< కీర్తనల~ గ్రంథము 43 >
1 ౧ దేవా, నాకు న్యాయం తీర్చు. దైవభక్తిలేని ప్రజలతో నా తరుపున వాదించు.
2 ౨ నా బలానికి ఆధారమైన దేవుడివి నువ్వే. నన్ను ఎందుకు తోసివేశావు? నీవు నాకు దుర్గం వంటి దేవుడివి. శత్రువు నన్ను అణగదొక్కుతూ ఉంటే నేను రోదిస్తూ ఎందుకు తిరగాలి?
3 ౩ నీ వెలుగునూ, నీ సత్యాన్నీ పంపించు. అవి నాకు దారి చూపనీ. అవి నన్ను నీ పరిశుద్ధ పర్వతానికీ, నీ నివాసాలకూ నన్ను తీసుకు వెళ్ళనీ.
4 ౪ అప్పుడు నేను దేవుని బలిపీఠం దగ్గరకూ, నాకు అత్యధిక సంతోష కారణమైన నా దేవుని దగ్గరకూ వెళ్తాను. సితారా వాయిస్తూ నా దేవుణ్ణి స్తుతిస్తాను.
5 ౫ నా ప్రాణమా, నువ్వు ఎందుకు నిరుత్సాహంగా ఉన్నావు? నీలో నువ్వు ఎందుకు ఆందోళన పడుతున్నావు? దేవునిలో నమ్మకం ఉంచు. నా సహాయం, నా దేవుడూ అయిన ఆయన్ని నేను స్తుతిస్తాను.