< కీర్తనల~ గ్రంథము 38 >
1 ౧ దావీదు కీర్తన, జ్ఞాపకం కోసం యెహోవా, నీ కోపంలో నన్ను గద్దించవద్దు. నీ తీవ్ర కోపంలో నన్ను శిక్షించవద్దు.
2 ౨ నీ బాణాలు నాకు గట్టిగా గుచ్చుకుంటున్నాయి. నీ చెయ్యి నన్ను అణచివేస్తుంది.
3 ౩ నీ కోపం వల్ల నా శరీరమంతా అనారోగ్యం కలిగింది. నా పాపం కారణంగా నా ఎముకల్లో ఆరోగ్యం లేకుండా పోయింది.
4 ౪ ఎందుకంటే నా దోషాలు నన్ను ముంచెత్తి వేస్తున్నాయి. అవి నేను మోయలేనంత భారంగా ఉన్నాయి.
5 ౫ మూర్ఖంగా నేను చేసిన పాపాల వల్ల నాకు కలిగిన గాయాలు కుళ్ళి దుర్వాసన వస్తున్నాయి.
6 ౬ నేను పూర్తిగా కుంగిపోయాను. రోజంతా నాకు అవమానం కలుగుతుంది.
7 ౭ అవమానం నన్ను ముంచెత్తివేసింది. నా శరీరమంతా రోగగ్రస్థమైంది.
8 ౮ నేను మొద్దుబారిపోయాను. పూర్తిగా నలిగిపోయాను. నా హృదయంలోని వేదన కారణంగా మూలుగుతున్నాను.
9 ౯ ప్రభూ, నా హృదయపు లోతుల్లోని తీవ్ర ఆకాంక్షలు నువ్వు అర్థం చేసుకుంటావు. నా మూల్గులు నీకు వినిపిస్తూనే ఉన్నాయి.
10 ౧౦ నా గుండె వేగంగా కొట్టుకుంటున్నది. నా శక్తి క్షీణించిపోతూ ఉంది. నా కంటి చూపు మసకబారుతూ ఉంది.
11 ౧౧ నా ఈ పరిస్థితి కారణంగా నా స్నేహితులూ, తోటివాళ్ళూ నన్ను వదిలేశారు. నా పొరుగువాళ్ళు దూరంగా నిలబడ్డారు.
12 ౧౨ నా ప్రాణం తీయాలని చూసేవాళ్ళు నా కోసం ఉచ్చు బిగిస్తున్నారు. నాకు హాని కలగాలని చూసేవాళ్ళు వినాశకరమైన మాటలు పలుకుతున్నారు. రోజంతా మోసపూరితంగా మాట్లాడుతున్నారు
13 ౧౩ కానీ నేను చెవిటివాడిలాగా ఏమీ వినకుండా ఉన్నాను. మూగవాడిలాగా ఏమీ మాట్లాడకుండా ఉన్నాను.
14 ౧౪ ఏమీ విననివాడిలాగా నేను ఉన్నాను. జవాబు చెప్పలేని వాడిలాగా ఉన్నాను.
15 ౧౫ యెహోవా, నేను తప్పకుండా నీ కోసం వేచి ఉన్నాను. ప్రభూ, నా దేవా, నాకు నువ్వు జవాబిస్తావు.
16 ౧౬ నా శత్రువులు నాపై రెచ్చిపోకుండా ఉండటానికి నేనిది చెప్తున్నాను. నేను కాలు జారితే వాళ్ళు నన్ను భయంకరంగా హింసిస్తారు.
17 ౧౭ నేను పడిపోవడానికి సిద్ధంగా ఉన్నాను. నేను నిరంతర వేదనలో ఉన్నాను.
18 ౧౮ నా దోషాన్ని నేను ఒప్పుకుంటున్నాను. నా పాపాన్ని గూర్చి చింతిస్తున్నాను.
19 ౧౯ కానీ నా శత్రువులు అసంఖ్యాకంగా ఉన్నారు. అన్యాయంగా నన్ను ద్వేషించేవాళ్ళు చాలామంది ఉన్నారు.
20 ౨౦ నేను వాళ్లకు చేసిన మేలుకు బదులుగా కీడు చేస్తున్నారు. నేను ఉత్తమమైన దాన్ని అనుసరించినా వాళ్ళు నాపై నిందలు వేస్తున్నారు.
21 ౨౧ యెహోవా, నన్ను విడిచిపెట్టవద్దు. నా దేవా, నాకు దూరంగా ఉండవద్దు.
22 ౨౨ ప్రభూ, నా రక్షణకి ఆధారమా, త్వరగా వచ్చి నాకు సహాయం చెయ్యి.