< యోవేలు 1 >
1 ౧ పెతూయేలు కొడుకు యోవేలుకు వచ్చిన యెహోవా వాక్కు.
2 ౨ పెద్దలారా, వినండి. దేశంలో నివసించే మీరంతా జాగ్రత్తగా వినండి. మీ రోజుల్లో గానీ మీ పూర్వీకుల రోజుల్లో గానీ ఇలాంటి విషయం ఎప్పుడైనా జరిగిందా?
3 ౩ దాన్ని గురించి మీ పిల్లలకు చెప్పండి. మీ పిల్లలు తమ పిల్లలకు, వాళ్ళ పిల్లలు తరువాత తరానికి చెబుతారు.
4 ౪ ఎగిరే మిడతల గుంపులు విడిచి పెట్టిన దాన్ని పెద్ద మిడతలు తినేశాయి. పెద్ద మిడతలు విడిచిపెట్టిన దాన్ని మిడత పిల్లలు తినేశాయి. మిడత పిల్లలు విడిచిపెట్టిన దాన్ని గొంగళిపురుగులు తినేశాయి.
5 ౫ తాగుబోతులారా, లేచి ఏడవండి. ద్రాక్షసారాయి తాగే మీరు గట్టిగా ఏడవండి. ఎందుకంటే కొత్త ద్రాక్షసారాయి మీ నోటికి అందడం లేదు.
6 ౬ ఒక రాజ్యం నా దేశం మీదికి వచ్చింది. బలమైన వారుగా లెక్కలేనంత మంది వచ్చారు. దాని పళ్లు సింహపు పళ్ళలా ఉన్నాయి. అతనికి ఆడసింహం పళ్ళున్నాయి.
7 ౭ అతడు నా ద్రాక్షతోటను భయపెట్టేదిగా చేశాడు. నా అంజూరపు చెట్టును ఒలిచి వేశాడు. దాని బెరడు ఒలిచి పారేశాడు. వాటి కొమ్మలు తెల్లబారాయి.
8 ౮ తన పడుచు భర్తను కోల్పోయి గోనెసంచి కట్టుకున్న కన్యలా దుఖించు.
9 ౯ నైవేద్యం, పానార్పణం యెహోవా మందిరంలోకి రాకుండ నిలిచి పోయాయి. యెహోవా సేవకులు, యాజకులు ఏడుస్తున్నారు.
10 ౧౦ పొలాలు పాడయ్యాయి. భూమి దుఖిస్తోంది. ధాన్యం నాశనమైంది. కొత్త ద్రాక్షారసం లేదు. నూనె ఒలికి పోయింది.
11 ౧౧ గోదుమ, బార్లీ గురించి రైతులారా, సిగ్గుపడండి, ద్రాక్ష రైతులారా దుఖించండి, పొలం పంట నాశనమయింది.
12 ౧౨ ద్రాక్షతీగలు వాడిపోయాయి, అంజూరు చెట్లు ఎండిపోయాయి. దానిమ్మ చెట్లు, ఈత చెట్లు, ఆపిల్ చెట్లు, పొలం లోని చెట్లన్నీ వాడిపోయాయి. మనుషులకు సంతోషమే లేదు.
13 ౧౩ యాజకులారా, గోనెపట్ట కట్టుకుని దుఖించండి! బలిపీఠం దగ్గర సేవకులారా, ఏడవండి. నా దేవుని సేవకులారా, గోనెసంచి కట్టుకుని రాత్రంతా గడపండి. నైవేద్యం, పానార్పణం, మీ దేవుని మందిరానికి రాకుండా నిలిచిపోయాయి.
14 ౧౪ ఉపవాస దినం ప్రతిష్ఠించండి. సంఘంగా సమకూడండి. యెహోవాను బతిమాలడానికి పెద్దలనూ దేశ నివాసులందరినీ మీ దేవుడు యెహోవా మందిరంలో సమకూర్చండి.
15 ౧౫ యెహోవా దినం దగ్గర పడింది. అయ్యో, అది ఎంత భయంకరమైన దినం! సర్వశక్తుని దగ్గర నుంచి నాశనంగా అది వస్తుంది.
16 ౧౬ మన కళ్ళముందే ఆహారం, మన దేవుని మందిరంలో సంతోషానందాలు నిలిచిపోలేదా?
17 ౧౭ విత్తనాలు మట్టిగడ్డల కింద కుళ్ళిపోతున్నాయి, పైరు ఎండిపోవడంతో ధాన్యపుకొట్లు ఖాళీగా ఉన్నాయి, కళ్లపుకొట్లు నేలమట్టమయ్యాయి.
18 ౧౮ మేత లేక జంతువులు ఎంతగా మూలుగుతున్నాయి! పశువుల మందలూ గొర్రెల మందలూ ఎంతగా అలమటిస్తున్నాయి!
19 ౧౯ యెహోవా, నీకే నేను మొరపెడుతున్నాను. అగ్ని అరణ్యంలోని మేతస్థలాలను కాల్చి వేసింది, మంటలు తోటచెట్లన్నిటినీ కాల్చివేశాయి.
20 ౨౦ కాలవలు ఎండిపోయాయి, అరణ్యంలోని మేత స్థలాలు కాలిపోవడంతో పొలాల్లోని పశువులు నీ కోసం దాహంగా ఉన్నాయి.