< లేవీయకాండము 26 >
1 ౧ “మీరు విగ్రహాలను చేసుకోకూడదు. చెక్కిన ప్రతిమను గానీ దేవతా రాతి స్తంభాన్ని గానీ నిలబెట్టకూడదు. మీ దేశంలో మీరు మొక్కడానికి చెక్కిన రాతి బొమ్మను నిలబెట్టకూడదు. నేను మీ దేవుడైన యెహోవాను.
2 ౨ నేను నియమించిన విశ్రాంతి దినాలను మీరు ఆచరించాలి. నా పరిశుద్ధ మందిరాన్ని పవిత్రంగా చూడాలి. నేను యెహోవాను.
3 ౩ మీరు నా శాసనాలను బట్టి నడుచుకుంటూ నా ఆజ్ఞలను పాటిస్తూ వాటిని అనుసరించి ప్రవర్తించాలి.
4 ౪ వర్షాకాలంలో మీకు వర్షం ఇస్తాను. మీ భూమి పంటలనిస్తుంది. మీ పొలాల్లో చెట్లు ఫలిస్తాయి.
5 ౫ మీ ద్రాక్ష పండ్లకాలం వరకూ మీ పంట నూర్పు కొనసాగుతుంది. మీరు తృప్తిగా తిని మీ దేశంలో నిర్భయంగా నివసిస్తారు.
6 ౬ ఆ దేశంలో నేను మీకు క్షేమం కలిగిస్తాను. మీరు పండుకొనేటప్పుడు ఎవరూ మిమ్మల్ని భయపెట్టరు. ఆ దేశంలో క్రూరమృగాలు లేకుండా చేస్తాను. మీ దేశంలోకి ఖడ్గం రాదు.
7 ౭ మీరు మీ శత్రువులను తరుముతారు. వారు మీ ఎదుట కత్తివాత కూలుతారు.
8 ౮ మీలో ఐదుగురు వంద మందిని తరుముతారు. వంద మంది పదివేల మందిని తరుముతారు, మీ శత్రువులు మీ ఎదుట కత్తివాత కూలిపోతారు.
9 ౯ ఎందుకంటే నేను మిమ్మల్ని కరుణించి మీకు సంతానమిచ్చి మిమ్మల్ని విస్తరింపజేసి మీతో నేను చేసిన నిబంధనను స్థిరపరుస్తాను.
10 ౧౦ మీరు చాలా కాలం నిలవ ఉన్న పాత ధాన్యం తింటారు. కొత్తది వచ్చినా పాతది మిగిలి ఉంటుంది.
11 ౧౧ నా మందిరాన్ని మీ మధ్య ఉంచుతాను. మీ విషయం నా మనస్సు అసహ్యపడదు.
12 ౧౨ నేను మీ మధ్య సంచరిస్తాను. మీకు దేవుడినై ఉంటాను. మీరు నాకు ప్రజలై ఉంటారు.
13 ౧౩ మీరు ఐగుప్తీయులకు దాసులు కాకుండ వారి దేశంలోనుండి మిమ్మల్ని రప్పించాను. నేను మీ దేవుడైన యెహోవాను. నేను మీ కాడి అడ్డకొయ్యలు విరగగొట్టి మిమ్మల్ని తలెత్తుకుని నడిచేలా చేశాను.
14 ౧౪ ఒకవేళ మీరు నా మాట వినకుండా నా ఆజ్ఞలన్నిటినీ అనుసరించకుండా
15 ౧౫ నా శాసనాలను నిరాకరిస్తూ, నా ఆజ్ఞలన్నిటినీ నిరాకరిస్తూ నా నిబంధనను ఉల్లంఘిస్తూ నా తీర్పులను త్రోసిపుచ్చుతూ ఉంటారేమో.
16 ౧౬ అలాగైతే నేను మీకు చేసేది ఇదే. మీమీదికి భయం రప్పిస్తాను. మీకు జ్వరం కలిగించి మీ కళ్ళు దెబ్బ తిని ప్రాణాలు నీరసించి పోయేలా చేస్తాను. మీరు చల్లిన విత్తనాలు వ్యర్థమైపోతాయి. మీ శత్రువులు వాటి పంటను తింటారు.
17 ౧౭ మీ నుండి ముఖం తిప్పేసుకుంటాను. మీ శత్రువులు మిమ్మల్ని లోబరచుకుంటారు. మిమ్మల్ని ద్వేషించేవారు మిమ్మల్ని పరిపాలిస్తారు. ఎవరూ తరమకపోయినా మీరు పారిపోతారు.
18 ౧౮ నా ఆజ్ఞలు పాటించకపోతే నేను మీ పాపాలను బట్టి మరి ఏడంతలుగా మిమ్మల్ని దండిస్తాను.
19 ౧౯ మీ బల గర్వాన్ని భంగపరచి, ఆకాశాన్ని ఇనుములాగా భూమిని ఇత్తడిలాగా చేస్తాను.
20 ౨౦ మీ భూమి ఫలించదు. మీ దేశంలోని చెట్లు ఫలించవు. మీ బలం వృథాగా ఇంకి పోతుంది.
21 ౨౧ మీరు నా మాట వినకుండా నాకు విరోధంగా నడిస్తే నేను మీ పాపాలను బట్టి మరి ఏడంతలుగా మిమ్మల్ని బాధిస్తాను.
22 ౨౨ మీ మధ్యకు క్రూరమృగాలను పంపిస్తాను. అవి మీ పిల్లలను ఎత్తుకుపోతాయి. మీ పశువులను నాశనం చేస్తాయి. మిమ్మల్ని కొద్ది మందిగా చేస్తాయి. మీ దారులు నిర్మానుష్యమై పోతాయి.
23 ౨౩ ఇంత చేసినా మీరు నాకు విరోధంగా నడుస్తూ ఉంటే
24 ౨౪ నేను కూడా మీపై కోపంగా నడుచు కుంటాను. నేనే మీ పాపాలను బట్టి ఇంకా ఏడంతలుగా మిమ్మల్ని దండిస్తాను.
25 ౨౫ మీ మీదికి కత్తి రప్పిస్తాను. అది నా నిబంధన విషయం ప్రతి దండన చేస్తుంది. మీరు మీ పట్టణాల్లో సమకూడి ఉండగా మీ మధ్యకు తెగులు రప్పిస్తాను. మీరు శత్రువుల వశమైపోతారు.
26 ౨౬ నేను మీ ఆహారాన్ని, అంటే మీ ప్రాణాధారం తీసేసిన తరువాత పదిమంది స్త్రీలు ఒక్క పొయ్యిలోనే మీకు రొట్టెలు చేసి కొలత ప్రకారం మీకు ఇస్తారు. మీరు తింటారు గాని తృప్తి పొందరు.
27 ౨౭ నేను ఇలా చేసిన తరువాత కూడా మీరు నా మాట వినక నాకు విరోధంగా నడిస్తే
28 ౨౮ నేను కోపపడి మీకు విరోధంగా నడుస్తాను. నేనే మీ పాపాలను బట్టి ఏడంతలుగా మిమ్మల్ని దండిస్తాను.
29 ౨౯ మీరు మీ కొడుకుల మాంసం తింటారు, మీ కుమార్తెల మాంసం తింటారు.
30 ౩౦ నేను మీ ఉన్నత స్థలాలను పాడు చేస్తాను. మీ విగ్రహాలను ధ్వంసం చేస్తాను. మీ విగ్రహాల శవాలపై మీ శవాలను పడవేయిస్తాను. నా మనస్సులో మిమ్మల్ని అసహ్యించు కుంటాను.
31 ౩౧ నేను మీ ఊళ్ళను పాడు చేస్తాను. మీ పరిశుద్ధ స్థలాలను పాడుచేస్తాను. మీ సువాసన గల అర్పణలును వాసన చూడను.
32 ౩౨ నేనే మీ దేశాన్ని పాడు చేసిన తరువాత దానిలో నివసించే మీ శత్రువులు దాన్ని చూసి ఆశ్చర్యపడతారు.
33 ౩౩ జనాల్లోకి మిమ్మల్ని చెదరగొట్టి కత్తి దూసి మీ వెంటబడి తరుముతాను. మీ దేశం పాడైపోతుంది, మీ ఊళ్లు పాడుబడిపోతాయి.
34 ౩౪ మీరు మీ శత్రువుల దేశంలో ఉండగా మీ దేశం పాడుబడి ఉన్న కాలమంతా అది తన విశ్రాంతి కాలాలను అనుభవిస్తుంది.
35 ౩౫ అది పాడై ఉండే దినాలన్నీ విశ్రాంతి తీసుకుంటుంది. మీరు దానిలో నివసించినప్పుడు అది విశ్రాంతి కాలంలో పొందలేకపోయిన విశ్రాంతిని అది పాడై ఉన్న దినాల్లో అనుభవిస్తుంది.
36 ౩౬ మీలో మిగిలినవారు తమ శత్రువుల దేశాల్లో ఉండగా వారి హృదయాల్లో అధైర్యం పుట్టిస్తాను. గాలికి కొట్టుకుపోతున్న ఆకు చప్పుడుకు వారు పారిపోతారు. ఖడ్గం నుండి తప్పించుకోడానికి పారిపోతున్నట్టు వారు ఆ చప్పుడు విని పారిపోతారు. తరుమేవాడు ఎవరూ లేకుండానే పడిపోతారు.
37 ౩౭ తరిమేవాడు ఎవరూ లేకుండానే వారు కత్తిని చూసినట్టుగా ఒకడి మీద ఒకడు పడతారు. మీ శత్రువుల ఎదుట మీరు నిలవలేక పోతారు.
38 ౩౮ మీరు జనంగా ఉండకుండాా నశించి పోతారు. మీ శత్రువుల దేశం మిమ్మల్ని తినేస్తుంది.
39 ౩౯ మీలో మిగిలినవారు మీ శత్రువుల దేశాల్లో తమ దోషాలను బట్టి క్షీణించిపోతారు. వారు తమ మీదికి వచ్చిన తమ తండ్రుల దోషాలను బట్టి క్షీణించిపోతారు.
40 ౪౦ వారు నాకు విరోధంగా చేసిన తిరుగుబాటును, తమ దోషాన్ని, తమ తండ్రుల దోషాన్ని ఒప్పుకుని, తాము నాకు విరోధంగా నడిచామని,
41 ౪౧ నేను వారికి విరోధంగా నడిచానని, తమ శత్రువుల దేశంలోకి తమ్మును రప్పించాననీ ఒప్పుకుంటే, అంటే లోబడని తమ హృదయాలు లొంగి తాము చేసిన దోషానికి ప్రతి దండన అనుభవించామని ఒప్పుకుంటే,
42 ౪౨ నేను యాకోబుతో చేసిన నా నిబంధనను జ్ఞాపకం చేసుకుంటాను. నేను ఇస్సాకుతో చేసిన నా నిబంధనను నేను అబ్రాహాముతో చేసిన నా నిబంధనను జ్ఞాపకం చేసుకుంటాను. ఆ దేశాన్ని కూడా జ్ఞాపకం చేసుకుంటాను.
43 ౪౩ తమ దేశాన్ని వారు విడిచిపెట్టి పోగా పాడైపోయిన వారి దేశం తన విశ్రాంతి దినాలను అనుభవిస్తుంది. వారు నా తీర్పులను తిరస్కరించి నా శాసనాలను అసహ్యించుకున్నారు. ఆ కారణం చేతనే వారు తమ పైకి వచ్చిన దోషశిక్ష న్యాయమని ఒప్పుకొంటారు.
44 ౪౪ అయితే వారు తమ శత్రువుల దేశంలో ఉన్నప్పుడు వారిని నిరాకరించను. నా నిబంధనను భంగపరచి వారిని బొత్తిగా నశింపజేయడానికి వారిపై అసహ్యపడను. ఎందుకంటే నేను వారి దేవుడైన యెహోవాను.
45 ౪౫ నేను వారికి దేవుడనై ఉండేలా వారి పూర్వికులను వివిధ జాతులు చూస్తుండగా ఐగుప్తులో నుండి రప్పించి వారితో చేసిన నిబంధనను ఆ పూర్వికులను బట్టి జ్ఞాపకం చేసుకుంటాను. నేను యెహోవాను, అని చెప్పు” అన్నాడు.
46 ౪౬ యెహోవా మోషే ద్వారా సీనాయి కొండ మీద తనకు, ఇశ్రాయేలీయులకును మధ్య నియమించిన శాసనాలు, తీర్పులు, ఆజ్ఞలు ఇవే.