< యాకోబు 2 >
1 ౧ నా సహోదరులారా, మహిమ స్వరూపి అయిన మన ప్రభు యేసు క్రీస్తును విశ్వసించే వారుగా పక్షపాతం లేకుండా ఉండండి.
2 ౨ ఎవరైనా బంగారు ఉంగరాలు పెట్టుకుని, ఖరీదైన బట్టలు వేసుకున్న వాడు, మాసిన బట్టలు వేసుకొన్న పేదవాడొకడు, వీరిద్దరూ మీ సమావేశానికి వచ్చారనుకోండి.
3 ౩ మీ దృష్టి ఖరీదైన బట్టలు వేసుకున్నవాడి మీద ఉంచి, “దయచేసి ఈ మంచి చోట కూర్చోండి,” అని చెప్పి, పేదవానితో, “నువ్వు అక్కడ నిలబడు,” లేదా, “నా కాళ్ళ దగ్గర కూర్చో,” అంటే,
4 ౪ మీరు చెడు ఉద్దేశంతో నిర్ణయం తీసుకుని తేడా చూపుతున్నట్టే కదా?
5 ౫ నా ప్రియ సోదరులారా, వినండి. దేవుడు ఈ లోకంలో పేదవారిని విశ్వాసంలో ధనవంతులుగాను, తనను ప్రేమించిన వారిని తాను వాగ్దానం చేసిన రాజ్యానికి వారసులుగాను ఎన్నుకోలేదా?
6 ౬ కానీ మీరు పేదవాణ్ణి అవమానానికి గురి చేశారు. మిమ్మల్ని అణగదొక్కేదీ, చట్ట సభలకు ఈడ్చేదీ ధనవంతులు కాదా?
7 ౭ మిమ్మల్ని పిలిచిన వాడి మంచి పేరు ఈ ధనికుల వల్లనే కదా దూషణకు గురౌతున్నది?
8 ౮ “నిన్ను ప్రేమించుకున్నట్టే నీ పొరుగువాణ్ణి కూడా ప్రేమించు,” అని లేఖనాల్లో రాసి ఉన్న దైవ రాజాజ్ఞ పాటిస్తే, మీ ప్రవర్తన సరిగా ఉన్నట్టే.
9 ౯ కాని మీరు కొందరి విషయంలో పక్షపాతంగా ఉంటే మీరు పాపం చేస్తున్నట్టే. మీరు ధర్మశాస్త్రాన్ని ఉల్లంఘించినట్టు ధర్మశాస్త్రమే నిర్ధారిస్తున్నది.
10 ౧౦ ఎవరైనా ధర్మశాస్త్రం అంతా పాటించి, ఏ ఒక్క ఆజ్ఞ విషయంలో అయినా తడబడితే, ఆజ్ఞలన్నిటినీ మీరిన అపరాధి అవుతాడు.
11 ౧౧ “వ్యభిచారం చెయ్యవద్దు” అని చెప్పిన దేవుడు, “హత్య చెయ్యవద్దు” అని కూడా చెప్పాడు. నువ్వు వ్యభిచారం చేయకుండా హత్య చేస్తే, దేవుని ధర్మశాస్త్రాన్ని మీరినట్టే.
12 ౧౨ నిజమైన స్వాతంత్రం ఇచ్చే ధర్మశాస్త్రం విషయంలో తీర్పుకు గురయ్యే వారికి తగినట్టుగా మాట్లాడండి. అదే విధంగా ప్రవర్తించండి.
13 ౧౩ కనికరం చూపించని వాడికి కనికరం లేని తీర్పు వస్తుంది. కనికరం తీర్పును జయిస్తుంది.
14 ౧౪ నా సోదరులారా, ఎవరైనా తనకు విశ్వాసం ఉందని చెప్పి, క్రియలు లేనివాడైతే ఏం ప్రయోజనం? ఆ విశ్వాసం అతన్ని రక్షించగలదా?
15 ౧౫ ఒక సోదరునికి గాని, సోదరికి గాని కట్టుకోడానికి బట్టలు, ఆ రోజు తినడానికి భోజనం అవసరం అయితే,
16 ౧౬ మీలో ఒకడు అలాటి వారితో, “శాంతిగా వెళ్ళు, వెచ్చగా ఉండు, తృప్తిగా తిను” అని చెబితే ఏం ప్రయోజనం?
17 ౧౭ అదే విధంగా, క్రియలు లేకుండా విశ్వాసం ఒక్కటే ఉంటే, అదీ చచ్చినదే.
18 ౧౮ అయినా ఒకడు, “నీకు విశ్వాసం ఉంది, నాకు క్రియలు ఉన్నాయి” అనవచ్చు. క్రియలు లేని నీ విశ్వాసం నాకు చూపించు. అప్పుడు నేను నా క్రియల ద్వారా నా విశ్వాసం చూపిస్తాను.
19 ౧౯ దేవుడు ఒక్కడే అని నువ్వు నమ్ముతున్నావు సరే. కానీ దయ్యాలు కూడా అదే నమ్ముతున్నాయి. నమ్మి గడగడా వణుకుతున్నాయి.
20 ౨౦ బుద్ధిలేనివాడా! క్రియలు లేని విశ్వాసం వల్ల ప్రయోజనం లేదు అని నీకు తెలుసుకోవాలని లేదా?
21 ౨౧ మన పూర్వికుడు అబ్రాహాము తన కుమారుడు ఇస్సాకును బలిపీఠం మీద అర్పణ చేసినప్పుడు, క్రియల వల్ల నీతిమంతుడుగా తీర్పు పొందలేదా?
22 ౨౨ అతని విశ్వాసం క్రియలతో కలిసి పని చేసింది. అతని క్రియల ద్వారా విశ్వాసం పరిపూర్ణమైనదని గ్రహిస్తున్నావు గదా.
23 ౨౩ “అబ్రాహాము దేవుణ్ణి నమ్మాడు, అది అతనికి నీతిగా లెక్కలోకి వచ్చింది.” అని లేఖనాల్లో ఉన్న విషయం నెరవేరింది. అంతేకాక అబ్రాహాముకు దేవుని స్నేహితుడు అని పేరు వచ్చింది.
24 ౨౪ మనిషిని విశ్వాసం ద్వారా మాత్రమే కాకుండా క్రియల ద్వారా దేవుడు నీతిమంతుడుగా ఎంచడం మీరు చూశారు.
25 ౨౫ అలానే వేశ్య రాహాబు కూడా వార్తాహరులను ఆహ్వానించి వేరొక మార్గంలో వారిని పంపివేయడాన్ని బట్టి తన క్రియల మూలంగా ఆమె నీతిమంతురాలుగా ఎంచ బడింది గదా?
26 ౨౬ ప్రాణం లేని శరీరం ఎలా మృతమో, అలాగే క్రియలు లేని విశ్వాసం కూడా మృతమే.