< సామెతలు 16 >
1 ౧ మనుషుల హృదయాల్లోని ఆలోచనలు వాళ్ళ ఆధీనంలోనే ఉంటాయి. యెహోవా మాత్రమే శాంతి సమాధానాలు అనుగ్రహిస్తాడు.
2 ౨ ఒక వ్యక్తి ప్రవర్తన అతని దృష్టిలో సవ్యంగానే ఉంటుంది. యెహోవా ఆత్మలను పరిశోధిస్తాడు.
3 ౩ నీ పనుల భారమంతా యెహోవా మీద ఉంచు. అప్పుడు నీ ఆలోచనలు సఫలం అవుతాయి.
4 ౪ యెహోవా ప్రతి దానినీ దాని దాని పనుల కోసం నియమించాడు. మూర్ఖులు నాశనమయ్యే రోజు కోసం సృష్టింపబడ్డారు.
5 ౫ హృదయంలో గర్వం ఉన్నవాళ్ళు యెహోవాకు అసహ్యం. తప్పనిసరిగా వాళ్లు శిక్ష పొందుతారు.
6 ౬ నిబంధన విశ్వసనీయత, నమ్మకత్వం దోషానికి తగిన పరిహారం కలిగిస్తాయి. యెహోవా పట్ల భయభక్తులు కలిగి ఉన్నవాడు దుష్టత్వం నుండి దూరంగా తొలగిపోతాడు.
7 ౭ ఒకడి ప్రవర్తన యెహోవాకు ఇష్టమైతే ఆయన అతని శత్రువులను కూడా మిత్రులుగా చేస్తాడు.
8 ౮ అన్యాయంగా సంపాదించే అధికమైన సంపద కంటే నీతిగా వచ్చే కొంచెమైనా ఉత్తమం.
9 ౯ ఒకడు తాను చేయాలనుకున్నదంతా హృదయంలో ఆలోచించుకుంటాడు. అతని మార్గాన్ని యెహోవా స్థిరపరుస్తాడు.
10 ౧౦ రాజు నోటి నుండి దైవిక తీర్మానం వెలువడుతుంది. తీర్పు తీర్చునప్పుడు అతని మాట న్యాయం తప్పిపోదు.
11 ౧౧ న్యాయమైన త్రాసు, తూకం రాళ్లు యెహోవా నియమించాడు. సంచిలో ఉండే తూనిక గుళ్ళు ఆయన ఏర్పాటు.
12 ౧౨ రాజులు చెడ్డ పనులు జరిగించడం హేయమైన చర్య. సింహాసనం నిలిచేది న్యాయం మూలానే.
13 ౧౩ సరైన సంగతి సూటిగా మాట్లాడేవారు రాజులకు సంతోషం కలిగిస్తారు. నిజాయితీపరులు వారికి ఇష్టమైనవారు.
14 ౧౪ రాజుకు కోపం వస్తే మరణం దాపురిస్తుంది. జ్ఞానం ఉన్నవాడు ఆ కోపం చల్లారేలా చేస్తాడు.
15 ౧౫ రాజుల ముఖకాంతి వలన జీవం కలుగుతుంది. అతని అనుగ్రహం వసంతకాలంలో వాన కురిసే మేఘం లాంటిది.
16 ౧౬ విలువైన బంగారం సంపాదించడం కంటే జ్ఞానం సంపాదించడం ఎంతో శ్రేష్ఠం. వెండి సంపాదించడం కంటే తెలివితేటలు కోరుకోవడం ఉపయోగకరం.
17 ౧౭ నిజాయితీపరులకు దుష్ట ప్రవర్తన విడిచి నడుచుకోవడమే రాజమార్గం వంటిది. తన ప్రవర్తన కనిపెట్టుకుని ఉండేవాడు తన ప్రాణం కాపాడుకుంటాడు.
18 ౧౮ ఒకడి గర్వం వాడి పతనానికి దారి చూపుతుంది. అహంకారమైన మనస్సు నాశనానికి నడుపుతుంది.
19 ౧౯ దుర్మార్గులతో కలసి దోచుకున్న సొమ్ము పంచుకోవడం కంటే, వినయంతో దీన మనస్కులతో ఉండడం మంచిది.
20 ౨౦ ఉపదేశం శ్రద్ధగా ఆలకించే వారికి మేలు కలుగుతుంది. యెహోవాను ఆశ్రయం కోరేవాడు ధన్యుడు.
21 ౨౧ హృదయంలో జ్ఞానం నిండి ఉన్నవాడు వివేకవంతుడు. మధురమైన మాటలు విద్యాభివృద్ది కలిగిస్తాయి.
22 ౨౨ తెలివిగల వారికి వారి జ్ఞానం జీవం కలిగించే ఊట వంటిది. మూఢులకు వారి మూర్ఖత్వమే శిక్షగా మారుతుంది.
23 ౨౩ జ్ఞాని హృదయం వాడికి తెలివి బోధిస్తుంది. వాడి పెదాలకు నమ్రత జోడిస్తుంది.
24 ౨౪ మధురమైన మాటలు కమ్మని తేనె వంటివి. అవి ప్రాణానికి మాధుర్యం, ఎముకలకు ఆరోగ్యం.
25 ౨౫ ఒకడు నడిచే బాట వాడి దృష్టికి యథార్థం అనిపిస్తుంది. చివరకూ అది మరణానికి నడిపిస్తుంది.
26 ౨౬ కూలివాడి ఆకలే వాడి చేత అని చేయిస్తుంది. వాడి క్షుద్బాధ వాడు పనిచేసేలా తొందరపెడుతుంది.
27 ౨౭ దుష్టులు కీడు కలిగించడం కోసం కారణాలు వెతుకుతారు. వారి పెదాల మీద కోపాగ్ని రగులుతూ ఉంటుంది.
28 ౨౮ మూర్ఖుడు కలహాలు కల్పిస్తాడు. చాడీలు చెప్పేవాడు మిత్రులను విడదీస్తాడు.
29 ౨౯ దౌర్జన్యం చేసేవాడు తన పొరుగువాణ్ణి మచ్చిక చేసుకుంటాడు. చెడు మార్గంలో అతణ్ణి నడిపిస్తాడు.
30 ౩౦ కళ్ళు మూస్తూ పెదవులు బిగబట్టేవారు, కుయుక్తులు పన్నేవారు కీడు కలిగించే వారు.
31 ౩౧ నెరసిన వెంట్రుకలు సొగసైన కిరీటం వంటివి. అవి న్యాయమార్గంలో నడుచుకునే వారికి దక్కుతాయి.
32 ౩౨ పరాక్రమం గల యుద్ధవీరుని కంటే దీర్ఘశాంతం గలవాడు శ్రేష్ఠుడు. పట్టణాలను స్వాధీనం చేసుకునేవాడి కంటే తన మనస్సును అదుపులో ఉంచుకునేవాడు శ్రేష్ఠుడు.
33 ౩౩ చీట్లు ఒడిలో వేస్తారు. నిర్ణయం యెహోవాదే.