< కీర్తనల~ గ్రంథము 86 >
1 ౧ దావీదు ప్రార్థన. యెహోవా, నేను పేదవాణ్ణి. నన్ను అణిచి వేశారు. నా మాట విని నాకు జవాబివ్వు.
2 ౨ నేను నీ విధేయుణ్ణి. నన్ను కాపాడు. నా దేవా, నిన్ను నమ్ముకున్న నీ సేవకుణ్ణి రక్షించు.
3 ౩ ప్రభూ, రోజంతా నీకు మొరపెడుతున్నాను, నన్ను కనికరించు.
4 ౪ ప్రభూ, నా ఆత్మ నీ వైపు ఎత్తుతున్నాను. నీ సేవకుడు సంతోషించేలా చెయ్యి.
5 ౫ ప్రభూ, నువ్వు మంచివాడివి. క్షమించడానికి సిద్ధంగా ఉంటావు. నీకు మొరపెట్టే వారందరినీ అమితంగా కనికరిస్తావు.
6 ౬ యెహోవా, నా ప్రార్థన విను. నా విన్నపాల శబ్దం ఆలకించు.
7 ౭ నా కష్టాల్లో నేను నీకు మొరపెడతాను. నువ్వు నాకు జవాబిస్తావు.
8 ౮ ప్రభూ, దేవుళ్ళలో నీకు సాటి ఎవరూ లేరు. నీ పనులకు సాటి ఏదీ లేదు.
9 ౯ ప్రభూ, నువ్వు సృజించిన రాజ్యాలన్నీ వచ్చి నీ ఎదుట ప్రణమిల్లుతారు. వాళ్ళు నీ నామాన్ని గొప్ప చేస్తారు.
10 ౧౦ నువ్వు గొప్ప వాడివి. ఆశ్చర్యమైన పనులు చేస్తావు. నీవొక్కడివే దేవుడివి.
11 ౧౧ యెహోవా, నీ పద్ధతులు నాకు బోధించు. అప్పుడు నేను నీ సత్యంలో నడుస్తాను. నిన్ను గౌరవించేలా నా హృదయాన్ని ఏక భావంగలదిగా చెయ్యి.
12 ౧౨ ప్రభూ, నా దేవా, నా హృదయమంతటితో నేను నిన్ను స్తుతిస్తాను. నీ నామాన్ని శాశ్వతకాలం గొప్ప చేస్తాను.
13 ౧౩ నా పట్ల నీ కృప ఎంతో గొప్పది. చచ్చిన వాళ్ళుండే అగాధం నుంచి నా ప్రాణాన్ని తప్పించావు. (Sheol )
14 ౧౪ దేవా, గర్విష్ఠులు నా మీదికి ఎగబడ్డారు. దుర్మార్గులు నా ప్రాణం తీయాలని చూస్తున్నారు. నువ్వంటే వాళ్ళకు లెక్క లేదు.
15 ౧౫ అయితే ప్రభూ, నువ్వు కృపా కనికరాలు గల దేవుడివి. కోపించడానికి నిదానించే వాడివి. అత్యంత కృపగల వాడివి. నమ్మదగిన వాడివి.
16 ౧౬ నావైపు తిరిగి నన్ను కనికరించు, నీ సేవకుడికి నీ బలం ఇవ్వు. నీ సేవకురాలి కొడుకును కాపాడు.
17 ౧౭ యెహోవా, నీ ఆదరణ గుర్తు నాకు చూపించు. అప్పుడు నన్ను ద్వేషించే వాళ్ళు అది చూచి సిగ్గుపాలవుతారు. ఎందుకంటే నువ్వు నాకు సాయం చేసి నన్ను ఆదరించావు.