< యెహొషువ 18 >
1 ౧ ఇశ్రాయేలీయులు ఆ దేశాన్ని స్వాధీనపరచుకున్న తరువాత వారంతా షిలోహులో సమావేశమై అక్కడ ప్రత్యక్షపు గుడారం వేశారు.
2 ౨ ఇశ్రాయేలీయుల్లో స్వాస్థ్యం యింకా దొరకని ఏడు గోత్రాలు మిగిలాయి.
3 ౩ కాబట్టి యెహోషువ ఇశ్రాయేలీయులతో ఇలా అన్నాడు. “మీ పూర్వీకుల దేవుడైన యెహోవా మీకిచ్చిన దేశాన్ని స్వాధీనం చేసుకోడానికి వెళ్లకుండా ఎంతకాలం వ్యర్థంగా గడుపుతారు?
4 ౪ ఒక్కొక్క గోత్రానికి ముగ్గుర్ని మీరు నియమించుకుంటే నేను వారిని పంపిస్తాను. వారు బయలుదేరి దేశం అంతటాతిరుగుతూ వివిధ స్వాస్థ్యాల ప్రకారం దాని వివరాలను రాసి నా దగ్గరికి తీసుకురావాలి.
5 ౫ వాళ్ళు దాన్ని ఏడు భాగాలుగా చేయాలి. యూదా వారు దక్షిణం వైపు వారి భూభాగంలో ఉండిపోవాలి. యోసేపు వంశం వాళ్ళు ఉత్తరం వైపు తమ భూభాగంలో ఉండిపోవాలి.
6 ౬ మీరు ఏడు వంతులుగా దేశ వివరాన్ని రాసి నా దగ్గరికి తీసుకురావాలి. నేనిక్కడ మన దేవుడైన యెహోవా సమక్షంలో మీకోసం చీట్లు వేస్తాను.
7 ౭ లేవీయులకు మీ మధ్య ఏ వాటా ఉండదు. యెహోవాకు యాజకత్వం చేయడమే వారి స్వాస్థ్యం. గాదు, రూబేను, మనష్షే అర్థగోత్రం, యొర్దాను అవతల తూర్పువైపున స్వాస్థ్యాన్ని పొందారు.”
8 ౮ ఆ మనుషులు బయలుదేరి వెళ్ళిపోయారు. దేశ వివరాలు రాయడానికి వెళ్తున్న వారితో యెహోషువ “మీరు వెళ్లి దేశమంతా తిరిగి దాని వివరం రాసి నా దగ్గరికి తిరిగి రండి, అప్పుడు నేను షిలోహులో యెహోవా సమక్షంలో మీకోసం చీట్లు వేస్తాను” అన్నాడు.
9 ౯ వారు వెళ్లి దేశమంతా తిరిగి ఏడు భాగాలుగా, పట్టణాల ప్రకారం వివరాలను పుస్తకంలో రాసి షిలోహు శిబిరంలో ఉన్న యెహోషువ దగ్గరికి వచ్చారు.
10 ౧౦ వారి కోసం యెహోషువ షిలోహులో యెహోవా సమక్షంలో చీట్లు వేశాడు. వారి వాటాల ప్రకారం ఇశ్రాయేలీయులకు ఆ దేశాన్ని పంచిపెట్టాడు.
11 ౧౧ బెన్యామీనీయుల గోత్రానికి వారి వంశాల ప్రకారం, వాటా వచ్చింది. వారి వాటా సరిహద్దు యూదా వంశస్థుల సరిహద్దుకు, యోసేపు వంశస్థుల సరిహద్దుకు మధ్య ఉంది.
12 ౧౨ ఉత్తరంగా వారి సరిహద్దు యొర్దాను మొదలు యెరికోకు ఉత్తరంగా పోయి పడమటి వైపుకు కొండసీమ మీదుగా వెళ్లి బేతావెను అరణ్యం దగ్గర అంతం అయింది.
13 ౧౩ అక్కడనుండి ఆ సరిహద్దు లూజు వైపున, అంటే బేతేలు అనే లూజు దక్షిణంగా సాగి కింది బెత్ హోరోనుకు దక్షిణంగా కొండమీది అతారోతు అద్దారు వరకూ వెళ్ళింది.
14 ౧౪ అక్కడ నుండి దాని సరిహద్దు దక్షిణంగా బేత్హోరోనుకు ఎదురుగా ఉన్న కొండనుండి పడమరగా తిరిగి అక్కడ నుండి దక్షిణం వైపున యూదా వంశస్థుల పట్టణమైన కిర్యాత్బాలు అనే కిర్యత్యారీము వరకూ వెళ్ళింది, అది పడమటి సరిహద్దు.
15 ౧౫ దక్షిణం వైపు కిర్యత్యారీము కొననుండి దాని సరిహద్దు పడమరగా నెఫ్తోయ నీళ్ల ఊటవరకూ సాగి
16 ౧౬ ఉత్తరం వైపు రెఫాయీయుల లోయలో ఉన్న బెన్ హిన్నోము లోయ ఎదురుగా ఉన్న కొండప్రక్కనుండి దక్షిణంగా బెన్హిన్నోము లోయ గుండా యెబూసీయుల ప్రదేశం వరకూ సాగి ఏన్రోగేలు వరకూ వెళ్ళింది.
17 ౧౭ అది ఉత్తరంగా ఏన్షేమెషు వరకూ వ్యాపించి అదుమ్మీముకు ఎక్కుచోటికి ఎదురుగా ఉన్న గెలీలోతు వరకూ సాగి రూబేనీయుడైన బోహను రాతి దగ్గర దిగింది.
18 ౧౮ అది ఉత్తరం వైపు మైదానానికి ఎదురుగా వ్యాపించి అరాబావరకూ దిగి అక్కడనుండి ఆ సరిహద్దు ఉత్తరంగా బేత్హోగ్లా వరకూ వెళ్ళింది.
19 ౧౯ అక్కడనుండి ఆ సరిహద్దు యొర్దాను దక్షిణంగా ఉప్పు సముద్రం ఉత్తర అఖాతం దగ్గర అంతమయింది. ఇది దక్షిణ సరిహద్దు.
20 ౨౦ తూర్పు వైపున యొర్దాను దానికి సరిహద్దు. దాని చుట్టూ ఉన్న సరిహద్దుల ప్రకారం బెన్యామీను ప్రజలకు వారి వంశాల ప్రకారం సంక్రమించిన స్వాస్థ్యం ఇది.
21 ౨౧ బెన్యామీనీయుల గోత్రానికి వారి వంశాల ప్రకారం కలిగిన పట్టణాలు ఏవంటే యెరికో, బేత్హోగ్లా, యెమెక్కెసీసు,
22 ౨౨ బేత్ అరాబా, సెమరాయిము,
23 ౨౩ బేతేలు, ఆవీము, పారా, ఒఫ్రా,
24 ౨౪ కెఫార్ అమ్మోని, ఒప్ని, గెబా అనేవి, వాటి పల్లెలు కాక పన్నెండు పట్టణాలు.
25 ౨౫ గిబియోను, రామా, బెయేరోతు, మిస్పే,
26 ౨౬ కెఫీరా, మోసా, రేకెము, ఇర్పెయేలు, తరలా,
27 ౨౭ సేలా, ఎలెపు, యెరూషలేము అనే ఎబూసు, గిబియా, కిర్యతు అనేవి. వాటి పల్లెలు పోతే పద్నాలుగు పట్టణాలు.
28 ౨౮ వారి వంశాల ప్రకారం ఇది బెన్యామీను ప్రజలకు కలిగిన స్వాస్థ్యం.