< యోబు~ గ్రంథము 14 >
1 ౧ స్త్రీ కడుపున పుట్టిన మనిషి కొన్ని రోజులపాటు జీవిస్తాడు. అతడు తన జీవిత కాలమంతా కష్టాలు అనుభవిస్తాడు.
2 ౨ అతడు పువ్వులాగా పెరిగి వికసిస్తాడు. అంతలోనే వాడిపోతాడు. నీడ కనబడకుండా పోయినట్టు వాడు పారిపోతాడు.
3 ౩ అలాంటి వాడిని నువ్వు పట్టించుకుంటున్నావా? నాకు తీర్పు తీర్చడానికి నీ ఎదుటికి రప్పించుకుంటావా?
4 ౪ అపవిత్రమైన వ్యక్తికి పవిత్రుడైనవాడు పుట్టగలిగితే ఎంత మేలు? కానీ ఆ విధంగా ఎన్నడూ జరగదు.
5 ౫ మనిషి ఎంతకాలం బ్రతకాలో దానికి పరిమితి నువ్వే నియమిస్తావు. అతడు ఎన్ని నెలలు జీవిస్తాడో నీకు తెలుసు.
6 ౬ అతడి వైపు నుంచి నీ దృష్టి మరల్చుకో. కూలిపని వాడిలాగా తనకు నియమింపబడిన పని పూర్తి చేసేదాకా అతని వైపు చూడకు.
7 ౭ చెట్టును నరికి వేస్తే అది తిరిగి చిగురు వేస్తుందనీ, లేత కొమ్మలు తిరిగి మొలకెత్తుతాయనీ ఆశాభావం ఉంటుంది.
8 ౮ నరికేసిన చెట్టు వేరు భూమిలో కుళ్లిపోయి, దాని మొదలు మట్టిలో చీకిపోతూ ఉంటుంది.
9 ౯ అయితే దానికి నీటి వాసన తగిలినప్పుడు అది చిగురు వేస్తుంది, లేత మొక్కలాగా కొత్తగా కొమ్మలు కాస్తుంది.
10 ౧౦ అయితే మనుషులు చనిపోయినప్పుడు కదలకుండా పడి ఉంటారు. మనుషులు ప్రాణం విడిచిన తరువాత వాళ్ళు ఏమైపోతారు?
11 ౧౧ సముద్రంలో నీళ్ళు ఎలా ఇంకిపోతాయో, నదిలో నీళ్ళు ఎలా ఆవిరైపోతాయో అలాగే మనుషులు చనిపోయి ఇక తిరిగి లేవరు.
12 ౧౨ ఆకాశం అంతరించి పోయేదాకా వాళ్ళు మేల్కోరు. ఎవరూ వారిని నిద్ర లేపలేరు.
13 ౧౩ నువ్వు నన్ను మృత్యులోకంలో దాచి ఉంచితే ఎంత మేలు! నా మీద నీ కోపం చల్లారే దాకా మరుగు చేస్తే ఎంత బాగుంటుంది! నాకు కొంతకాలం గడువుపెట్టి ఆ తరువాత నన్ను జ్ఞాపకం చేసుకోవాలని నేను ఎంతగానో ఆశిస్తున్నాను. (Sheol )
14 ౧౪ మనుషులు చనిపోయిన తరువాత మళ్ళీ బ్రతుకుతారా? ఆలా జరిగే పక్షంలో నా పోరాటం ముగిసి నాకు విడుదల కలిగేదాకా నేను ఎదురుచూస్తూ ఉంటాను.
15 ౧౫ అప్పుడు నువ్వు పిలుస్తావు. నేను నీతో మాట్లాడతాను. నీ చేతిపనిని చూసి నువ్వు ఇష్టపడతావు.
16 ౧౬ అయితే ఇప్పుడు నేను వేసే అడుగులు నువ్వు లెక్కిస్తున్నావు. నేను చేసే పాపాలు నీకు కోపం తెప్పిస్తున్నాయి.
17 ౧౭ నా అతిక్రమాలు సంచిలో ఉంచి మూసివేశావు. నేను చేసిన దోషాలను భద్రంగా దాచిపెట్టావు.
18 ౧౮ కూలిపోయిన పర్వతాలు ముక్కలైపోయి నేలమట్టం అవుతాయి, కొండలు వాటి స్థానం తప్పి పడిపోతాయి.
19 ౧౯ నీళ్ళు రాళ్లను అరగదీస్తాయి. నీటి ప్రవాహం భూమిపై మట్టి కొట్టుకుపోయేలా చేస్తుంది. ఆ విధంగా నువ్వు మనిషి ఆశలను భగ్నం చేశావు.
20 ౨౦ నువ్వు మనుషులను ఎప్పటికీ అణచివేస్తున్నావు గనుక వారు అంతరించిపోతారు. నువ్వు వాళ్ళ ముఖాలను చావు ముఖాలుగా మార్చివేసి వాళ్ళను వెళ్లగొట్టావు.
21 ౨౧ ఒకవేళ వాళ్ళ పిల్లలు ప్రఖ్యాతి చెందినా అది వారికి తెలియదు. ఒకవేళ అణిగిపోయి దీనస్థితి అనుభవించినా వాళ్ళు అది గ్రహించలేరు.
22 ౨౨ తమ సొంత శరీరాల్లోని బాధ మాత్రమే వాళ్ళు అనుభవిస్తారు. తమకు తామే ఎక్కువగా దుఃఖపడతారు.