< యోబు~ గ్రంథము 34 >
1 ౧ అప్పుడు ఎలీహు మళ్ళీ ఇలా చెప్పసాగాడు.
2 ౨ జ్ఞానులారా, నా మాటలు వినండి. అనుభవశాలులారా, వినండి.
3 ౩ అంగిలి ఆహారాన్ని రుచి చూసినట్టు చెవి మాటలను పరీక్షిస్తుంది.
4 ౪ న్యాయమైనదేదో విచారించి చూద్దాం రండి. మేలైనదేదో మనంతట మనం విచారించి తెలుసుకుందాము రండి.
5 ౫ “నేను నీతిమంతుణ్ణి, దేవుడు నాకు అన్యాయం చేసాడు.
6 ౬ నేను న్యాయవంతుడినైనా అబద్ధికునిగా చూస్తున్నారు. నేను తిరుగుబాటు చేయకపోయినా నాకు మానని గాయం కలిగింది” అని యోబు అంటున్నాడు.
7 ౭ యోబులాంటి మానవుడెవరు? అతడు మంచి నీళ్లవలె తిరస్కారాన్ని పానం చేస్తున్నాడు.
8 ౮ అతడు చెడుతనం చేసే వారికి మిత్రుడయ్యాడు. భక్తిహీనుల చెలికాడు అయ్యాడు.
9 ౯ మనుషులు దేవునితో సహవాసం చేయడం వారికేమాత్రం ప్రయోజనకరం కాదని అతడు చెప్పుకుంటున్నాడు.
10 ౧౦ విజ్ఞానం గల మనుషులారా, నా మాట ఆలకించండి దేవుడు అన్యాయం చేయడం అసంభవం. సర్వశక్తుడు దుష్కార్యం చేయడం అసంభవం.
11 ౧౧ మనుషుల క్రియలకు తగినట్టుగా ఆయన వారికి ప్రతిఫలం ఇస్తాడు అందరికీ ఎవరి మార్గాలను బట్టి వారికి ఫలమిస్తాడు.
12 ౧౨ దేవుడు ఏ మాత్రం దుష్కార్యం చేయడు. సర్వశక్తుడు న్యాయం తప్పడు.
13 ౧౩ ఎవడైనా భూమిని ఆయనకు అప్పగింత పెట్టాడా? ఎవడైనా సర్వప్రపంచ భారాన్ని ఆయనకు అప్పగించాడా?
14 ౧౪ ఆయన తన మనస్సు తన దగ్గరే ఉంచుకున్నట్టయితే, తన ఆత్మను, ఊపిరినీ తన దగ్గరికి తిరిగి తీసుకుంటే,
15 ౧౫ శరీరులంతా ఒక్కపెట్టున నశిస్తారు. మనుషులు మళ్ళీ ధూళిగా మారిపోతారు.
16 ౧౬ కాబట్టి దీన్ని విని వివేచించు, నా మాటలు ఆలకించు.
17 ౧౭ న్యాయాన్ని ద్వేషించేవాడు లోకాన్ని ఏలుతాడా? న్యాయసంపన్నునిపై నేరం మోపుతావా?
18 ౧౮ నువ్వు పనికిమాలిన వాడివని రాజుతోనైనా, మీరు దుష్టులని ప్రధానులతోనైనా అనవచ్చా?
19 ౧౯ రాజుల పట్ల పక్షపాతం చూపని వాడితో పేదలకన్నా ధనికులను ఎక్కువగా చూడని వాడితో అలా పలకవచ్చా? వారందరూ ఆయన నిర్మించినవారు కారా?
20 ౨౦ వారు నిమిషంలో చనిపోతారు. అర్థరాత్రి వేళ ప్రజలు కల్లోలం పాలై నాశనమౌతారు. బలవంతులను తీసుకు పోవడం జరుగుతుంది, అయితే అది మానవ హస్తాల వలన కాదు.
21 ౨౧ ఆయన దృష్టి మనుషుల మార్గాల మీద ఉంది. ఆయన వారి నడకలన్నీ కనిపెట్టి చూస్తున్నాడు.
22 ౨౨ చెడు కార్యాలు చేసే వారు దాక్కోడానికి చీకటైనా మరణాంధకారమైనా లేదు.
23 ౨౩ ఒక మనిషిని న్యాయవిమర్శలోకి తీసుకు రాక ముందు అతణ్ణి ఎక్కువ కాలం విచారణ చేయడం దేవుడికి అవసరం లేదు.
24 ౨౪ విచారణ లేకుండానే బలవంతులను ఆయన నిర్మూలం చేస్తున్నాడు. వారి స్థానంలో ఇతరులను నియమిస్తున్నాడు.
25 ౨౫ వారి క్రియలను ఆయన తెలుసుకుంటున్నాడు. రాత్రివేళ ఇలాటి వారిని ఆయన కూలదోస్తాడు. వారు నాశనమై పోతారు.
26 ౨౬ అందరూ చూస్తుండగానే దుష్టులను వారి దుర్మార్గాన్ని బట్టి నేరస్తులను శిక్షించినట్టు ఆయన శిక్షిస్తాడు.
27 ౨౭ ఎందుకంటే వారు ఆయనను అనుసరించడం మానుకున్నారు. ఆయన ఆజ్ఞల్లో దేన్నీ లక్ష్య పెట్టలేదు.
28 ౨౮ పేదల మొరను ఆయన దగ్గరికి వచ్చేలా చేశారు. దీనుల మొర ఆయనకు వినబడేలా చేశారు.
29 ౨౯ ఆయన మౌనంగా ఉండిపోతే తీర్పు తీర్చగలవాడెవడు? ఆయన తన ముఖాన్ని దాచుకుంటే ఆయనను చూడగలవాడెవడు? ఆయన జాతులనైనా వ్యక్తులనైనా ఒకే విధంగా పరిపాలిస్తాడు.
30 ౩౦ భక్తిహీనులు రాజ్యపాలన చేయకుండా, వారు ప్రజలను ఇకపై చిక్కించుకోకుండా ఆయన చేస్తాడు.
31 ౩౧ ఒకడు “నేను దోషినే, కానీ ఇకపై పాపం చేయను.
32 ౩౨ నాకు తెలియని దాన్ని నాకు నేర్పించు. నేను పాపం చేశాను. ఇకపై చేయను” అని దేవునితో చెప్పాడనుకో,
33 ౩౩ దేవుడు చేస్తున్నది నీకు నచ్చడం లేదు గనక అలాటి మనిషిని దేవుడు శిక్షిస్తాడు అనుకుంటున్నావా? నేను కాదు, నువ్వే నిశ్చయించుకోవాలి. కాబట్టి నీకు తెలిసినది చెప్పు.
34 ౩౪ వివేచన గలవారు, జ్ఞానంతో నా మాట వినేవారు నాతో ఇలా అంటారు.
35 ౩౫ యోబు తెలివితక్కువ మాటలు పలుకుతున్నాడు. అతని మాటలు బుద్ధిహీనమైనవి.
36 ౩౬ యోబు దుష్టులవలె మాట్లాడుతున్నాడు గనక అతనిపై సునిశితమైన విచారణ జరిగితే ఎంత బాగుంటుంది!
37 ౩౭ అతడు తన పాపానికి తోడుగా ద్రోహం సమకూర్చుకుంటున్నాడు. మన ఎదుట ఎగతాళిగా చప్పట్లు కొట్టి దేవుని మీద కాని మాటలు కుప్పగా పోస్తున్నాడు.