< లూకా 10 >
1 ౧ ఆ తరువాత ప్రభువు డెబ్భై మంది ఇతర శిష్యులను కూడా నియమించి తాను వెళ్ళబోయే ప్రతి ఊరికీ, ప్రతి చోటికీ ఇద్దరిద్దరిని తనకంటే ముందుగా పంపించాడు.
2 ౨ వారిని పంపిస్తూ ఆయన వారితో ఇలా అన్నాడు, “కోత ఎక్కువగా ఉంది. పనివారు తక్కువగా ఉన్నారు. కాబట్టి పనివారిని పంపమని కోత యజమానిని వేడుకోండి.
3 ౩ మీరు వెళ్ళండి. ఇదిగో వినండి, తోడేళ్ళ మధ్యకు గొర్రె పిల్లలను పంపినట్టు నేను మిమ్మల్ని పంపుతున్నాను.
4 ౪ మీరు డబ్బుగానీ సంచిగానీ చెప్పులుగానీ తీసుకువెళ్ళవద్దు. దారిలో ఎవరినీ పలకరించవద్దు.
5 ౫ మీరు ఏ ఇంట్లోనైనా ప్రవేశిస్తే, ముందుగా ‘ఈ ఇంటికి శాంతి కలుగు గాక,’ అని చెప్పండి.
6 ౬ శాంతికి అర్హుడు ఆ ఇంట్లో ఉంటే మీ శాంతి అతని మీద ఉంటుంది. లేకపోతే అది మీకు తిరిగి వస్తుంది.
7 ౭ వారు మీకు పెట్టే పదార్థాలను తింటూ తాగుతూ ఆ ఇంట్లోనే ఉండండి. ఎందుకంటే పనివాడు జీతానికి పాత్రుడు. ఇంటింటికీ తిరగవద్దు.
8 ౮ మీరు ఏదైనా ఊరిలో ప్రవేశించినప్పుడు అక్కడి వారు మిమ్మల్ని స్వీకరిస్తే వారు మీ ఎదుట పెట్టినవి తినండి.
9 ౯ ఆ ఊరిలో ఉన్న రోగులను బాగు చేయండి. ‘దేవుని రాజ్యం మీ దగ్గరికి వచ్చింది’ అని వారికి ప్రకటించండి.
10 ౧౦ ఒకవేళ ఏ ఊరి వారైనా మిమ్మల్ని స్వీకరించక పోతే,
11 ౧౧ మీరు ఆ ఊరి వీధుల్లోకి వెళ్ళి, ‘మా కాళ్ళకు అంటిన మీ పట్టణం దుమ్మును మీ ముందే దులిపి వేస్తున్నాం. అయినా దేవుని రాజ్యం సమీపించిందని తెలుసుకోండి’ అని చెప్పండి.
12 ౧౨ తీర్పు రోజున ఆ ఊరికి పట్టే గతి కంటే సొదొమ పట్టణానికి పట్టిన గతే ఓర్చుకోదగినది అవుతుందని మీతో చెబుతున్నాను.
13 ౧౩ “అయ్యో కొరాజీనూ, నీకు యాతన. అయ్యో బేత్సయిదా, నీకు యాతన. మీ మధ్య చేసిన అద్భుతాలు తూరు సీదోను పట్టణాల్లో చేస్తే ఆ పట్టణాల్లోని వారు ముందే గోనె పట్ట కట్టుకుని బూడిదెలో కూర్చుని మనసు మార్చుకుని ఉండేవారు.
14 ౧౪ అయినా తీర్పు రోజున మీ గతి కంటే తూరు, సీదోను పట్టణాల గతి ఓర్చుకోదగినదిగా ఉంటుంది.
15 ౧౫ కపెర్నహూమా, ఆకాశం వరకూ హెచ్చించుకున్నా నువ్వు పాతాళం వరకూ దిగిపోతావు. (Hadēs )
16 ౧౬ మీ మాట వినే వాడు నా మాటా వింటాడు. మిమ్మల్ని నిరాకరించే వాడు నన్నూ నిరాకరిస్తాడు. నన్ను నిరాకరించేవాడు నన్ను పంపిన వాణ్ణి నిరాకరిస్తాడు.”
17 ౧౭ ఆ డెబ్భై మంది శిష్యులు సంతోషంతో తిరిగి వచ్చి, “ప్రభూ, దయ్యాలు కూడా నీ పేరు చెబితే మాకు లోబడుతున్నాయి” అని చెప్పారు.
18 ౧౮ అప్పుడు ఆయన, “సాతాను మెరుపులా ఆకాశం నుండి పడడం చూశాను.
19 ౧౯ ఇదిగో వినండి, పాములనూ, తేళ్లనూ తొక్కడానికి శత్రువు బలమంతటి మీదా మీకు అధికారం ఇచ్చాను. మీకు ఏదీ ఏ మాత్రమూ హని చేయదు.
20 ౨౦ అయినా దయ్యాలు లోబడుతున్నాయని కాదు, మీ పేర్లు పరలోకంలో రాసి ఉన్నాయని సంతోషించండి” అని వారికి చెప్పాడు.
21 ౨౧ ఆ సమయంలోనే యేసు పరిశుద్ధాత్మలో ఎంతో ఆనందించాడు. “తండ్రీ, ఆకాశానికీ భూమికీ ప్రభూ, నువ్వు ఈ సంగతులను జ్ఞానులకూ, తెలివైన వారికీ దాచిపెట్టి పసివారికి వెల్లడి పరిచావని నిన్ను కీర్తిస్తున్నాను. అవును తండ్రీ, అలా చేయడం నీకు అనుకూలం ఆయింది.”
22 ౨౨ “నా తండ్రి నాకు అన్నిటినీ అప్పగించాడు. కుమారుణ్ణి తండ్రి తప్ప మరెవరూ ఎరగరు. అలాగే తండ్రి ఎవరో కుమారుడూ, ఆ కుమారుడు ఎవరికి ఆయనను వెల్లడి చేయడానికి ఇష్టపడతాడో అతడూ తప్ప ఇంకెవరూ ఎరగరు.”
23 ౨౩ అప్పుడు ఆయన తన శిష్యుల వైపు తిరిగి ఏకాంతంగా వారితో, “మీరు చూస్తున్న వాటిని చూసే కళ్ళు ధన్యమైనాయి.
24 ౨౪ అనేకమంది ప్రవక్తలూ, రాజులూ మీరు చూస్తున్న వాటిని చూడాలని కోరుకున్నా చూడలేకపోయారు, వినాలని కోరుకున్నా వినలేక పోయారని మీతో చెబుతున్నాను” అని అన్నాడు.
25 ౨౫ ఒకసారి ఒక ధర్మశాస్త్ర ఉపదేశకుడు లేచి ఆయనను పరీక్షిస్తూ, “బోధకుడా, నిత్య జీవానికి వారసుణ్ణి కావాలంటే నేను ఏమి చేయాలి?” అని అడిగాడు. (aiōnios )
26 ౨౬ అందుకాయన, “ధర్మశాస్త్రంలో ఏమని రాసి ఉంది? నువ్వు దానినెలా అర్థం చేసుకున్నావు?” అని అడిగాడు.
27 ౨౭ అతడు, “నీ దేవుడైన ప్రభువును నీ పూర్ణ హృదయంతోనూ, నీ పూర్ణ ఆత్మతోనూ, నీ పూర్ణ శక్తితోనూ, నీ పూర్ణ మనసుతోనూ ప్రేమించాలి. నిన్ను నీవు ప్రేమించుకున్నట్టే నీ పొరుగువాణ్ణీ ప్రేమించాలి” అన్నాడు.
28 ౨౮ దానికి ఆయన, “సరిగ్గా చెప్పావు. నువ్వూ అలా చెయ్యి, జీవిస్తావు” అన్నాడు.
29 ౨౯ అయితే తనను నీతిమంతుడిగా చూపించుకోడానికి అతడు, “అది సరే గానీ, నా పొరుగువాడు ఎవడు?” అని యేసును అడిగాడు.
30 ౩౦ అందుకు యేసు, “ఒక వ్యక్తి యెరూషలేము నుండి యెరికో పట్టణానికి ప్రయాణమై పోతూ దోపిడీ దొంగల చేతికి చిక్కాడు. వారు అతని బట్టలు దోచుకుని అతణ్ణి కొట్టి, కొన ప్రాణంతో విడిచి పెట్టారు.
31 ౩౧ అప్పుడొక యాజకుడు ఆ దారినే వెళ్తూ అతణ్ణి చూసి పక్కగా వెళ్ళిపోయాడు.
32 ౩౨ ఆలాగే ఒక లేవీయుడు అటుగా వచ్చి అతణ్ణి చూసి పక్కగా వెళ్ళాడు.
33 ౩౩ అయితే ఒక సమరయుడు ప్రయాణమై వెళ్తూ, అతడు పడి ఉన్న చోటికి వచ్చాడు. అతణ్ణి చూసి జాలి పడ్డాడు.
34 ౩౪ అతనిపై నూనే, ద్రాక్షారసం పోసి, గాయాలకు కట్లు కట్టి తన గాడిదపై ఎక్కించుకుని ఒక సత్రానికి తీసుకువెళ్ళి అతని బాగోగులు చూశాడు.
35 ౩౫ మరుసటి రోజు అతడు రెండు వెండి నాణాలు తీసి ఆ సత్రం యజమానికిచ్చి, ‘ఇతణ్ణి జాగ్రత్తగా చూసుకో. ఇతనికి నువ్వు ఇంకేమైనా ఖర్చు చేస్తే ఈసారి నేను మళ్ళీ వచ్చినప్పుడు అది నీకు తీర్చేస్తాను’ అనిచెప్పి వెళ్ళిపోయాడు.
36 ౩౬ అయితే ఇప్పుడు ఆ ముగ్గురిలో దొంగల చేతిలో చిక్కిన వాడికి పొరుగువాడు ఎవరని నీకు అనిపిస్తుంది?” అని అతనిని అడిగాడు.
37 ౩౭ దానికి అతడు, “అతని మీద జాలి చూపిన వాడే” అన్నాడు. యేసు, “నువ్వు కూడా వెళ్ళి అలాగే చెయ్యి” అని అతనితో చెప్పాడు.
38 ౩౮ వారు ప్రయాణమై వెళ్తూ ఉన్నప్పుడు ఆయన ఒక గ్రామంలో ప్రవేశించాడు. అక్కడ మార్త అనే ఒక స్త్రీ ఆయనను తన ఇంట్లోకి ఆహ్వానించింది.
39 ౩౯ ఆమెకు మరియ అనే సోదరి ఉంది. ఈమె యేసు పాదాల దగ్గర కూర్చుని ఆయన ఉపదేశం వింటూ ఉంది.
40 ౪౦ మార్త ఎన్నో పనులు పెట్టుకుని తొందరపడుతూ ఆయన దగ్గరికి వచ్చి, “ప్రభూ, నా సోదరి నన్ను విడిచి ఇక్కడ కూర్చుంది, ఒక్కదాన్నే పనులన్నీ చేసుకోవలసి వస్తున్నది. నీకేం పట్టదా? వచ్చి నాకు సాయం చేయమని ఆమెకు చెప్పు” అంది.
41 ౪౧ అందుకు ప్రభువు, “మార్తా, మార్తా, నువ్వు బోలెడన్ని పనులను గురించి తొందర పడుతున్నావు. కానీ అవసరమైంది ఒక్కటే.
42 ౪౨ మరియ ఉత్తమమైన దాన్ని ఎంచుకుంది. దాన్ని ఆమె దగ్గరనుంచి తీసివేయడం జరగదు” అని ఆమెతో చెప్పాడు.