< న్యాయాధిపతులు 2 >
1 ౧ యెహోవా దూత గిల్గాలు నుంచి బయలుదేరి బోకీముకు వచ్చి ఇలా అన్నాడు “నేను మిమ్మల్ని ఐగుప్తులో నుంచి రప్పించి, మీ పితరులకు ప్రమాణం చేసిన దేశానికి మిమ్మల్ని చేర్చాను. మీతో చేసిన నిబంధన నేనెప్పుడూ నిరర్ధకం చేయను.
2 ౨ మీరు ఈ దేశవాసులతో సంధి చేసుకోకూడదని, వాళ్ళ బలిపీఠాలు విరుగగొట్టాలని ఆజ్ఞ ఇచ్చాను గాని మీరు నా మాట వినలేదు.
3 ౩ మీరు చేసిందేమిటి? కాబట్టి నేను మీ ముంగిట్లో నుంచి వాళ్ళని వెళ్లగొట్టను. వాళ్ళు మీ పక్కలో బల్లేలుగా ఉంటారు. వాళ్ళ దేవుళ్ళు మీకు ఉరిగా ఉంటారని చెప్తున్నాను.”
4 ౪ యెహోవా దూత ఇశ్రాయేలీయులందరితో ఈ మాటలు చెప్పినప్పుడు
5 ౫ ప్రజలు బిగ్గరగా ఏడ్చారు. కాబట్టి ఆ చోటికి బోకీము అని పేరు పెట్టారు. అక్కడ వాళ్ళు యెహోవాకు హోమబలి అర్పించారు.
6 ౬ యెహోషువ ప్రజలను అక్కడ నుంచి సాగనంపినప్పుడు ఇశ్రాయేలీయులు ఆ ప్రదేశాన్ని స్వాధీనం చేసుకోడానికి వాళ్ళకు కేటాయించిన స్థలాలకు వెళ్లారు.
7 ౭ యెహోషువ బ్రతికిన కాలమంతటిలోనూ, యెహోషువ తరువాత కాలంలోనూ ఇంకా బ్రతికి ఉండి ఇశ్రాయేలీయుల కోసం యెహోవా చేసిన కార్యాలన్నిటిని చూసిన పెద్దల రోజుల్లోనూ ప్రజలు యెహోవాను సేవిస్తూ ఉన్నారు.
8 ౮ నూను కుమారుడు, యెహోవా దాసుడు అయిన యెహోషువ నూట పది సంవత్సరాల వయస్సులో చనిపోయినప్పుడు అతనికి స్వాస్థ్యంగా వచ్చిన ప్రదేశం సరిహద్దులో ఉన్న తిమ్నత్సెరహులో ప్రజలు అతణ్ణి పాతిపెట్టారు.
9 ౯ అది ఎఫ్రాయిమీయుల ఎడారిలో గాయషు కొండకు ఉత్తరం దిక్కున ఉంది.
10 ౧౦ ఆ తరం వారంతా తమ తమ పితరుల దగ్గరికి చేరారు. వారి తరువాత యెహోవానుగాని, ఆయన ఇశ్రాయేలీయుల కోసం చేసిన కార్యాలను గాని తెలియని తరం ఒకటి మొదలయ్యింది.
11 ౧౧ ఇశ్రాయేలీయులు యెహోవా దృష్టిలో పాపం చేసి, బయలు దేవుళ్ళను పూజించారు.
12 ౧౨ ఐగుప్తుదేశంలో నుంచి వాళ్ళను రప్పించిన తమ పితరుల దేవుడైన యెహోవాను విడిచిపెట్టి ఇతర దేవుళ్ళను అనుసరించి, వాళ్ళ చుట్టూ ఉండే ఆ ప్రజల దేవుళ్ళకు సాగిలపడి, యెహోవాకు కోపం పుట్టించారు.
13 ౧౩ వాళ్ళు యెహోవాను విడిచిపెట్టి బయలును అష్తారోతు దేవతను పూజించారు.
14 ౧౪ కాబట్టి యెహోవా కోపాగ్ని ఇశ్రాయేలీయుల మీద రాజుకుంది. ఆయన వారిని దోపిడీగాళ్ళకు అప్పగించాడు. వాళ్ళు ఇశ్రాయేలీయులను దోచుకున్నారు. తమ చుట్టూ ఉన్న శత్రువుల చేతికి ఆయన వారిని అప్పగించాడు కాబట్టి వారు తమ శత్రువులను ఎదిరించలేకపోయారు.
15 ౧౫ వారు యుద్ధానికి ఎటు వెళ్ళినా సరే, ఆయన ప్రమాణపూర్వకంగా చెప్పినట్టుగానే వారు ఓడిపోయేలా యెహోవా హస్తం వారికీ విరోధంగా ఉంది. వాళ్లకు ఘోర బాధ కలిగింది.
16 ౧౬ అటు తరువాత యెహోవా వాళ్ళ కోసం న్యాయాధిపతులను పుట్టించాడు. దోచుకొనేవాళ్ళ చేతిలో నుంచి వీళ్ళు ఇశ్రాయేలీయులను రక్షించారు. అయినా ఇస్రాయేల్ ప్రజ ఆ న్యాయాధిపతుల మాట వినలేదు.
17 ౧౭ వాళ్ళ పితరులు యెహోవా ఆజ్ఞలు అనుసరించి నడిచిన మార్గం నుంచి వీళ్ళు త్వరగా తొలగిపోయి, వ్యభిచారంతో సమానంగా ఇతర దేవుళ్ళకు తమను తాము అప్పగించుకుని పూజించారు. తమ పితరులు దేవుని ఆజ్ఞలు అనుసరించినట్టు వాళ్ళు అనుసరించలేదు.
18 ౧౮ వారి శత్రువులు వారిని బాధించగా, ఆ మూలుగులు యెహోవా విని, జాలిపడి, వారి కోసం న్యాయాధిపతులను పుట్టించాడు. ఆయన ఆ న్యాయాధిపతులకు తోడై ఉండి, ఒక్కొక్క న్యాయాధిపతి బ్రతికిన కాలమంతా వాళ్ళ శత్రువుల చేతిలో నుంచి ఇశ్రాయేలీయులను రక్షించాడు.
19 ౧౯ ఒక్కొక్క న్యాయాధిపతి చనిపోయినప్పుడెల్లా వాళ్ళు వెనక్కు తిరిగి ఇతర దేవుళ్ళను అనుసరిస్తూ, పూజిస్తూ, వాటికి సాగిలపడుతూ ఉండేవారు. వారు అలా తమ క్రియల్లోగాని, తమ మూర్ఖ ప్రవర్తనలోగాని దేనినీ విడిచిపెట్టకుండా వాళ్ళ పూర్వికుల కంటే ఇంకా భ్రష్టులై పోయారు.
20 ౨౦ కాబట్టి యెహోవా కోపాగ్ని ఇశ్రాయేలీయుల మీద రగిలినప్పుడు ఆయన ఇలా అన్నాడు “ఈ ప్రజలు తమ పితరులతో నేను ఏర్పాటు చేసిన వాగ్దానంలోని షరతులు మీరి, నా మాట వినలేదు గనక,
21 ౨౧ నేను నియమించిన షరతులు అనుసరించి వాళ్ళ పితరులు నడిచినట్టు వీళ్ళు కూడా యెహోవా షరతులు అనుసరించి నడుస్తారో లేదో ఆ జాతుల వలన ఇశ్రాయేలీయులను పరీక్షింఛి చూస్తాను.
22 ౨౨ అందుకని యెహోషువ చనిపోయిన కాలంలో మిగిలిన శత్రుజాతుల్లో ఏ జనాంగాన్నీ వాళ్ళ దగ్గర నుంచి నేను వెళ్లగొట్టను.”
23 ౨౩ ఈ కారణంగానే యెహోవా ఆ జనాంగాన్ని యెహోషువ చేతికి అప్పగించకుండా, వెంటనే వెళ్లగొట్టకుండా వాళ్ళను ఉండనిచ్చాడు.