< సంఖ్యాకాండము 20 >
1 ౧ మొదటి నెలలో ఇశ్రాయేలీయుల సమాజమంతా సీను అనే నిర్జన బీడు ప్రాంతానికి వెళ్ళారు. వారు కాదేషులో శిబిరం వేసుకున్నారు. అక్కడ మిర్యాము చనిపోయింది. ఆమెను అక్కడ పాతిపెట్టారు.
2 ౨ ఆ సమాజానికి నీళ్లు లేనందువల్ల వారు మోషే అహరోనులకు విరోధంగా పోగయ్యారు.
3 ౩ ప్రజలు మోషేను విమర్శిస్తూ “మా తోటి ఇశ్రాయేలీయులు యెహోవా ముంగిట్లో చనిపోయినప్పుడు మేము కూడా చనిపోతే బాగుండేది!
4 ౪ మేమూ మా పశువులూ చనిపోడానికి యెహోవా సమాజాన్ని ఈ నిర్జన బీడు ప్రాంతంలోకి ఎందుకు తీసుకొచ్చావు?
5 ౫ ఈ భయంకరమైన ప్రాంతానికి మమ్మల్ని తీసుకు రావడానికి ఐగుప్తులోనుంచి మమ్మల్ని ఎందుకు రప్పించావు? ఈ ప్రాంతంలో గింజలు లేవు, అంజూరాలు లేవు, ద్రాక్షలు లేవు, దానిమ్మలు లేవు, తాగడానికి నీళ్ళే లేవు” అన్నారు.
6 ౬ అప్పుడు మోషే అహరోనులు సమాజం ఎదుట నుంచి సన్నిధి గుడారపు ద్వారం లోకి వెళ్లి సాగిలపడినప్పుడు, యెహోవా మహిమ వాళ్లకు కనిపించింది.
7 ౭ అప్పుడు యెహోవా మోషేతో,
8 ౮ “నువ్వు నీ కర్ర తీసుకుని, నువ్వూ, నీ సహోదరుడు అహరోను, ఈ సమాజం అంతట్నీటిని చేర్చి, వారి కళ్ళఎదుట ఆ బండతో మాట్లాడి, నీళ్ళు ప్రవహించమని దానికి ఆజ్ఞాపించు. నువ్వు వారి కోసం బండలోనుంచి నీళ్ళు రప్పించి, ఈ సమాజం, వారి పశువులూ తాగడానికి ఇవ్వాలి” అన్నాడు.
9 ౯ యెహోవా అతనికి ఆజ్ఞాపించినట్టు, మోషే ఆయన సన్నిధిలోనుంచి ఆ కర్ర తీసుకెళ్ళాడు.
10 ౧౦ తరువాత మోషే అహరోనులు ఆ బండ ఎదుట సమాజాన్ని సమకూర్చినప్పుడు అతడు వారితో “తిరుగుబాటు జనాంగమా, వినండి. మేము ఈ బండలోనుంచి మీకోసం నీళ్ళు రప్పించాలా?” అన్నారు.
11 ౧౧ అప్పుడు మోషే తన చెయ్యెత్తి రెండుసార్లు తన కర్రతో ఆ బండను కొట్టినప్పుడు నీళ్లు సమృద్ధిగా ప్రవహించాయి. ఆ సమాజం, పశువులూ తాగాయి.
12 ౧౨ అప్పుడు యెహోవా మోషే అహరోనులతో “మీరు ఇశ్రాయేలీయుల దృష్టిలో నన్ను నమ్మలేదు, నా పవిత్రత నిలబెట్టలేదు గనక, నేను ఈ సమాజానికి ఇచ్చిన దేశంలోకి మీరు వారిని తీసుకెళ్లలేరు” అన్నాడు.
13 ౧౩ ఈ నీళ్ళ ప్రాంతానికి మెరీబా అని పేరు. ఎందుకంటే ఇశ్రాయేలీయులు యెహోవాతో వాదించినప్పుడు ఆయన వారి మధ్య తన పవిత్రత చూపించుకున్నాడు.
14 ౧౪ మోషే కాదేషు నుంచి ఎదోము రాజు దగ్గరికి రాయబారులను పంపించి “నీ సహోదరుడు ఇశ్రాయేలు అడుగుతున్నది ఏమంటే, మాకొచ్చిన కష్టమంతా నీకు తెలుసు.
15 ౧౫ మా పితరులు ఐగుప్తుకు వెళ్ళారు. మేము చాలా రోజులు ఐగుప్తులో ఉన్నాం. ఐగుప్తీయులు మమ్మల్ని, మా పితరులను బాధల పాలు చేశారు.
16 ౧౬ మేము యెహోవాకు మొర్రపెట్టినప్పుడు ఆయన మా మొర విని, ఒక దూతను పంపించి ఐగుప్తులోనుంచి మమ్మల్ని రప్పించాడు. చూడు, మేము నీ సరిహద్దుల చివర ఉన్న కాదేషు పట్టణంలో ఉన్నాం.
17 ౧౭ మమ్మల్ని నీ దేశం గుండా దాటి వెళ్లనివ్వు. పొలాల్లోనుంచైనా, ద్రాక్షతోటల్లోనుంచైనా మేము వెళ్ళం. బావుల్లో నీళ్లు తాగం. రాజ మార్గంలో నడిచి వెళ్ళిపోతాం. నీ సరిహద్దులు దాటే వరకూ కుడివైపుకైనా. ఎడమవైపుకైనా తిరుగకుండా వెళ్ళిపోతాం” అని చెప్పించాడు.
18 ౧౮ కాని ఎదోము రాజు “నువ్వు నా దేశంలోగుండా వెళ్లకూడదు. అలా వెళ్తే, నేను ఖడ్గంతో నీ మీద దాడి చేస్తాను” అని జవాబిచ్చాడు.
19 ౧౯ అప్పుడు ఇశ్రాయేలీయులు అతనితో “మేము రాజమార్గంలోనే వెళ్తాం. మేము గాని, మా పశువులుగాని నీ నీళ్లు తాగితే, దాని ఖర్చు చెల్లిస్తాం. కేవలం మమ్మల్ని కాలినడకతో వెళ్లనివ్వు అంతే” అన్నారు. అప్పుడు అతడు “నువ్వు రాకూడదు” అన్నాడు.
20 ౨౦ అప్పుడు ఎదోము రాజు అనేకమంది సైన్యంతో, మహా బలంతో బయలుదేరి, వారి మీదకు వచ్చాడు.
21 ౨౧ ఎదోము రాజు ఇశ్రాయేలును తన సరిహద్దుల్లో గుండా దాటి వెళ్ళడానికి అనుమతించలేదు గనక ఇశ్రాయేలీయులు అతని దగ్గరనుంచి తిరిగి వెళ్ళిపోయారు.
22 ౨౨ అప్పుడు ఇశ్రాయేలీయుల సమాజమంతా కాదేషులోనుంచి ప్రయాణం చేసి హోరు కొండకు వచ్చారు.
23 ౨౩ యెహోవా ఎదోము పొలిమేరల దగ్గరున్న హోరు కొండ దగ్గర మోషే అహరోనులతో మాట్లాడుతూ,
24 ౨౪ “మీరిద్దరూ మెరీబా నీళ్ళ దగ్గర నా మాటలకు ఎదురు తిరిగారు గనక నేను ఇశ్రాయేలు ప్రజలకు ఇచ్చిన దేశంలో అహరోను ప్రవేశించకుండా, తన పితరులతో చేరిపోతాడు.
25 ౨౫ నువ్వు అహరోను, అతని కొడుకు ఎలియాజరును తీసుకుని హోరు కొండెక్కి,
26 ౨౬ అహరోను వస్త్రాలు తీసి అతని కొడుకు ఎలియాజరుకు తొడిగించు. అహరోను తన పితరులతో చేరి అక్కడ చనిపోతాడు” అన్నాడు.
27 ౨౭ యెహోవా ఆజ్ఞాపించినట్టు మోషే చేశాడు. సమాజమంతా చూస్తూ ఉన్నప్పుడు వారు హోరు కొండ ఎక్కారు.
28 ౨౮ మోషే అహరోను వస్త్రాలు తీసి, అతని కొడుకు ఎలియాజరుకు తొడిగించాడు. అహరోను కొండశిఖరం మీద చనిపోయాడు. తరువాత మోషే, ఎలియాజరు ఆ కొండ దిగి వచ్చారు.
29 ౨౯ అహరోను చనిపోయాడని సమాజమంతా గ్రహించినప్పుడు, ఇశ్రాయేలీయుల కుటుంబాలన్నీ అహరోను కోసం ముప్ఫై రోజులు శోకించారు.