< కీర్తనల~ గ్రంథము 140 >
1 ౧ ప్రధాన సంగీతకారుని కోసం, దావీదు కీర్తన యెహోవా, దుష్టుల బారి నుండి నన్ను విడిపించు. దుర్మార్గుల చేతుల్లో పడకుండా నన్ను కాపాడు.
2 ౨ వాళ్ళు తమ హృదయాల్లో ప్రమాదకరమైన తలంపులు పెట్టుకుంటారు. అన్నివేళలా కలహాలు పుట్టించాలని ఎదురు చూస్తుంటారు.
3 ౩ వాళ్ళు పాము నాలుకలాగా తమ నాలుకలు పదును చేసుకుంటారు. వారి పెదాల కింద పాము విషం ఉంచుకుంటారు. (సెలా)
4 ౪ యెహోవా, దుర్మార్గుల బారిన పడకుండా నన్ను కాపాడు. దౌర్జన్యపరుల చేతిలోనుండి నన్ను రక్షించు. నన్ను పడగొట్టడానికి వాళ్ళు పథకాలు వేస్తున్నారు.
5 ౫ గర్వాంధులు నాకోసం బోను పెట్టారు. వాళ్ళు దారి పక్కన వల పరిచారు. నన్ను బంధించడానికి ఉచ్చులు పన్నారు. (సెలా)
6 ౬ అయితే నేను యెహోవాతో ఇలా మనవి చేసుకుంటున్నాను, యెహోవా, నా దేవుడివి నువ్వే. నా విన్నపాలు ఆలకించు.
7 ౭ యెహోవా ప్రభూ, నువ్వే నాకు ఆశ్రయమిచ్చే కోట. యుద్ధ సమయంలో నా తలకు కాపు కాసే వాడివి నువ్వే.
8 ౮ యెహోవా, భక్తిహీనుల కోరికలను నేరవేర్చకు. వాళ్ళు మిడిసిపడకుండేలా వాళ్ళ పథకాలు భగ్నం చెయ్యి. (సెలా)
9 ౯ నా చుట్టూ మూగిన వాళ్ళ తల మీదికి వాళ్ళ మాటల ద్వారా కీడు కలుగు గాక.
10 ౧౦ కణకణలాడే నిప్పులు వాళ్ళపై కురియాలి. వాళ్ళను అగ్నిగుండంలో పడవెయ్యి. ఎన్నటికీ లేవకుండా అగాధంలో పడవెయ్యి.
11 ౧౧ దూషకులకు భూమి మీద భద్రత లేకుండా పోవాలి. దుర్మార్గులను ఆపదలు వెంటాడి పడగొట్టాలి.
12 ౧౨ బాధితుల తరపున యెహోవా వాదిస్తాడనీ. ఆయన దరిద్రులకు న్యాయం చేకూరుస్తాడని నాకు తెలుసు.
13 ౧౩ నీతిపరులు నీ నామానికి కచ్చితంగా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తారు. యథార్థవర్తనులు నీ సన్నిధిలో నివసిస్తారు.