< లూకా 4 >
1 ౧ యేసు పరిశుద్ధాత్మతో నిండి యొర్దాను నది నుండి తిరిగి వచ్చాడు. పరిశుద్ధాత్మ ఆయనను అరణ్యంలోకి నడిపించాడు.
2 ౨ అక్కడ నలభై రోజులు సాతాను ఆయనను విషమ పరీక్షలకు గురి చేశాడు. ఆ రోజుల్లో ఆయన ఏమీ తినలేదు. ఆ తరువాత ఆయనకు ఆకలి వేసింది.
3 ౩ సాతాను ఆయనతో, “నీవు దేవుడి కుమారుడివైతే, ఈ రాయిని రొట్టె అయిపోమని ఆజ్ఞాపించు” అన్నాడు.
4 ౪ యేసు, “‘మనిషి రొట్టె వలన మాత్రమే బతకడు’ అని రాసి ఉంది” అని జవాబిచ్చాడు.
5 ౫ అప్పుడు సాతాను ఆయనను ఎత్తయిన కొండ మీదికి తీసుకు వెళ్ళి, ప్రపంచ రాజ్యాలన్నీ ఒక్క క్షణంలో ఆయనకు చూపించాడు.
6 ౬ “ఈ రాజ్యాధికారమంతా వాటి వైభవాలతో పాటు నీకిస్తాను. దానిపై అధికారం నాదే. అది ఎవరికివ్వడం నా ఇష్టమో వారికిస్తాను.
7 ౭ కాబట్టి నీవు నాకు మొక్కి నన్ను పూజిస్తే ఇదంతా నీదే” అని ఆయనతో చెప్పాడు.
8 ౮ అయితే యేసు, “‘నీ దేవుడైన ప్రభువును పూజించి ఆయనను మాత్రమే సేవించాలి’ అని రాసి ఉంది” అని జవాబిచ్చాడు.
9 ౯ ఆ తరువాత సాతాను యేసును యెరూషలేముకు తీసుకువెళ్ళి దేవాలయ గోపురంపై ఉంచి, “నీవు దేవుని కుమారుడివైతే ఇక్కడ నుండి కిందికి దూకు.
10 ౧౦ ‘దేవుడు నిన్ను కాపాడడానికి నిన్ను గురించి తన దూతలకు ఆజ్ఞాపిస్తాడు.
11 ౧౧ నీ పాదాలకు రాయి తగలకుండా వారు నిన్ను తమ చేతుల్లో ఎత్తిపట్టుకుంటారు’ అని రాసి ఉంది గదా,” అని ఆయనతో అన్నాడు.
12 ౧౨ అయితే యేసు, “‘నీ దేవుడైన ప్రభువును పరీక్షించకూడదు’ అని రాసి ఉంది” అని జవాబిచ్చాడు.
13 ౧౩ సాతాను, యేసును అన్ని రకాలుగా పరీక్షించడం ముగించి మరొక అవకాశం వచ్చేవరకూ ఆయనను విడిచి వెళ్ళిపోయాడు.
14 ౧౪ అప్పుడు యేసు పరిశుద్ధాత్మ శక్తితో గలిలయకు తిరిగి వెళ్ళిపోయాడు. ఆయనను గురించిన సమాచారం ఆ ప్రాంతమంతా వ్యాపించింది.
15 ౧౫ ఆయన వారి సమాజ మందిరాల్లో బోధిస్తుంటే అందరూ ఆయనను మెచ్చుకున్నారు.
16 ౧౬ ఒక రోజు తాను పెరిగిన నజరేతుకు ఆయన వచ్చాడు. తన అలవాటు ప్రకారం విశ్రాంతి దినాన సమాజ మందిరానికి వెళ్ళి చదవడానికి నిలబడ్డాడు.
17 ౧౭ యెషయా ప్రవక్త గ్రంథం వారు ఆయనకు అందించారు. ఆయన గ్రంథం విప్పితే,
18 ౧౮ “ప్రభువు ఆత్మ నా మీద ఉన్నాడు. పేదలకు సువార్త ప్రకటించడానికి ఆయన నన్ను అభిషేకించాడు. చెరలో ఉన్న వారికి స్వేచ్ఛ, గుడ్డివారికి చూపు వస్తుందని ప్రకటించడానికీ అణగారిన వారిని విడిపించడానికీ,
19 ౧౯ ప్రభువు అనుగ్రహ సంవత్సరం ప్రకటించడానికీ ఆయన నన్ను పంపాడు” అని రాసిన చోటు ఆయనకు దొరికింది.
20 ౨౦ ఆయన గ్రంథం మూసి సమాజ మందిర పరిచారకునికి ఇచ్చి కూర్చున్నాడు.
21 ౨౧ సమాజ మందిరంలో ఉన్న వారంతా ఆయనను తేరి చూశారు. “మీరు వింటూ ఉండగానే ఈ లేఖనం నెరవేరింది” అని ఆయన వారితో అన్నాడు.
22 ౨౨ అందరూ ఆయనను గురించి గొప్పగా చెప్పుకున్నారు. ఆయన నోటి నుంచి వచ్చే దయాపూరితమైన మాటలకు ఆశ్చర్యపడ్డారు. “ఈయన యోసేపు కొడుకు గదా?” అని చెప్పుకున్నారు.
23 ౨౩ ఆయన వారితో, “వైద్యుడా, నిన్ను నీవే బాగు చేసుకో” అనే సామెత నాకు చెప్పి, కపెర్నహూములో నీవు చేసిన వాటన్నిటినీ మేము విన్నాం, వాటిని ఈ నీ సొంత ఊరులో కూడా చేయమని మీరు తప్పకుండా నాతో అంటారు” అన్నాడు.
24 ౨౪ ఆయన ఇంకా ఇలా అన్నాడు, “ఏ ప్రవక్తనూ తన సొంత ఊరి వారు అంగీకరించరు.
25 ౨౫ ఏలీయా ప్రవక్త రోజుల్లో ఇశ్రాయేలు దేశంలో చాలామంది వితంతువులు ఉన్నారు. మూడున్నర సంవత్సరాలు ఆకాశం మూసుకుపోయి దేశమంతా తీవ్రమైన కరువు రాగా,
26 ౨౬ దేవుడు ఏలీయాను ఎవరి దగ్గరకీ పంపలేదు. సీదోను ప్రాంతంలో సారెపతు అనే ఊరిలో ఉన్న ఒక వితంతువు దగ్గరకే పంపాడు.
27 ౨౭ ఎలీషా ప్రవక్త కాలంలో ఇశ్రాయేలులో ఎందరో కుష్టురోగులున్నా, సిరియా వాడైన నయమాను తప్ప ఎవరూ బాగుపడలేదు.”
28 ౨౮ సమాజ మందిరంలో ఉన్నవారంతా ఆ మాటలు విని
29 ౨౯ ఆగ్రహంతో నిండిపోయి, లేచి ఆయనను ఊరి బయటకు తోసుకుపోయి కొండ కొమ్ము వరకూ తీసికెళ్ళారు. వారి ఊరు కొండ పైన ఉంది. ఆయనను అక్కడ నుండి పడదోయాలనుకున్నారు.
30 ౩౦ అయితే ఆయన వారి మధ్యనుంచి తప్పుకుని తన దారిన వెళ్ళిపోయాడు.
31 ౩౧ అప్పుడాయన గలిలయ ప్రాంతంలోని కపెర్నహూము అనే ఊరు వచ్చి, విశ్రాంతి దినాన వారికి బోధించాడు.
32 ౩౨ వారాయన బోధకు ఆశ్చర్యపడ్డారు. ఎందుకంటే ఆయన సాధికారికంగా మాట్లాడాడు.
33 ౩౩ ఆ సమాజ మందిరంలో అపవిత్ర దయ్యపు ఆత్మ పట్టిన వాడొకడున్నాడు. అతడు బిగ్గరగా ఇలా కేకలు వేశాడు,
34 ౩౪ “నజరేతువాడా యేసూ, మాతో నీకేం పని? మమ్మల్ని నాశనం చేయడానికి వచ్చావా? నీవెవరో నాకు తెలుసు. నీవు దేవుని పరిశుద్ధుడివి.”
35 ౩౫ యేసు, “ఊరుకో! ఇతనిలో నుండి బయటకు రా” అని దయ్యాన్ని ఆజ్ఞాపించాడు. దయ్యం అతణ్ణి వారి మధ్యలో కింద పడేసి అతనికి ఏ హానీ చేయకుండా అతనిలో నుండి బయటికి వచ్చేసింది.
36 ౩౬ అందరూ ఆశ్చర్య పడ్డారు. “ఇది ఎలాటి మాట, ఈయన అధికారంతో ప్రభావంతో దయ్యాలకు ఆజ్ఞాపిస్తుంటే అవి బయటికి వచ్చేస్తున్నాయి” అని ఒకరితో ఒకరు చెప్పుకున్నారు.
37 ౩౭ అప్పుడు ఆయనను గురించిన సమాచారం ఆ చుట్టుపక్కల ప్రాంతమంతా పాకిపోయింది.
38 ౩౮ ఆయన సమాజ మందిరం నుండి, సీమోను ఇంటికి వెళ్ళాడు. సీమోను అత్త తీవ్రమైన జ్వరంతో బాధపడుతూ ఉంది. ఆమెను బాగు చేయాలని వారాయన్ని బతిమిలాడారు.
39 ౩౯ ఆయన ఆమె దగ్గర నిలబడి జ్వరాన్ని మందలించగానే జ్వరం ఆమెను విడిచింది. వెంటనే ఆమె లేచి వారికి సేవ చేయసాగింది.
40 ౪౦ పొద్దుగుంకుతున్నపుడు అనేక రకాల జబ్బులున్న వారిని యేసు దగ్గరికి తెచ్చారు. వారిలో ప్రతి ఒక్కరి మీదా ఆయన చేతులుంచి బాగు చేశాడు.
41 ౪౧ వారిలో చాలామందిలో నుండి దయ్యాలు, “నీవు దేవుని కుమారుడివి” అని కేకలు వేస్తూ బయటికి వెళ్ళిపోయాయి. ఆయన క్రీస్తు అని వాటికి తెలుసు కాబట్టి ఆయన వాటిని గద్దించి వాటిని మాట్లాడనివ్వలేదు.
42 ౪౨ తెల్లవారినప్పుడు ఆయన బయలుదేరి ఒక ఏకాంత స్థలానికి వెళ్ళాడు. ప్రజలు గుంపులుగా ఆయనను వెదుకుతూ ఆయన ఉన్న చోటికి వచ్చారు. తమ దగ్గర నుండి వెళ్ళిపోకుండా ఆయనను ఆపాలని చూశారు.
43 ౪౩ అయితే ఆయన, “నేనింకా చాలా ఊళ్ళలో దేవుని రాజ్య సువార్తను ప్రకటించాలి. దీని కోసమే దేవుడు నన్ను పంపాడు” అని వారితో చెప్పాడు.
44 ౪౪ ఆపైన ఆయన యూదయ ప్రాంతమంతటా ఉన్న సమాజ మందిరాల్లో ప్రకటిస్తూ వచ్చాడు.