< హొషేయ 1 >
1 ౧ ఉజ్జియా, యోతాము, ఆహాజు, హిజ్కియా అనే యూదా రాజులు, యెహోయాషు కుమారుడైన ఇశ్రాయేలు రాజు యరొబాము పరిపాలించిన దినాల్లో బెయేరి కుమారుడు హోషేయకు ప్రత్యక్షమైన యెహోవా వాక్కు.
2 ౨ యెహోవా హోషేయతో మొదట మాట్లాడినప్పుడు ఇలా ఆజ్ఞాపించాడు. “వెళ్ళి ఒక వేశ్యను నీకు భార్యగా తెచ్చుకో. ఆమె వ్యభిచారం ఫలితంగా పుట్టిన సంతానాన్ని స్వీకరించు. ఎందుకంటే దేశం నన్ను విడిచిపెట్టి నీచమైన వ్యభిచార కార్యాలు చేసింది.”
3 ౩ కాబట్టి హోషేయ వెళ్ళి దిబ్లయీము కూతురు గోమెరును పెళ్ళాడాడు. ఆమె గర్భం ధరించి అతనికొక కొడుకుని కన్నది.
4 ౪ యెహోవా అతనికి ఇలా ఆజ్ఞాపించాడు. “వీడికి ‘యెజ్రెయేల్’ అని పేరు పెట్టు. యెజ్రెయేలులో యెహూ వంశం వారు రక్తపాతం చేశారు. దాన్ని బట్టి ఇక కొంతకాలానికి నేను వారిని శిక్షిస్తాను. ఇశ్రాయేలువారికి రాజ్యం ఉండకుండాా తీసేస్తాను.
5 ౫ ఆ రోజుల్లో జరిగేది ఏమిటంటే, నేను యెజ్రెయేలు లోయలో ఇశ్రాయేలు వారి విల్లును విరిచేస్తాను.”
6 ౬ గోమెరు మళ్లీ గర్భం ధరించి ఆడపిల్లను కన్నది. యెహోవా అతనికి ఇలా చెప్పాడు. “దీనికి ‘లో రూహామా’ అని పేరు పెట్టు. ఎందుకంటే ఇకపై నేను ఇశ్రాయేలును క్షమించడం కోసం వారిపై జాలి పడను.
7 ౭ అయితే యూదావారిపై జాలి చూపుతాను. వారి దేవుడైన యెహోవా అనే నేనే వారిని రక్షిస్తాను. విల్లు, ఖడ్గం, సమరం, గుర్రాలు, రౌతులు అనే వాటి వల్ల కాదు.”
8 ౮ లో రూహామా పాలు మానిన తరువాత ఆమె తల్లి గర్భం ధరించి మరొక కొడుకును కన్నది.
9 ౯ యెహోవా ఇలా చెప్పాడు. “వీడికి ‘లో అమ్మీ’ అని పేరు పెట్టు. ఎందుకంటే మీరు నా ప్రజలు కారు, నేను మీకు దేవుణ్ణి కాను.
10 ౧౦ అయినప్పటికీ ఇశ్రాయేలీయుల జనసంఖ్య సముద్రతీరంలో ఇసుకంత విస్తారం అవుతుంది. దాన్ని కొలవలేము, లెక్కబెట్టలేము. ఎక్కడ ‘మీరు నా ప్రజలు కారు’ అని వారితో చెప్పానో, అక్కడే ‘మీరు సజీవుడైన దేవుని ప్రజలు’ అని వారికి చెబుతారు.
11 ౧౧ యూదా, ఇశ్రాయేలు ఒక్క చోట సమకూడుతారు. తమపై ఒకే నాయకుణ్ణి నియమించుకుంటారు. ఆ దేశంలో నుండి బయలు దేరుతారు. ఆ యెజ్రెయేలు దినం మహా ప్రభావ దినం.”