< యిర్మీయా 36 >
1 ౧ యూదా రాజు యోషీయా కొడుకు యెహోయాకీము పాలించిన నాలుగో సంవత్సరంలో యెహోవా వాక్కు యిర్మీయాతో ఇలా చెప్పాడు.
2 ౨ “నువ్వు ఒక పుస్తకం తీసుకుని నేను నీతో మాట్లాడిన రోజు మొదలుకుని, అంటే, యోషీయా కాలం మొదలుకుని ఈ రోజు వరకు ఇశ్రాయేలు, యూదా ప్రజల గురించీ, అన్ని జాతుల గురించీ నీతో పలికిన మాటలన్నీ దానిలో రాయి.
3 ౩ నేను యూదా ప్రజలకు చెయ్యాలని ఉద్దేశించిన కీడంతటి గురించి వాళ్ళు విని, నేను వాళ్ళ దోషం, వాళ్ళ పాపం క్షమించేలా తమ దుర్మార్గత విడిచి పశ్చాత్తాప పడతారేమో.”
4 ౪ యిర్మీయా నేరీయా కొడుకు బారూకును పిలిపించాడు. యెహోవా యిర్మీయాతో చెప్పిన మాటలన్నీ యిర్మీయా చెప్తూ ఉండగా అతడు ఆ పుస్తకంలో రాశాడు.
5 ౫ తరువాత యిర్మీయా బారూకుకు ఇలా ఆజ్ఞ ఇచ్చాడు. “నేను చెరసాలలో ఉన్నాను కాబట్టి యెహోవా మందిరానికి రాలేను.
6 ౬ కాబట్టి నువ్వు వెళ్లి, ఉపవాసదినాన యెహోవా మందిరంలో ప్రజలకు వినిపించేలా, నేను చెప్తూ ఉండగా నువ్వు పుస్తకంలో రాసిన యెహోవా మాటలు ప్రకటించు. తమ పట్టణాలనుంచి వచ్చే యూదా ప్రజలందరికీ వినిపించేలా వాటిని ప్రకటించు.
7 ౭ దయ చూపించమని వాళ్ళు చేసే అభ్యర్ధనలు ఒకవేళ యెహోవా దృష్టికి ఆమోదం అవుతాయేమో, ఒకవేళ వాళ్ళు తమ చెడుమార్గం విడిచిపెడతారేమో, ఎందుకంటే ఈ ప్రజల మీద యెహోవా ప్రకటించిన ఉగ్రత, మహాకోపం ఎంతో తీవ్రంగా ఉన్నాయి.”
8 ౮ కాబట్టి ప్రవక్త అయిన యిర్మీయా తనకు ఆజ్ఞ ఇచ్చినట్టు, నేరీయా కొడుకు బారూకు యెహోవా మాటలన్నీ, బిగ్గరగా యెహోవా మందిరంలో చదివి వినిపించాడు.
9 ౯ యూదా రాజైన యోషీయా కొడుకు యెహోయాకీము పరిపాలనలో ఐదో సంవత్సరం తొమ్మిదో నెలలో యెరూషలేములో ఉన్న ప్రజలందరూ, యూదా పట్టాణాల్లో నుంచి యెరూషలేముకు వచ్చిన ప్రజలందరూ యెహోవా పేరట ఉపవాసం ప్రకటించినప్పుడు,
10 ౧౦ బారూకు యెహోవా మందిరంలో లేఖికుడైన షాఫాను కొడుకు గెమర్యా గదికి పైగా ఉన్న ప్రాంగణంలో, యెహోవా మందిరపు ప్రవేశ ద్వారం దగ్గర, ప్రజలందరూ వినేలా యిర్మీయా చెప్పిన మాటలు పుస్తకంలోనుంచి చదివి వినిపించాడు.
11 ౧౧ షాఫాను కొడుకైన గెమర్యా కొడుకు మీకాయా ఆ పుస్తకంలో ఉన్న యెహోవా మాటలన్నీ విని
12 ౧౨ రాజమందిరంలో ఉన్న లేఖికుడి గదిలోకి వెళ్ళినప్పుడు నాయకులందరూ లేఖికుడైన ఎలీషామా, షెమాయా కొడుకు దెలాయ్యా, అక్బోరు కొడుకు ఎల్నాతాను, షాఫాను కొడుకు గెమర్యా, హనన్యా కొడుకు సిద్కియా అనే వాళ్ళూ, నాయకులందరూ అక్కడ కూర్చుని ఉన్నారు.
13 ౧౩ బారూకు ప్రజలందరికీ వినిపించేలా ఆ పుస్తకంలో నుంచి చదివి వినిపించిన మాటలన్నీ మీకాయా వాళ్లకు తెలియజేసినప్పుడు,
14 ౧౪ అధికారులందరూ కూషీ మునిమనవడు, షెలెమ్యాకు మనవడు, నెతన్యాకు కొడుకు అయిన యెహూదిని బారూకు దగ్గరికి పంపి “నువ్వు ప్రజలు వింటుండగా చదివిన ఆ పుస్తకపు చుట్ట నీ చేత్తో పట్టుకుని తీసుకురా” అని ఆజ్ఞ ఇచ్చారు. నేరీయా కొడుకు బారూకు ఆ పుస్తకపు చుట్ట చేత్తో పట్టుకుని వచ్చాడు.
15 ౧౫ అతడు వచ్చినప్పుడు వాళ్ళు “నువ్వు కూర్చుని మాకు చదివి వినిపించు” అన్నారు. కాబట్టి బారూకు దాన్ని వారికి చదివి వినిపించాడు.
16 ౧౬ వాళ్ళు ఆ మాటలన్నీ విన్నప్పుడు భయంతో ఒకరినొకరు చూసుకుని “మనం కచ్చితంగా ఈ మాటలు రాజుకు తెలియజేయాలి” అని బారూకుతో అన్నారు.
17 ౧౭ అప్పుడు వాళ్ళు బారూకుతో “మాతో చెప్పు, ఈ మాటలన్నీ యిర్మీయా చెప్తూ ఉన్నప్పుడు నువ్వు ఎలా రాశావు?” అని అడిగారు.
18 ౧౮ బారూకు వాళ్ళతో “అతడు తన నోటితో ఈ మాటలన్నీ పలికినప్పుడు, నేను పుస్తకపు చుట్టలో వాటిని సిరాతో రాశాను” అన్నాడు.
19 ౧౯ అప్పుడు ఆ అధికారులు బారూకుతో “నువ్వూ, యిర్మీయా, ఇద్దరూ వెళ్లి దాగి ఉండండి. మీరున్న చోటు ఎవరికీ తెలియనివ్వొద్దు” అన్నారు.
20 ౨౦ అప్పుడు వాళ్ళు ఆ పుస్తకాన్ని లేఖికుడైన ఎలీషామా గదిలో ఉంచి, రాజమందిరానికి తామే వెళ్లి, ఆ మాటలన్నీ రాజుకు చెప్పారు.
21 ౨౧ అప్పుడు రాజు ఆ పుస్తకపు చుట్టను తీసుకురావడానికి యెహూదిని పంపించినప్పుడు అతడు లేఖికుడైన ఎలీషామా గదిలోనుంచి దాన్ని తీసుకొచ్చి రాజుకు, రాజు పక్కన నిల్చుని ఉన్న అధికారులకూ వినిపించేలా బిగ్గరగా చదివాడు.
22 ౨౨ తొమ్మిదో నెలలో, రాజు శీతాకాలం రాజమందిరంలో కూర్చుని ఉన్నప్పుడు, అతని ఎదుట కుంపటిలో అగ్ని రగులుతూ ఉంది.
23 ౨౩ యెహూది మూడు నాలుగు వరుసలు చదివిన తరువాత, రాజు చాకుతో దాన్ని కోసి, ఆ కుంపటిలో వేశాడు. అప్పుడు అది పూర్తిగా కాలిపోయింది.
24 ౨౪ అయితే, రాజుగాని, ఈ మాటలన్నీ విన్న అతని సేవకుల్లో ఒక్కడైనా భయపడ లేదు, తమ బట్టలు చింపుకోలేదు.
25 ౨౫ పుస్తకపు చుట్టను కాల్చవద్దని ఎల్నాతాను, దెలాయ్యా, గెమర్యా రాజును కోరినా, అతడు వాళ్ళ మాట వినలేదు.
26 ౨౬ లేఖికుడైన బారూకును, ప్రవక్త అయిన యిర్మీయాను పట్టుకోవాలని రాజవంశస్థుడైన యెరహ్మెయేలుకు, అజ్రీయేలు కొడుకు శెరాయాకు, అబ్దెయేలు కొడుకు షెలెమ్యాకు రాజు ఆజ్ఞాపించాడు, కాని యెహోవా యిర్మియా బారూకులను వారికి కనబడకుండా చేశాడు.
27 ౨౭ యిర్మీయా చెప్పిన మాటనుబట్టి బారూకు రాసిన పుస్తకం చుట్టను రాజు కాల్చివేసిన తరువాత యెహోవా వాక్కు యిర్మీయాతో ఇలా చెప్పాడు.
28 ౨౮ నువ్వు ఇంకొక పుస్తకం చుట్ట తీసుకుని యూదా రాజైన యెహోయాకీము కాల్చిన మొదటి పుస్తకంలో రాసిన మాటలన్నీ దానిలో రాయి.
29 ౨౯ యూదా రాజైన యెహోయాకీముకు నువ్వు ఈ మాట చెప్పాలి. “యెహోవా చెప్పేదేమంటే, నువ్వు పుస్తకపు చుట్టను కాల్చేశావు! ‘బబులోను రాజు కచ్చితంగా వచ్చి ఈ దేశాన్ని నాశనం చేసి, ఈ ప్రజలను, జంతువులను నాశనం చేస్తాడు’ అని నువ్వు ఇందులో ఎందుకు రాశావు? అని అడిగావు.”
30 ౩౦ ఆ కారణంగా యూదా రాజైన యెహోయాకీము గురించి యెహోవా ఇలా అంటున్నాడు. “దావీదు సింహాసనం మీద కూర్చోడానికి నీ వారసులు ఎవరూ ఉండరు. పగలు ఎండలో, రాత్రి గడ్డ కట్టిన మంచులో పాడైపోయేలా నీ శవాన్ని పారేస్తారు.
31 ౩౧ వాళ్ళ దోషాన్ని బట్టి అతన్నీ, అతని సంతతినీ, అతని సేవకులనూ నేను శిక్షిస్తాను. నేను వాళ్ళ గురించి చెప్పిన కీడంతా వాళ్ళ మీదకీ, యెరూషలేము, యూదా ప్రజల మీదకీ తీసుకొస్తానని మిమ్మల్ని బెదిరించినా వాళ్ళు దాన్ని పట్టించుకోలేదు.”
32 ౩౨ కాబట్టి యిర్మీయా ఇంకొక పుస్తకం చుట్టను తీసుకుని లేఖికుడైన నేరియా కొడుకు బారూకు చేతికి ఇచ్చినప్పుడు, అతడు యిర్మీయా నోటితో చెప్పిన మాటలనుబట్టి యూదా రాజైన యెహోయాకీము తగలబెట్టిన పుస్తకం చుట్టలోని మాటలన్నీ మళ్ళీ రాశాడు. ఆ మాటలే కాకుండా, అలాంటివి ఇంకా ఎన్నో మాటలు వాటికి జోడించి రాశాడు.