< నిర్గమకాండము 35 >
1 ౧ మోషే ఇశ్రాయేలు ప్రజల సమాజమంతటినీ సమకూర్చి ఇలా చెప్పాడు. “యెహోవా ఆజ్ఞాపించినట్టు మీరు జరిగించవలసిన నియమాలు ఇవి.
2 ౨ మొదటి ఆరు రోజులు మీరు పని చెయ్యాలి. ఏడవ రోజు మీకు పరిశుద్ధమైనది. అది యెహోవా నియమించిన విశ్రాంతి దినం. ఆ రోజు పని చేసే ప్రతివాడూ మరణ శిక్షకు పాత్రుడు.
3 ౩ విశ్రాంతి దినాన మీరు మీ ఇళ్ళలో ఎలాంటి వంటకాలు వండుకోకూడదు.”
4 ౪ మోషే ఇశ్రాయేలు ప్రజల సమాజమంతటితో ఇంకా ఇలా చెప్పాడు. “యెహోవా ఆజ్ఞాపించినది ఏమిటంటే,
5 ౫ మీలో మీరు యెహోవా కోసం అర్పణలు, కానుకలు పోగుచేయండి. ఎలాగంటే, యెహోవా సేవ కోసం కానుకలు ఇవ్వాలనే మనసు కలిగిన ప్రతివాడూ బంగారం, వెండి, ఇత్తడి లోహాలు,
6 ౬ నీలం, ఊదా, ఎర్రరంగు నూలు, సన్నని నార, మేక వెంట్రుకలు, ఎర్ర రంగు వేసిన పొట్టేళ్ల తోళ్లు, డాల్ఫిన్ తోళ్లు, తుమ్మకర్ర,
7 ౭ దీపాలు వెలిగించడానికి నూనె,
8 ౮ అభిషేక తైలం, పరిమళ ద్రవ్య ధూపం వేయడానికి సుగంధ ద్రవ్యాలు,
9 ౯ ఏఫోదు కోసం, వక్షపతకం కోసం లేత పచ్చలు, చెక్కిన రత్నాలు తీసుకురావాలి.
10 ౧౦ ఇంకా, నైపుణ్యం, జ్ఞానం ఉన్నవాళ్ళు వచ్చి యెహోవా ఆజ్ఞాపించినట్టు ఈ పనులు చేయాలి.
11 ౧౧ ఆ పనులేవంటే, ఆయన నివాసం, నివాస మందిరం ఉండే గుడారం, దాని పైకప్పు, కొలుకులు, పలకలు, అడ్డ కర్రలు, స్తంభాలు, దిమ్మలు.
12 ౧౨ మందసం పెట్టె, దాన్ని మోసే కర్రలు, కరుణా పీఠం మూత, దాన్ని మూసి ఉంచే తెర,
13 ౧౩ సన్నిధి బల్ల, దాన్ని మోసే కర్రలు, దానిలోని సామగ్రి, సన్నిధి రొట్టెలు,
14 ౧౪ వెలుగు కోసం దీప స్థంభం, దాని సామగ్రి, దానిలో ఉండాల్సిన దీపాలు, దీపాలకు నూనె.
15 ౧౫ ధూపవేదిక, దాన్ని మోసే కర్రలు, అభిషేక తైలం, పరిమళ ద్రవ్య ధూపం వేయడానికి సుగంధ ద్రవ్యాలు, మందిరం ద్వారానికి తెర.
16 ౧౬ బలులు అర్పించే దహన బలిపీఠం, దానికి ఉండే ఇత్తడి జల్లెడ, దాన్ని మోసే కర్రలు, దాని సామగ్రి, గంగాళం, దాని పీట.
17 ౧౭ ఆవరణపు తెరలు, దాని స్తంభాలు, వాటి దిమ్మలు, ప్రవేశ ద్వారానికి తెర.
18 ౧౮ నివాస మందిరం కోసం, ఆవరణ కోసం మేకులు, వాటికి తాళ్లు.
19 ౧౯ పవిత్ర స్థలం లో సేవ చేయడానికి నేసిన వస్త్రాలు, అంటే, యాజకుడుగా సేవ చెయ్యడానికి అహరోనుకు, అతని కొడుకులకూ పవిత్ర వస్త్రాలు అనేవి.”
20 ౨౦ ఇశ్రాయేలు ప్రజల సమూహమంతా మోషే ఎదుట నుండి వెళ్ళిపోయారు.
21 ౨౧ తరువాత ఎవరి హృదయం వాళ్ళను ప్రేరేపించినట్టు వాళ్ళంతా సన్నిధి గుడారం కోసం, దానిలోని సేవ అంతటికోసం, పవిత్ర వస్త్రాల కోసం అర్పణలు తెచ్చి యెహోవాకు సమర్పించారు.
22 ౨౨ తమ హృదయాల్లో ప్రేరణ పొందిన స్త్రీలు, పురుషులు యెహోవాకు బంగారం సమర్పించిన ప్రతి ఒక్కరూ పైట పిన్నులు, పోగులు, ఉంగరాలు, కంకణాలు, వివిధ రకాల బంగారం వస్తువులు తీసుకువచ్చారు.
23 ౨౩ ఇంకా, నీలం, ఊదా, ఎర్ర రంగు దారాలు, సన్నని నార, మేక వెంట్రుకలు, ఎర్ర రంగు వేసిన పొట్టేళ్ల తోళ్లు, డాల్ఫిన్ తోళ్లు వీటిలో ఏవేవి ఎవరి దగ్గర ఉంటే వాళ్ళు తీసుకువచ్చారు.
24 ౨౪ వెండి, ఇత్తడి సమర్పించిన ప్రతి ఒక్కరూ యెహోవాకు కానుకలు తెచ్చారు. సేవలో ఏ పని కోసమైనా ఉపయోగపడే తుమ్మకర్ర ఎవరి దగ్గర ఉన్నదో వాళ్ళు దాన్ని తెచ్చారు.
25 ౨౫ నైపుణ్యం గల స్త్రీలు తమ చేతులతో వడికిన నీలం, ఊదా, ఎర్ర రంగు దారాలు, సన్నని నార, నూలు తీసుకు వచ్చారు.
26 ౨౬ నేర్పు గల స్త్రీలు తమ జ్ఞానహృదయంతో ప్రేరణ పొంది మేక వెంట్రుకలు వడికారు.
27 ౨౭ నాయకులు ఏఫోదు కోసం, వక్షపతకం కోసం లేత పచ్చలు, వెలగల రాళ్ళూ రత్నాలు,
28 ౨౮ అభిషేక తైలం, పరిమళ ద్రవ్య ధూపం వేయడానికి సుగంధ ద్రవ్యాలు తీసుకువచ్చారు.
29 ౨౯ మోషేను చెయ్యమని యెహోవా ఆజ్ఞాపించిన పనులన్నిటి కోసం ఇశ్రాయేలు ప్రజల్లో తమ మనస్సులలో నిర్ణయించుకున్న పురుషులు, స్త్రీలు తమ ప్రేరణను బట్టి వాళ్ళంతా తమ ఇష్టపూర్వకంగా యెహోవాకు కానుకలు అర్పించారు.
30 ౩౦ మోషే ఇశ్రాయేలు ప్రజలతో ఇలా చెప్పాడు,
31 ౩౧ “వినండి, ఊరు కొడుకు, హూరు మనుమడు బెసలేలును యెహోవా ప్రత్యేకంగా పిలుచుకున్నాడు. అతడు బంగారంతో, వెండితో, ఇత్తడితో వివిధ రకాల ఆకృతులు నైపుణ్యంగా తయారు చేయగల నేర్పరి.
32 ౩౨ రత్నాలు సానబెట్టి పొదగడంలో, చెక్కలను కోసి నునుపు చేయడంలో నిపుణుడు.
33 ౩౩ అతనికి ఆయన అన్ని రకాల పనులు చెయ్యడానికి తెలివితేటలు, జ్ఞానం, నైపుణ్యం ప్రసాదించాడు. అతణ్ణి దేవుడు తన ఆత్మతో నింపాడు.
34 ౩౪ అతడు, దాను గోత్రానికి చెందిన అహీసామాకు కొడుకు అహోలీయాబు ఇతరులకు ఈ పనులు నేర్పించడానికి సామర్ధ్యం కలిగినవాళ్ళు.
35 ౩౫ వాళ్ళు ఆ విధమైన ఎలాంటి పని అయినా చేయడానికి దేవుడు వాళ్ళకు సామర్ధ్యం ఇచ్చాడు. చెక్కేవాళ్ళ పనిగానీ, చిత్రకారుల పనిగానీ నీలం ఊదా ఎర్ర రంగు సన్నని నార దారాలతో బుటాపని గానీ, నేతపని గానీ వాళ్లకు బాగా తెలుసు. వాళ్ళు అలాంటి పనులు చెయ్యగలరు, చేయించగలరు.”