< మత్తయి 16 >
1 ౧ అప్పుడు పరిసయ్యులు, సద్దూకయ్యులు వచ్చి ఆయనను పరీక్షించడానికి తమ కోసం పరలోకం నుండి ఒక అద్భుతం చెయ్యమని అడిగారు.
2 ౨ ఆయన వారితో ఇలా అన్నాడు, “సాయంకాలం ఆకాశం ఎర్రగా ఉంది కాబట్టి వర్షం కురవదనీ,
3 ౩ అదే ఆకాశం ఉదయం ఎర్రగా, మబ్బులతో ఉంది కాబట్టి గాలివాన వస్తుందనీ మీరు చెబుతారు కదా. ఆకాశంలోని సూచనలు మీకు తెలుసు గాని ఈ కాలాల సూచనలు మాత్రం గుర్తించలేరు.
4 ౪ సూచక క్రియలు అడిగే ఈ తరం దుష్టత్వంతో, వ్యభిచారంతో నిండి ఉంది. యోనా ప్రవక్త గురించినది తప్ప మరే సూచనా ఈ తరానికి ఇవ్వడం జరగదు.” ఆ వెంటనే ఆయన వారిని విడిచి వెళ్ళిపోయాడు.
5 ౫ అవతలి ఒడ్డుకు చేరినప్పుడు ఆయన శిష్యులు రొట్టెలు తెచ్చుకోవడం మర్చిపోయారు.
6 ౬ అప్పుడు యేసు, “పరిసయ్యులు, సద్దూకయ్యులు అనే పొంగజేసే పిండిని గురించి జాగ్రత్త పడండి” అని వారితో అన్నాడు.
7 ౭ అయితే శిష్యులు “మనం రొట్టెలు తేకపోవడం చేత ఇలా అన్నాడు” అని తమలో తాము చర్చించుకున్నారు.
8 ౮ యేసుకు అది తెలిసి, “అల్పవిశ్వాసులారా, మీరు రొట్టెలు తీసుకు రాని విషయం గురించి ఎందుకు ఆలోచిస్తున్నారు?
9 ౯ “మీరింకా గ్రహించలేదా? ఐదు రొట్టెలు ఐదు వేలమంది తిన్న తరువాత ఎన్ని పెద్ద గంపలు ఎత్తారో,
10 ౧౦ ఏడు రొట్టెలు నాలుగు వేలమంది తిన్న తరువాత ఎన్ని పెద్ద గంపలు ఎత్తారో అవేమీ మీకు గుర్తు లేదా?
11 ౧౧ నేను మీతో మాట్లాడింది రొట్టెలను గురించి కాదని ఎందుకు గ్రహించరు? పరిసయ్యులు, సద్దూకయ్యులు అనే పొంగజేసేపిండిని గురించి జాగ్రత్త పడండి” అని వారితో చెప్పాడు.
12 ౧౨ అప్పుడు రొట్టెల్లో వాడే పొంగజేసే పదార్థాన్ని గురించి కాక పరిసయ్యులు, సద్దూకయ్యులు చేసే బోధ విషయంలో జాగ్రత్తపడమని ఆయన తమతో చెప్పాడని శిష్యులు గ్రహించారు.
13 ౧౩ యేసు కైసరయ ఫిలిప్పీ ప్రాంతాలకు వచ్చినపుడు తన శిష్యులను ఇలా అడిగాడు, “మనుష్య కుమారుడు ఎవరని ప్రజలు మాట్లాడుకుంటున్నారు?”
14 ౧౪ వారు, “కొందరేమో నీవు బాప్తిసమిచ్చే యోహానువనీ, మరి కొందరు ఏలీయావనీ, కొందరు యిర్మీయావనీ, లేక ఎవరో ఒక ప్రవక్తవనీ అనుకొంటున్నారు” అన్నారు.
15 ౧౫ “అయితే మీరు నేనెవరినని భావిస్తున్నారు?” అని వారిని అడిగాడు.
16 ౧౬ వెంటనే సీమోను పేతురు, “నీవు అభిషిక్తుడివి! సజీవుడైన దేవుని కుమారుడివి!” అని చెప్పాడు.
17 ౧౭ అందుకు యేసు అతనితో ఇలా అన్నాడు, “యోనా కుమారా, సీమోనూ, నీవు ధన్యుడివి. ఎందుకంటే ఈ సత్యం నీకు వెల్లడి చేసింది పరలోకంలోని నా తండ్రే గాని మానవ మాత్రులు కాదు.
18 ౧౮ ఇంకో విషయం, నీవు పేతురువి. ఈ బండమీద నా సంఘాన్ని నిర్మిస్తాను. పాతాళ లోకపు ద్వారాలు దాన్ని ఎదిరించి నిలబడలేవు. (Hadēs )
19 ౧౯ పరలోక రాజ్యపు తాళాలు నీకిస్తాను. నీవు భూమి మీద దేనిని బంధిస్తావో దాన్ని పరలోకంలో బంధించడం, దేనిని విడిపిస్తావో దాన్ని పరలోకంలో విడిపించడం జరుగుతుంది.”
20 ౨౦ అప్పుడు తానే క్రీస్తు అని ఎవరికీ చెప్పవద్దని యేసు తన శిష్యులకు గట్టిగా ఆజ్ఞాపించాడు.
21 ౨౧ అప్పటినుంచి యేసు తాను యెరూషలేము వెళ్ళి అక్కడి పెద్దల, ప్రధాన యాజకుల, ధర్మశాస్త్ర పండితుల చేతుల్లో అనేక హింసలు పొంది, చనిపోయి, మూడవ రోజు తిరిగి సజీవంగా లేవడం తప్పనిసరి అని తన శిష్యులతో చెప్పడం మొదలుపెట్టాడు.
22 ౨౨ అప్పుడు పేతురు ఆయన్ని ఒక పక్కకి తీసుకు పోయి, “ప్రభూ, అది నీకు దూరమవుతుంది, నీకలా ఎప్పటికీ జరగదు” అని గద్దింపుగా అన్నాడు.
23 ౨౩ అయితే యేసు పేతురు వైపు తిరిగి, “సాతానూ, నా వెనక్కి పో! నువ్వు నాకు దారిలో అడ్డుబండగా ఉన్నావు. నీవు దేవుని సంగతులపై కాక మనుషుల సంగతుల పైనే మనసు పెడుతున్నావు” అన్నాడు.
24 ౨౪ అప్పుడు యేసు తన శిష్యులతో, “ఎవరైనా నాతో కలిసి నడవాలనుకుంటే, వాడు తనను తాను తిరస్కరించుకుని, తన సిలువను మోసుకుంటూ రావాలి.
25 ౨౫ తన ప్రాణాన్ని కాపాడుకోవాలని చూసేవాడు దాన్ని పోగొట్టుకుంటాడు. నా కోసం తన ప్రాణాన్ని కోల్పోయేవాడు దాన్ని దక్కించుకుంటాడు.
26 ౨౬ ఒక మనిషి ఈ ప్రపంచమంతా సంపాదించుకుని తన ప్రాణాన్ని కోల్పోతే అతనికేం లాభం? తన ప్రాణానికి బదులుగా మనిషి దేనిని ఇవ్వగలడు?
27 ౨౭ మనుష్య కుమారుడు తన తండ్రి మహిమతో దూతలను తోడుకుని వస్తాడు. అప్పుడు ఆయన ప్రతి వ్యక్తికీ వాడు చేసిన పనుల ప్రకారం ప్రతిఫలం ఇస్తాడు.
28 ౨౮ నేను మీతో కచ్చితంగా చెబుతున్నదేమంటే, ఇక్కడ నిలబడి ఉన్నవారిలో కొంతమంది మనుష్య కుమారుడు తన రాజ్యంతో రావడం చూసేవరకూ మరణించరు” అని చెప్పాడు.