< మత్తయి 27 >
1 ౧ తెల్లవారింది. ముఖ్య యాజకులు, ప్రజల పెద్దలందరు యేసును చంపించాలని ఆయనపై కుట్ర చేశారు.
2 ౨ ఆయనను బంధించి, తీసుకెళ్ళి రోమ్ గవర్నర్ పిలాతుకు అప్పగించారు.
3 ౩ అప్పుడు ఆయనను వారికి పట్టించి ఇచ్చిన యూదా, వారు ఆయనకు శిక్ష విధించడం చూసి పశ్చాత్తాపపడి, ఆ ముప్ఫై వెండి నాణాలు ప్రధాన యాజకుల, పెద్దల దగ్గరికి తీసుకొచ్చి,
4 ౪ “నేను నిరపరాధి రక్తాన్ని మీకు అప్పగించి పాపం చేశాను” అని చెప్పాడు. అందుకు వారు, “ఐతే మాకేంటి? దాని సంగతి నువ్వే చూసుకో” అని చెప్పారు.
5 ౫ అప్పుడతడు ఆ వెండి నాణాలు దేవాలయంలో విసిరేసి, వెళ్ళి ఉరి వేసుకున్నాడు.
6 ౬ ముఖ్య యాజకులు ఆ వెండి నాణాలు తీసుకుని “ఇది రక్తం కొన్న డబ్బు. కాబట్టి దీన్ని కానుక పెట్టెలో వేయడం ధర్మశాస్త్ర విరుద్ధం” అని చెప్పుకున్నారు.
7 ౭ వారు ఆలోచించి ఆ సొమ్ముతో పరదేశులను పాతిపెట్టడం కోసం ఒక కుమ్మరి వాడి పొలం కున్నారు.
8 ౮ ఆ పొలాన్ని నేటివరకూ “రక్త పొలం” అని పిలుస్తున్నారు.
9 ౯ దీనితో, “ఇశ్రాయేలు ప్రజలు ఆయనకు కట్టిన వెల, క్రయధనం ముప్ఫై వెండి నాణాలు.
10 ౧౦ వారు ప్రభువు నాకు నియమించిన ప్రకారం కుమ్మరి వాడి పొలం కోసం ఇచ్చారు” అని దేవుడు యిర్మీయా ప్రవక్త ద్వారా చెప్పిన మాట నెరవేరింది.
11 ౧౧ యేసు పిలాతు ఎదుట నిలబడ్డాడు. అప్పుడు పిలాతు, “నీవు యూదుల రాజువా?” అని ఆయనను అడిగాడు. యేసు, “నీవే అంటున్నావు గదా” అన్నాడు.
12 ౧౨ ముఖ్య యాజకులు, పెద్దలు ఆయన మీద నేరాలు మోపుతున్నప్పుడు ఆయన వాటికి ఏమీ జవాబు చెప్పలేదు.
13 ౧౩ కాబట్టి పిలాతు, “నీ మీద వీరు ఎన్ని నేరాలు మోపుతున్నారో నీవు వినడం లేదా?” అని ఆయనను అడిగాడు.
14 ౧౪ అయితే ఆయన ఒక్క మాటకైనా అతనికి జవాబు చెప్పకపోవడం పిలాతుకి చాలా ఆశ్చర్యం కలిగించింది.
15 ౧౫ ఆ పండగలో ప్రజలు కోరుకొనే ఒక ఖైదీని విడుదల చేయడం గవర్నరుకు వాడుక.
16 ౧౬ ఆ కాలంలో బరబ్బా అనే పేరు మోసిన ఒక బందిపోటు చెరసాలలో ఉన్నాడు.
17 ౧౭ కాబట్టి ప్రజలు తన దగ్గరికి వచ్చినప్పుడు పిలాతు వారిని ఇలా అడిగాడు, “నేను మీకు ఎవరిని విడుదల చేయాలి? బరబ్బనా లేక క్రీస్తు అని పిలిచే యేసునా?”
18 ౧౮ ఎందుకంటే వారు కేవలం అసూయతోనే ఆయనను అప్పగించారని అతనికి తెలుసు.
19 ౧౯ అతడు న్యాయపీఠం మీద కూర్చున్నప్పుడు అతని భార్య, “నీవు ఆ నిర్దోషి జోలికి పోవద్దు. ఈ రోజు నేను ఆయన గురించి కలలో బహు బాధపడ్డాను” అని అతనికి కబురు పంపింది.
20 ౨౦ ముఖ్య యాజకులు, పెద్దలు బరబ్బనే విడిపించమనీ యేసును చంపించాలని అడగమని జనసమూహాలను రెచ్చగొట్టారు.
21 ౨౧ పిలాతు, “ఈ ఇద్దరిలో నేనెవరిని విడుదల చేయాలని మీరు కోరుతున్నారు?” అని అడగగా వారు, “బరబ్బనే” అని అరిచారు.
22 ౨౨ అందుకు పిలాతు, “మరి క్రీస్తు అని పిలిచే ఈ యేసును ఏమి చెయ్యమంటారు?” అన్నాడు. వారంతా, “అతణ్ణి సిలువ వేయండి” అని కేకలు వేశారు.
23 ౨౩ పిలాతు, “ఎందుకు? ఇతడు ఏం నేరం చేశాడు?” అని అడిగినప్పుడు, వారు, “సిలువ వేయండి” అని ఇంకా ఎక్కువగా కేకలు వేశారు.
24 ౨౪ అల్లరి ఎక్కువౌతుందే గాని తన ప్రయత్నాలేమీ ఫలించడం లేదని గ్రహించి, పిలాతు నీళ్ళు తీసుకుని ఆ జనసమూహం ఎదుట చేతులు కడుక్కుని, “ఈ నీతిపరుని రక్తం విషయంలో నేను నిరపరాధిని, దీన్ని మీరే చూసుకోవాలి” అని చెప్పాడు.
25 ౨౫ అందుకు ప్రజలంతా, “అతడి రక్తం మా మీదా, మా పిల్లల మీదా ఉండుగాక” అన్నారు.
26 ౨౬ అప్పుడు పిలాతు వారు కోరినట్టే బరబ్బను విడుదల చేసి, యేసును కొరడాలతో కొట్టించి సిలువ వేయడానికి అప్పగించాడు.
27 ౨౭ అప్పుడు సైనికులు యేసును అధికార మందిరంలోకి తీసుకుపోయి, ఆయన ముందు సైనికులందరినీ పోగుచేశారు.
28 ౨౮ వారు ఆయన వస్త్రాలు తీసేసి, ఆయనకు ఎర్రని అంగీ తొడిగించారు.
29 ౨౯ ముళ్ళతో ఒక కిరీటం అల్లి ఆయన తలమీద పెట్టారు. ఆయన కుడి చేతిలో ఒక రెల్లు కర్ర ఉంచారు. అప్పుడు ఆయన ముందు మోకరించి, “యూదుల రాజా, నీకు శుభం!” అంటూ ఎగతాళి చేశారు.
30 ౩౦ ఆయన మీద ఉమ్మి వేసి, ఆ రెల్లు కర్రతో ఆయన తలమీద కొట్టారు.
31 ౩౧ అదంతా అయిన తరువాత ఆయనకు వేసిన అంగీ తీసివేసి ఆయన వస్త్రాలు ఆయనకు తొడిగించి, సిలువ వేయడానికి తీసుకు వెళ్ళారు.
32 ౩౨ వారు బయటికి వస్తూ ఉండగా కురేనే ప్రాంతానికి చెందిన సీమోను అనే వ్యక్తి కనిపించాడు. వారు బలవంతంగా అతని చేత ఆయన సిలువను మోయించారు.
33 ౩౩ వారు, “కపాల స్థలం” అని అర్థమిచ్చే ‘గొల్గొతా’ అనే చోటికి వచ్చారు.
34 ౩౪ అక్కడ చేదు కలిపిన ద్రాక్షారసాన్ని తాగడానికి ఆయనకు అందించారు గాని ఆయన దాన్ని రుచి చూసి తాగలేక నిరాకరించాడు.
35 ౩౫ వారు ఆయనను సిలువ వేసిన తరవాత చీట్లు వేసి ఆయన బట్టలు పంచుకున్నారు.
36 ౩౬ అక్కడే ఆయనకు కావలిగా కూర్చున్నారు.
37 ౩౭ “ఇతడు యూదుల రాజైన యేసు’’ అని ఆయన మీద మోపిన నేరం రాసి ఉన్న ప్రకటన ఒకటి ఆయన తలకు పైన ఉంచారు.
38 ౩౮ ఆయన కుడి వైపున ఒకడు, ఎడమ వైపున ఒకడు ఇద్దరు బందిపోటు దొంగలను కూడా సిలువవేశారు.
39 ౩౯ ఆ దారిన వెళ్ళేవారు తలలూపుతూ,
40 ౪౦ “దేవాలయాన్ని పడగొట్టి మూడు రోజుల్లో కట్టేవాడా, నిన్ను నీవే రక్షించుకో. నీవు దేవుని కుమారుడివైతే సిలువ మీద నుండి దిగిరా!” అంటూ ఆయనను తిట్టారు.
41 ౪౧ అలాగే ధర్మశాస్త్ర పండితులూ, పెద్దలూ, ప్రధాన యాజకులూ ఆయనను వెక్కిరిస్తూ,
42 ౪౨ “ఇతడు ఇతరులను రక్షించాడు గానీ తనను రక్షించుకోలేడు. ఇశ్రాయేలు రాజు గదా, అతడిప్పుడు సిలువ మీద నుండి దిగి వస్తే అతణ్ణి నమ్ముతాం.
43 ౪౩ ఇతడు దేవునిలో విశ్వాసం ఉన్నవాడు గదా, తాను దేవుని కుమారుణ్ణి అని చెప్పాడు గదా. కాబట్టి ఆయనకిష్టమైతే దేవుడే ఇతన్ని తప్పిస్తాడు” అని హేళనగా మాట్లాడారు.
44 ౪౪ ఆయనతోబాటు సిలువ వేసిన దోపిడీ దొంగలు కూడా ఆయనను అలాగే నిందించారు.
45 ౪౫ మధ్యాహ్నం పన్నెండు గంటల నుండి మూడు గంటల వరకూ దేశమంతా చీకటి కమ్మింది.
46 ౪౬ సుమారు మూడు గంటలప్పుడు యేసు, “ఏలీ, ఏలీ, లామా సబక్తానీ” అని పెద్దగా కేక వేశాడు. ఆ మాటకు, “నా దేవా, నా దేవా, నా చెయ్యి ఎందుకు విడిచిపెట్టావు?” అని అర్థం.
47 ౪౭ అక్కడ నిలబడిన వారిలో కొందరు ఆ మాట విని, “అతడు ఏలీయాను పిలుస్తున్నాడు” అన్నారు.
48 ౪౮ వెంటనే వారిలో ఒకడు పరిగెత్తుకుంటూ వెళ్ళి, స్పాంజ్ తెచ్చి పులిసిన ద్రాక్షరసంలో ముంచి, రెల్లు కర్రకు తగిలించి ఆయనకు తాగడానికి అందించాడు.
49 ౪౯ మిగిలిన వారు, “ఉండండి, ఏలీయా వచ్చి ఇతణ్ణి రక్షిస్తాడేమో చూద్దాం” అన్నారు.
50 ౫౦ యేసు మళ్ళీ పెద్దగా కేక వేసి ప్రాణం విడిచాడు.
51 ౫౧ అప్పుడు దేవాలయంలోని తెర పైనుండి కింది వరకూ రెండుగా చినిగింది. భూమి కంపించింది, బండలు బద్దలయ్యాయి.
52 ౫౨ సమాధులు తెరుచుకున్నాయి. కన్ను మూసిన అనేక మంది పరిశుద్ధుల శరీరాలు సజీవంగా లేచాయి.
53 ౫౩ వారు సమాధుల్లో నుండి బయటికి వచ్చి ఆయన పునరుత్థానం చెందిన తరువాత పవిత్ర నగరంలో ప్రవేశించి చాలామందికి కనిపించారు.
54 ౫౪ రోమా శతాధిపతి, అతనితో యేసుకు కావలి ఉన్నవారు, భూకంపాన్ని, జరిగిన సంఘటనలను చూసి చాలా భయపడ్డారు. “ఈయన నిజంగా దేవుని కుమారుడే” అని వారు చెప్పుకున్నారు.
55 ౫౫ యేసుకు ఉపచారం చేయడానికి గలిలయ నుండి ఆయన వెంట వచ్చిన అనేకమంది స్త్రీలు అక్కడ దూరంగా నిలబడి చూస్తున్నారు.
56 ౫౬ వారిలో మగ్దలేనే మరియ, యాకోబు, యోసేపు అనే వారి తల్లి అయిన మరియ, జెబెదయి కుమారుల తల్లి ఉన్నారు.
57 ౫౭ ఆ సాయంకాలం అప్పటికే యేసు శిష్యుడుగా ఉండిన అరిమతయి యోసేపు అనే ఒక ధనవంతుడు వచ్చాడు.
58 ౫౮ అతడు పిలాతు దగ్గరికి వెళ్ళి, యేసు దేహాన్ని తనకు ఇప్పించమని విన్నవించుకున్నాడు. పిలాతు దాన్ని అతనికి అప్పగించమని ఆజ్ఞాపించాడు.
59 ౫౯ యోసేపు ఆ దేహాన్ని తీసుకుని శుభ్రమైన నారబట్టతో చుట్టాడు.
60 ౬౦ తాను రాతిలో తొలిపించుకున్న తన కొత్త సమాధిలో దాన్ని పెట్టాడు. తరువాత పెద్ద రాయితో సమాధి ద్వారాన్ని మూసివేసి వెళ్ళిపోయాడు.
61 ౬౧ మగ్దలేనే మరియ, వేరొక మరియ అక్కడే సమాధికి ఎదురుగా కూర్చుని ఉన్నారు.
62 ౬౨ ఆ తరువాతి రోజు, అంటే విశ్రాంతి దినానికి సిద్ధపడే రోజుకు తరువాతి రోజు ముఖ్య యాజకులు, పరిసయ్యులు పిలాతు దగ్గరికి వెళ్ళి,
63 ౬౩ “అయ్యా, ఆ మోసగాడు జీవించి ఉన్నప్పుడు ‘మూడు రోజుల తరువాత నేను సజీవంగా తిరిగి లేస్తాను’ అని చెప్పిన మాట మాకు జ్ఞాపకం ఉంది.
64 ౬౪ కాబట్టి మూడవ రోజు వరకూ సమాధిని భద్రం చేయమని ఆజ్ఞాపించండి. ఒకవేళ అతని శిష్యులు అతణ్ణి ఎత్తుకుపోయి ‘ఆయన మృతుల్లో నుండి సజీవంగా లేచాడు’ అని ప్రజల్లో ప్రచారం చేస్తారేమో. అదే జరిగితే మొదటి వంచన కంటే చివరి వంచన మరింత చెడ్డదౌతుంది” అన్నారు.
65 ౬౫ అందుకు పిలాతు, “కావలి వారున్నారు గదా, మీరు వెళ్ళి మీ శక్తి మేర సమాధిని భద్రం చేయండి” అని వారితో చెప్పాడు.
66 ౬౬ వారు వెళ్ళి రాతికి ముద్ర వేసి సమాధికి కావలి వారిని ఏర్పాటు చేశారు.