< యిర్మీయా 51 >
1 ౧ యెహోవా ఇలా చెప్తున్నాడు. “చూడండి! బబులోనుకూ, లేబ్ కమాయ్ లో నివసించే వాళ్లకూ వ్యతిరేకంగా ప్రచండమైన గాలులనూ, నాశనం చేసే ఆత్మనూ రేపబోతున్నాను.
2 ౨ విదేశీయులను బబులోనుకు పంపిస్తాను. వాళ్ళు ఆమెను చెదరగొడతారు. ఆమెను సర్వనాశనం చేస్తారు. వినాశనం జరిగే రోజున వాళ్ళు నాలుగు దిక్కులనుండి ఆమెకు విరోధంగా వస్తారు.
3 ౩ బాణాలు వేసే వాళ్ళకు అవకాశమివ్వకండి. ఆయుధం ధరించే వాణ్ణి నిరోధించండి. దేశంలోని యువకులను వదిలి పెట్టకండి. ఆమె సైన్యాన్నంతటినీ నిర్మూలం చేయండి.
4 ౪ గాయపడిన వాళ్ళు కల్దీయుల దేశంలో కూలిపోవాలి. వీధుల్లో చనిపోయిన వాళ్ళను పడవేయాలి.
5 ౫ తమ దేశాలు ఇశ్రాయేలు పరిశుద్ధుడైన దేవునికి వ్యతిరేకంగా చేసిన అపరాధాలతో నిండిపోయినప్పటికీ, సేనల ప్రభువూ, తమ దేవుడూ అయిన యెహోవా యూదా ప్రజలనూ, ఇశ్రాయేలు ప్రజలనూ విడిచిపెట్టలేదు.
6 ౬ బబులోనులో నుండి పారిపోండి. ప్రతి ఒక్కడూ తన ప్రాణాన్ని రక్షించుకోవాలి. దాని పాపానికి పడే శిక్షలో మీరు నాశనం కావద్దు. ఇది యెహోవా ప్రతీకారం చేసే కాలం. ఆమెకు తన పనులను బట్టి ఆయన తిరిగి చెల్లిస్తాడు.
7 ౭ బబులోను యెహోవా చేతిలో ఉన్న బంగారు పాత్ర. ఆ పాత్రలోని మద్యాన్ని ఆయన సర్వలోకానికీ తాగించాడు. లోకంలోని జనాలు ఆమె చేతి మద్యాన్ని తాగి పిచ్చివాళ్ళు అయ్యారు.
8 ౮ బబులోను అకస్మాత్తుగా కూలిపోతుంది. సర్వనాశనమౌతుంది. ఆమె కోసం విలపించండి! ఆమె వేదన తీరడానికి ఔషధం ఇవ్వండి. ఆమెకు ఒకవేళ స్వస్థత కలుగుతుందేమో,
9 ౯ మేము బబులోనును బాగు చేద్దామనుకున్నాం. కానీ ఆమె బాగవ్వలేదు. అందరం ఆమెను విడిచిపెట్టి వెళ్లి పోదాం. మన స్వదేశాలకు వెళ్ళి పోదాం. ఆమె దోషం తీవ్రత ఆకాశాన్నంటింది. అది మేఘాల్లో పోగవుతుంది.
10 ౧౦ యెహోవా మన నిర్దోషిత్వాన్ని ప్రకటించాడు. రండి మనం సీయోనులో దీన్ని చెపుదాం. మన దేవుడైన యెహోవా చేసిన పనులను వివరిద్దాం.
11 ౧౧ బాణాలు పదును పెట్టండి. డాళ్ళు చేత పట్టుకోండి. బబులోనును నాశనం చేయడానికి యెహోవా మాదీయుల రాజు మనస్సును రేపుతున్నాడు. అది యెహోవా తీర్చుకుంటున్న ప్రతీకారం. తన మందిరాన్ని కూలగొట్టినందుకు ఆయన చేస్తున్న ప్రతిదండన.
12 ౧౨ బబులోను ప్రాకారాలపై జెండా ఎగరవేయండి. గస్తీ వాళ్ళను నియమించండి. యెహోవా తాను చేయదలిచింది చేయబోతూ ఉన్నాడు. అందుకని కావలి వాళ్ళను పెట్టండి. పట్టణం నుండి తప్పించుకుని పారిపోయే వాళ్ళను పట్టుకోడానికి సైనికులను దాచి ఉంచండి.
13 ౧౩ అనేక ప్రవాహ జలాల దగ్గర నివసించే ప్రజలారా! మీకున్న సంపదలతో మీరు సంపన్నులయ్యారు. మీ ముగింపు వచ్చేసింది. నీ జీవితకాలాన్ని ఆయన కుదించి వేశాడు.”
14 ౧౪ సేనల ప్రభువైన యెహోవా తన ప్రాణం మీదనే ప్రమాణం చేసి “మిడతల దండు దాడి చేసినట్టుగా నిన్ను నీ శత్రువులతో నింపివేస్తాను. వాళ్ళు నీకు వ్యతిరేకంగా యుద్ధనినాదం చేస్తారు.
15 ౧౫ తన శక్తితో ఈ భూమిని చేసిన వాడు తన జ్ఞానంతో పొడి నేలను ఏర్పాటు చేశాడు. తన వివేచనతో ఆకాశాలను విశాలపరిచాడు.
16 ౧౬ ఆయన ఉరిమినట్టుగా ఆజ్ఞ ఇస్తాడు. అప్పుడు ఆకాశంలో జలఘోష మొదలవుతుంది. ఆయన భూమి అగాధాల్లో నుండి ఆవిరిని పైకి వచ్చేలా చేస్తాడు. ఆయన వర్షం కురిసేలా మెరుపులు పుట్టిస్తాడు. తన గిడ్డంగుల్లోనుండి గాలిని రప్పిస్తాడు.
17 ౧౭ జ్ఞానం లేని ప్రతి ఒక్కడూ జంతువులా మారతాడు. లోహంతో పోత పోసి విగ్రహాలు చేసేవాడికి ఆ విగ్రహాల మూలంగానే అవమానం కలుగుతుంది. ఎందుకంటే వాడు పోత పోసి చేసేది మోసపు విగ్రహాలే. వాటిలో ప్రాణం ఉండదు.
18 ౧౮ అవి పనికిమాలినవి. వాటిని చేసే వాళ్ళు అపహాసకులు. వాటి పైకి శిక్ష వచ్చినప్పుడు అవి నశించి పోతాయి.
19 ౧౯ యాకోబుకు చెందిన దేవుడు అలాంటి వాడు కాదు. ఆయన అన్నిటినీ రూపొందించేవాడు. ఇశ్రాయేలును ఆయన తన వారసత్వంగా ఎన్నుకున్నాడు. సేనల ప్రభువైన యెహోవా అని ఆయనకు పేరు.
20 ౨౦ నువ్వు నాకు యుద్ధంలో ప్రయోగించే గద లాంటి వాడివి. యుద్ధంలో నువ్వు నా ఆయుధం. నీ ద్వారా నేను జనాలనూ జాతులనూ ధ్వంసం చేస్తాను. రాజ్యాలను నాశనం చేస్తాను.
21 ౨౧ నీ ద్వారా నేను గుర్రాలనూ వాటిపై స్వారీ చేసే రౌతులనూ చితకగొడతాను. నీ ద్వారా నేను రథాలను, వాటిని నడిపే సారధులనూ ధ్వంసం చేస్తాను.
22 ౨౨ నీ ద్వారా నేను ప్రతి పురుషుణ్ణీ, స్త్రీనీ ధ్వంసం చేస్తాను. నీ ద్వారా యువకులనూ, వృద్ధులనూ మట్టుబెడతాను. నీ ద్వారా నేను యవ్వనంలో ఉన్న వాళ్ళనూ, కన్యలనూ మట్టుబెడతాను.
23 ౨౩ నీ ద్వారా నేను గొర్రెల కాపరులనూ, వాళ్ళ మందలనూ ధ్వంసం చేస్తాను. నీ ద్వారా నేను నాగలి దున్నే వాళ్ళనీ వాళ్ళ బృందాలనూ ధ్వంసం చేస్తాను. నీ ద్వారా నేను పాలించే వాళ్ళనూ అధికారులనూ ధ్వంసం చేస్తాను.
24 ౨౪ బబులోనూ, కల్దీయ దేశనివాసులూ సీయోనుకి చేసిన దుర్మార్గానికంతటికీ మీరు చూస్తుండగానే వాళ్లకి ప్రతీకారం చేస్తాను.” ఇది యెహోవా చేస్తున్న ప్రకటన.
25 ౨౫ “చూడు, ఇతరులను నాశనం చేసే పర్వతమా, నేను నీకు విరోధంగా ఉన్నాను” ఇది యెహోవా చేస్తున్న ప్రకటన. “భూమినంతా నాశనం చేసేదానా, నేను నిన్ను నా చేతితో కొడతాను. నిన్ను శిఖరాల పైనుండి కిందకు దొర్లించి వేస్తాను. పూర్తిగా తగలబడి పోయిన కొండలా నిన్ను చేస్తాను.
26 ౨౬ ఇళ్ళు కట్టుకునే వాళ్ళు గోడ మూలాలకు గానీ, పునాదికి గానీ నీ రాళ్ళు వాడుకోరు. నువ్వు ఎప్పటికీ నాశనమయ్యే ఉంటావు.” ఇది యెహోవా చేస్తున్న ప్రకటన.
27 ౨౭ దేశంలో జెండాలెత్తండి. జనాల్లో బాకా ఊదండి. ఆమెపై దాడి చేయడానికి జనాలకు బాధ్యత అప్పగించండి. దాని పై దాడి చేయడానికి అరారాతు, మిన్నీ, అష్కనజు అనే రాజ్యాలకు దాన్ని గూర్చి తెలియజేయండి. దానిపై దాడి చేయడం కోసం ఒక సైన్యాధిపతిని నియమించండి. మిడతల దండులా గుర్రాలను తరలించండి.
28 ౨౮ ఆమెపై దాడి చేయడానికి జనాలకు బాధ్యత అప్పగించండి. మాదీయుల రాజులను, ఏలికలను పిలవండి. రాజు కింద అధికారులను, అతడి ఆధీనంలో ఉన్న దేశాలన్నిటినీ దాడి చేయడం కోసం నియమించండి.
29 ౨౯ బబులోను దేశానికి విరోధంగా యెహోవా ఆలోచనలు కొనసాగుతాయి. కాబట్టి అది వేదన భారంతో ఉంటుంది. భూమి కంపిస్తుంది. అక్కడ నివసించే వాడు ఒక్కడూ లేకుండా బబులోనును పనికిరాని నేలగా చేయాలని ఆయన సంకల్పించాడు.
30 ౩౦ బబులోనులో సైనికులు పోరాడటం ఆపేశారు. వాళ్ళు తమ కోటలోనే నిలిచారు. వాళ్ళ బలం విఫలమై పోయింది. వాళ్ళు స్త్రీలవలే బలహీనంగా ఉన్నారు.
31 ౩౧ బబులోను రాజూ, అతడి పట్టణమూ ఈ చివర నుండి ఆ చివరి వరకూ శత్రువు స్వాధీనంలోకి వెళ్లి పోయాయి. ఒక వార్తాహరుడు మరో వార్తాహరుడికీ, ఒక సైనికుడి నుండి మరో సైనికుడికీ ఈ వార్త అందించడానికి పరుగు పెడుతున్నారు.
32 ౩౨ నదుల పక్కన ఉన్న రేవులను శత్రువులు పట్టుకున్నారు. దాని కోటలను శత్రువులు తగలబెడుతున్నారు. బబులోనులో యుద్ధం చేసే యోధులు అయోమయంలో మునిగిపోయారు.
33 ౩౩ సేనల ప్రభువూ, ఇశ్రాయేలు దేవుడూ అయిన యెహోవా ఇలా అంటున్నాడు. “బబులోను కుమార్తె ధాన్యం నూర్చే కళ్ళం లాగా ఉంది. ఆమెను కింద తొక్కివేసే సమయం ఇదే. మరికొంత కాలానికి పంట ధాన్యం వస్తుంది.
34 ౩౪ యెరూషలేము ఇలా అంటుంది. ‘బబులోను రాజు నెబుకద్నెజరు నన్ను మింగి వేశాడు. నేను ఎండిపోయేలా చేశాడు. నన్ను ఖాళీ కుండగా చేశాడు. కొండ చిలవలాగా నన్ను మింగివేశాడు. నా ఆహారంతో తన కడుపు నింపుకున్నాడు. నన్ను ఖాళీ పాత్రలా చేశాడు.’”
35 ౩౫ సీయోను నివాసులు ఇలా అంటారు. “నాకూ నా కుటుంబానికీ వ్యతిరేకంగా జరిగిన హింస నా ఉసురు తగిలి బబులోనుకు జరుగుతుంది గాక!” యెరూషలేము ఇలా అంటుంది. “నా రక్తం ఒలికించిన పాపం కల్దీయులకు తగులుతుంది గాక!”
36 ౩౬ కాబట్టి యెహోవా ఇలా చెప్తున్నాడు. “చూడండి, నేను నీ పక్షంగా వాదించ బోతున్నాను. నీ తరపున ప్రతీకారం చేస్తాను. బబులోనులో నీళ్ళు లేకుండా చేస్తాను. దాని ఊటలు ఇంకిపోయేలా చేస్తాను.
37 ౩౭ బబులోను ఒక పెద్ద చెత్త కుప్పలా ఉంటుంది. నక్కల నిలయంగా మారుతుంది. భయానికీ, ఎగతాళికీ కారణంగా ఉంటుంది. ఎవరూ అక్కడ నివాసం ఉండరు.
38 ౩౮ బబులోను వాళ్ళంతా కలసి సింహాల్లా గర్జిస్తారు. సింహం కూనల్లాగా కూత పెడతారు.
39 ౩౯ వాళ్ళు దురాశతో ఉద్రేకం చూపినప్పుడు వాళ్ళ కోసం ఒక విందు ఏర్పాటు చేస్తాను. వాళ్ళు బాగా సంతోషపడేలా వాళ్ళతో మద్యం తాగిస్తాను. అప్పుడు వాళ్ళు శాశ్వత నిద్రలోకి వెళ్తారు. ఇక మేల్కొనరు. ఇది యెహోవా చేస్తున్న ప్రకటన.
40 ౪౦ గొర్రెలు వధకు వెళ్ళినట్టుగా వాళ్ళని వధ్యశాలకు పంపుతాను. గొర్రెపిల్లలూ, మేకలూ వధకు వెళ్ళినట్టుగా వాళ్ళను పంపుతాను.
41 ౪౧ బబులోనును ఎలా పట్టుకున్నారు? భూమిపై అందరూ పొగిడే పట్టణం లొంగిపోయింది. రాజ్యాలన్నిటిలో బబులోను ఎలా శిథిల దేశంగా మారింది?
42 ౪౨ సముద్రం బబులోను పైకి వచ్చింది. భీకర హోరుతో అలలు దాన్ని ముంచెత్తాయి.
43 ౪౩ దాని పట్టణాలు నిర్జనంగానూ, ఎండిన భూమిగానూ, అడవిగానూ మారిపోయాయి. ఎవ్వరూ నివాసముండని, ఎవరూ దాని మీదుగా ప్రయాణం చేయని ప్రాంతంలాగా మారిపోయాయి.
44 ౪౪ కాబట్టి బబులోనులో ఉన్న బేలు దేవుణ్ణి శిక్షిస్తాను. వాడు మింగినదంతా వాడితో కక్కిస్తాను. ఇకపైన ప్రజలు గుంపులుగా వాడికి అర్పణలు చెల్లించడానికి రారు. బబులోను గోడలు కూలిపోతాయి.
45 ౪౫ నా ప్రజలారా! మీరు దానిలో నుండి బయటకు వెళ్ళండి. మీలో ప్రతి ఒక్కడూ నా క్రోధం నుండి తన ప్రాణాన్ని రక్షించుకోవాలి.
46 ౪౬ దేశంలో వినిపించే వార్తలకు మీ హృదయాలను భయపడనివ్వకండి. ఈ వార్తలు ఈ సంవత్సరం వినిపిస్తాయి. ఇది అయ్యాక తర్వాత సంవత్సరం మళ్ళీ వార్తలు వినిపిస్తాయి. దేశంలో హింస జరుగుతుంది. ఒక రాజ్యాధిపతికి విరోధంగా మరో రాజ్యాధిపతి ఉంటాడు.
47 ౪౭ కాబట్టి చూడండి, బబులోను లోని చెక్కిన విగ్రహాలను నేను శిక్షించే రోజులు రాబోతున్నాయి. ఆమె దేశం అంతా సిగ్గుపాలు అవుతుంది. వధకు గురైన ఆమె ప్రజలు దేశంలోనే పడిపోతారు.
48 ౪౮ వినాశకులు ఉత్తరం వైపు నుండి ఆమె కోసం వస్తున్నారు” ఇది యెహోవా చేస్తున్న ప్రకటన. అప్పుడు ఆకాశంలోనూ, భూమిపైనా ఉన్నదంతా బబులోనుకు పట్టిన దుర్గతి చూసి సంతోషిస్తుంది.
49 ౪౯ ఇశ్రాయేలులో వధకు గురైన వాళ్ళను బబులోను కూల్చినట్టుగానే బబులోనులో వధకు గురైన వాళ్ళు అక్కడే కూలిపోతారు.
50 ౫౦ కత్తిని తప్పించుకున్న వాళ్ళు వెంటనే వెళ్ళి పొండి. అక్కడే ఉండకండి. దూరం నుండి మీరు యెహోవాను జ్ఞాపకం చేసుకోండి. యెరూషలేమును మీ జ్ఞాపకాల్లోకి రానివ్వండి.
51 ౫౧ మమ్మల్ని అవమానపరిచే మాటలు విన్నాం. దానికి సిగ్గు పడుతున్నాం. మాపై పడ్డ నింద మా ముఖాలను కప్పి వేసింది. ఎందుకంటే యెహోవా పేరును కలిగి ఉన్న పరిశుద్ధ స్థలాల్లోకి విదేశీయులు ప్రవేశించారు.
52 ౫౨ కాబట్టి, వినండి, ఇది యెహోవా చేస్తున్న ప్రకటన. “నేను ఆమె వద్ద ఉన్న చెక్కిన విగ్రహాలను శిక్షించే రోజులు రాబోతున్నాయి. ఆమె దేశమంతా గాయపడిన వాళ్ళు మూలుగుతూ ఉంటారు.
53 ౫౩ బబులోను తన ఎత్తయిన కోటలను ఎంత బలోపేతం చేసినా, వాళ్ళ కోటలు ఆకాశంలోకి కట్టుకున్నా వినాశకులు నానుండి ఆమె దగ్గరికి వస్తారు.” ఇది యెహోవా చేస్తున్న ప్రకటన.
54 ౫౪ “బబులోనులో నుండి ఏడుపు వినిపిస్తుంది. కల్దీయుల దేశం కూలిపోతున్న మహా నాశన ధ్వని వినిపిస్తుంది.
55 ౫౫ యెహోవా బబులోనును నాశనం చేస్తున్నాడు. దాని మహా ఘోషను అణచివేస్తున్నాడు. వాళ్ళ శత్రువులు అనేక ప్రవాహ జలాల్లా గర్జిస్తున్నారు. వాళ్ళు చేసే శబ్దం బలంగా వినిపిస్తున్నది.
56 ౫౬ ఆమెకు వ్యతిరేకంగా, బబులోనుకు వ్యతిరేకంగా వినాశకులు వచ్చేశారు. ఆమె యోధులను పట్టుకున్నారు. వాళ్ళ ధనుస్సులను విరగ్గొట్టేశారు. యెహోవా ప్రతీకారం చేసే దేవుడు. ఆయన తప్పకుండా ప్రతిఫలం ఇస్తాడు.
57 ౫౭ బబులోను అధిపతులూ, ఆమె జ్ఞానులూ, ఆమె అధికారులూ, ఆమె సైనికులూ మద్యం తాగి మత్తెక్కేలా చేస్తాను. వాళ్ళు శాశ్వత నిద్రలోకి జారుకుంటారు. ఇక లేవరు.” ఇది రాజు చేస్తున్న ప్రకటన. ఆయన పేరు సేనల ప్రభువైన యెహోవా.
58 ౫౮ సేనల ప్రభువైన యెహోవా ఇలా చెప్తున్నాడు. “బబులోను భారీ ప్రాకారాలను సంపూర్ణంగా కూల్చి వేస్తారు. దాని ఎత్తయిన ద్వారాలను అగ్నితో కాల్చివేస్తారు. ఆమెకు సహాయం చేయడానికి వచ్చే వాళ్ళ ప్రయాస వృథాయే. ఆమె కోసం జనాలు చేసే ప్రయత్నాలన్నీ అగ్నికి ఆహుతి అవుతాయి.”
59 ౫౯ ఇది మహసేయా మనవడూ, నేరీయా కొడుకూ అయిన సెరాయాకు యిర్మీయా ప్రవక్త ఆజ్ఞాపించిన వాక్కు. ఈ శెరాయా రాజు దగ్గర ప్రధాన అధికారి గనక సిద్కియా పరిపాలన నాలుగో సంత్సరంలో, రాజైన సిద్కియాతో కలిసి సెరాయా యూదా దేశం నుండి బబులోనుకు వెళ్ళినప్పుడు,
60 ౬౦ బబులోను పైకి రాబోతున్న విపత్తులన్నిటి గూర్చీ యిర్మీయా ఒక పుస్తకంలో రాశాడు. ఈ మాటలన్నీ బబులోను గూర్చి రాశాడు.
61 ౬౧ యిర్మీయా శెరాయాతో ఇలా చెప్పాడు. “నువ్వు బబులోనుకు వెళ్ళినప్పుడు ఈ మాటలన్నీ తప్పనిసరిగా చదివి వినిపించు.
62 ౬౨ ‘యెహోవా, ఈ స్థలాన్ని నాశనం చేయడానికి నువ్వు ఈ మాటలు ప్రకటించావు. బబులోనులో నివసించేవాడు ఎవడూ లేడు. ప్రజలు గానీ, పశువులుగానీ లేక ఇది శాశ్వతంగా వ్యర్ధభూమిగా ఉండిపోతుంది. ఈ మాటలన్నీ నువ్వే చెప్పావు’ అని నువ్వు చెప్పాలి.
63 ౬౩ ఈ పుస్తకాన్ని నువ్వు చదివి ముగించిన తర్వాత దానికో రాయి కట్టి యూఫ్రటీసు నదిలో విసిరివెయ్యి.
64 ౬౪ ‘బబులోను ఇలాగే మునిగిపోతుంది. ఆమెకు విరోధంగా నేను పంపబోయే విపత్తుల కారణంగా అది ఇక పైకి లేవదు. దాని ప్రజలు కూలిపోతారు.’ అని ప్రకటించు.” దీంతో యిర్మీయా మాటలు ముగిసాయి.