పెద్దలూ సింహాసనంపై కూర్చున్న వాడి ఎదుట సాష్టాంగపడి నమస్కారం చేశారు. వారు శాశ్వతంగా జీవిస్తున్న వాడికి మొక్కి, (aiōn )
11 ౧౧ “మా ప్రభూ, మా దేవా, నువ్వు ఘనత, కీర్తి, ప్రభావాలు పొందడానికి అర్హుడివి. ఎందుకంటే నువ్వు సమస్తాన్నీ సృష్టించావు. నీ ఇష్టప్రకారమే అవి ఉనికిలో ఉన్నాయి” అని చెబుతూ తమ కిరీటాలను ఆ సింహాసనం ముందు వేశారు.