< సమూయేలు~ రెండవ~ గ్రంథము 18 >
1 ౧ దావీదు తన దగ్గర ఉన్న మనుషులను లెక్కించాడు. వారిలో వెయ్యిమందిని, వందమందిని విభజించి వారిని మూడు భాగాలుగా చేశాడు.
2 ౨ ఒక భాగానికి యోవాబుకు, ఒక భాగాన్ని సెరూయా కుమారుడు, యోవాబు సోదరుడు అబీషైకు, మరో భాగాన్ని గిత్తీయుడు ఇత్తయికు నాయకత్వ బాధ్యతలు అప్పగించాడు. తరువాత దావీదు “నేను మీతోకూడా కలసి బయలుదేరుతున్నాను” అని వారితో చెప్పాడు.
3 ౩ అందుకు వారు “నువ్వు మాతో రాకూడదు. మేము పారిపోయినా ప్రజలు దాన్ని పట్టించుకోరు, మాలో సగం మంది చనిపోయినా ఎవ్వరూ పట్టించుకోరు. మాలాంటి పది వేలమందితో నువ్వు ఒక్కడివి సమానం. కాబట్టి నీవు పట్టణంలోనే ఉండి మాకు సూచనలిస్తూ సహాయం చెయ్యి” అని చెప్పారు.
4 ౪ అందుకు రాజు “మీ దృష్టికి ఏది మంచిదో దాన్ని చేస్తాను” అని చెప్పి, గుమ్మం పక్కన నిలబడినప్పుడు ప్రజలంతా గుంపులు గుంపులుగా వందల కొలదిగా, వేల కొలదిగా బయలుదేరారు.
5 ౫ అప్పుడు రాజు యోవాబు, అబీషై, ఇత్తయిలను పిలిచి “నా కోసం యువకుడైన అబ్షాలోము పట్ల దయ చూపించండి” అని ఆజ్ఞాపించాడు. అక్కడున్నవారంతా వింటూ ఉండగానే రాజు అబ్షాలోమును గూర్చి సైన్యాధిపతులకందరికీ ఈ ఆజ్ఞ ఇచ్చాడు.
6 ౬ దావీదు మనుషులు ఇశ్రాయేలు వారితో యుద్ధం చేయడానికి మైదానంలోకి బయలుదేరారు. ఎఫ్రాయిము అడవిలో పోరాటం జరిగింది.
7 ౭ ఇశ్రాయేలు వారు దావీదు సైనికుల ముందు నిలబడలేక ఓడిపోయారు. ఆ రోజున ఇరవై వేలమందిని అక్కడ చంపేశారు.
8 ౮ ఆ ప్రాంతమంతా యుద్ధం వ్యాపించింది. ఆ రోజున కత్తి వాత చనిపోయిన వారికంటే ఎక్కువమంది అడవిలో చిక్కుకుని నాశనమయ్యారు.
9 ౯ అబ్షాలోము కంచరగాడిద ఎక్కి వస్తూ దావీదు సేవకులకు ఎదురు పడ్డాడు. ఆ కంచరగాడిద ఒక బాగా గుబురుగా ఉన్న పెద్ద సింధూర వృక్షం కొమ్మల కిందనుండి వెళ్తున్నప్పుడు అబ్షాలోము తల చెట్టుకు తగులుకుంది. అతడు పైకి ఎత్తబడి ఆకాశానికి భూమికి మధ్యలో వేలాడుతున్నాడు. అతని కింద ఉన్న కంచర గాడిద ముందుకు వెళ్ళిపోయింది.
10 ౧౦ ఒక సైనికుడు అది చూసి, యోవాబు దగ్గర కు వచ్చి “అబ్షాలోము సింధూర వృక్షానికి చిక్కుకుని వేలాడుతూ ఉండడం నేను చూశాను” అని చెప్పాడు.
11 ౧౧ అప్పుడు యోవాబు ఆ వార్త తెచ్చినవాడితో “నువ్వు చూశావు గదా, నేలమీద పడేలా అతణ్ణి ఎందుకు కొట్టలేదు? నువ్వు గనక అతణ్ణి చంపి ఉంటే పది తులాల వెండి, ఒక నడికట్టు నీకు ఇచ్చి ఉండేవాణ్ణి” అన్నాడు.
12 ౧౨ అప్పుడు వాడు “యువకుడైన అబ్షాలోమును ఎవ్వరూ తాకకుండా జాగ్రత్తపడమని రాజు నీకూ, అబీషైకీ, ఇత్తయికీ ఆజ్ఞ ఇస్తున్నప్పుడు నేను విన్నాను. వెయ్యి తులాల వెండి నా చేతిలో పెట్టినా రాజు కొడుకుని నేను చంపను.
13 ౧౩ మోసం చేసి అతని ప్రాణానికి హాని తలపెడితే ఆ సంగతి రాజుకు తెలియకుండా ఉండదు. రాజు సమక్షంలో నువ్వే నాకు విరోధివౌతావు” అని యోవాబుతో అన్నాడు.
14 ౧౪ యోవాబు “నువ్వు చంపకపోతే నేను చూస్తూ ఊరుకుంటానా?” అని చెప్పి, మూడు బాణాలు చేతిలోకి తీసుకుని వెళ్లి సింధూర వృక్షానికి వ్రేలాడుతూ ఇంకా ప్రాణంతో ఉన్న అబ్షాలోము గుండెకు గురి చూసి కొట్టాడు.
15 ౧౫ యోవాబు ఆయుధాలు మోసేవారు పదిమంది చుట్టుముట్టి అబ్షాలోమును కొట్టి చంపారు.
16 ౧౬ అప్పుడు ఇశ్రాయేలీయులను తరమడం ఇక ఆపమని యోవాబు బాకా ఊదించాడు. దావీదు సైనికులు తిరిగి వచ్చారు.
17 ౧౭ ప్రజలు అబ్షాలోము మృతదేహాన్ని ఎత్తి అడవిలో ఉన్న పెద్ద గోతిలో పడవేశారు. పెద్ద రాళ్లకుప్పను దానిమీద పేర్చిన తరువాత ఇశ్రాయేలీయులంతా తమ తమ ఇళ్ళకు పారిపోయారు.
18 ౧౮ అబ్షాలోము జీవించి ఉన్నప్పుడు తన పేరు నిలబెట్టడానికి తనకు కొడుకులు లేరు గనక అతడు బ్రదికి ఉన్నప్పుడే ఒక స్తంభం తెచ్చి దాన్ని తన పేరట నిలబెట్టి ఆ స్తంభానికి అతని పేరు పెట్టాడు. ఇప్పటికీ అది అబ్షాలోము స్తంభం అని పిలువబడుతూ ఉంది.
19 ౧౯ సాదోకు కొడుకు అహిమయస్సు “నేను పరుగెత్తుకుంటూ వెళ్ళి యెహోవా తన శత్రువులను ఓడించి రాజుకు న్యాయం చేకూర్చాడన్న సమాచారం రాజుతో చెబుతాను” అన్నాడు.
20 ౨౦ యోవాబు “ఈ రోజున ఈ కబురు చెప్పకూడదు. మరో రోజు చెప్పవచ్చు. ఎందుకంటే రాజు కుమారుడు చనిపోయాడు కనుక నేడు ఈ కబురు రాజుకు చెప్పడం భావ్యం కాదు” అని అతనితో చెప్పాడు.
21 ౨౧ తరువాత కూషువాడిని పిలిచి “నువ్వు వెళ్లి నువ్వు చూసినదంతా రాజుకు తెలియజెయ్యి” అని చెప్పాడు. అప్పుడు కూషువాడు యోవాబుకు నమస్కారం చేసి పరుగెత్తుకుంటూ వెళ్ళాడు.
22 ౨౨ సాదోకు కొడుకు అహిమయస్సు “కూషువాడితో నేను కూడా పరుగెత్తుకుంటూ వెళ్ళడానికి నాకు అనుమతి ఇవ్వు” అని అడిగాడు. యోవాబు “కుమారా, నువ్వెందుకు వెళ్ళాలి? నీకు బహుమానం వచ్చే ప్రత్యేకమైన సమాచారం ఏదీ లేదుకదా” అని అతనితో అన్నాడు.
23 ౨౩ అప్పుడు అతడు “ఏమైనా సరే, నేను పరుగెత్తి వెళ్తాను” అన్నాడు. అందుకు యోవాబు “సరే వెళ్ళు” అని చెప్పాడు. అహిమయస్సు మైదానపు దారిలో పరుగెత్తుకుంటూ కూషీవాడి కంటే ముందుగా చేరుకున్నాడు.
24 ౨౪ దావీదు రెండు గుమ్మాల మధ్య వరండాలో కూర్చుని ఉన్నాడు. కాపలా కాసేవాడు గుమ్మంపైనున్న గోడమీదికి ఎక్కి చూసినప్పుడు ఒంటరిగా పరుగెత్తుకుంటూ వస్తున్న ఒకడు కనబడ్డాడు. కాపలా కాసేవాడు గట్టిగా అరుస్తూ రాజుకు ఈ సంగతి చెప్పాడు.
25 ౨౫ రాజు “వాడు ఒంటరిగా వస్తున్నట్టైతే ఏదో కబురు తెస్తున్నాడు” అన్నాడు. వాడు పరుగెత్తుకొంటూ దగ్గరికి వచ్చాడు.
26 ౨౬ కాపలా కాసేవాడికి పరుగెత్తుకుంటూ వస్తున్న మరొకడు కనబడ్డాడు. వాడు “అదిగో మరొకడు ఒంటరిగా పరుగెత్తుకొంటూ వస్తున్నాడు” అని గుమ్మం వైపు తిరిగి రాజుతో చెప్పాడు. రాజు “వాడు కూడా ఏదో కబురు తెస్తున్నాడు” అన్నాడు.
27 ౨౭ కాపలా కాసేవాడు దగ్గరికి వస్తున్న మొదటివాణ్ణి చూసి “వాడు సాదోకు కొడుకు అహిమయస్సు అని నాకు అనిపిస్తుంది” అన్నాడు. అప్పుడు రాజు “వాడు మంచివాడు, మంచివార్తే తెచ్చి ఉంటాడు” అన్నాడు.
28 ౨౮ అంతలో అహిమయస్సు “రాజా, జయహో” అని గట్టిగా రాజుతో చెప్పి, రాజు ముందు సాష్టాంగపడి నమస్కారం చేసి “నా యేలిన వాడవైన రాజా, నిన్ను చంపాలని చూసిన వారిని అప్పగించిన నీ దేవుడైన యెహోవాకు స్తోత్రం” అన్నాడు.
29 ౨౯ అప్పుడు రాజు “బాలుడు అబ్షాలోము క్షేమంగా ఉన్నాడా?” అని అడిగాడు. అహిమయస్సు “నీ దాసుడనైన నన్ను యోవాబు పంపుతున్నప్పుడు ఏదో గందరగోళం జరుగుతూ ఉండడం చూసాను గానీ అది ఏమిటో నాకు తెలియదు” అని చెప్పాడు.
30 ౩౦ అప్పుడు రాజు “నువ్వు అవతలికి వెళ్లి నిలబడు” అని ఆజ్ఞ ఇచ్చాడు. వాడు పక్కకు జరిగి నిలబడ్డాడు.
31 ౩౧ అంతలో కూషీవాడు వచ్చి “మా ఏలికవైన రాజా, నేను నీకు మంచి సమాచారం తెచ్చాను. ఈ రోజు యెహోవా నీ మీదికి దండెత్తిన వారందరినీ ఓడించి నీకు న్యాయం చేకూర్చాడు” అని చెప్పినప్పుడు
32 ౩౨ రాజు “బాలుడు అబ్షాలోము క్షేమంగా ఉన్నాడా?” అని అడిగాడు. అప్పుడు కూషీవాడు “మా ఏలినవాడవు, రాజువు అయిన నీకు కీడు చేయాలని నీ మీదకు దండెత్తినవాళ్ళందరికీ ఏమి జరిగిందో ఆ బాలుడికి కూడా అదే జరిగింది” అన్నాడు.
33 ౩౩ అప్పుడు రాజు తీవ్రంగా పరితాపం చెందాడు. పట్టణం గుమ్మానికి పైన ఉన్న గదికి వెళ్లి, ఏడుస్తూ అటూ ఇటూ తిరుగుతూ “అబ్షాలోమా, నా బిడ్డా, అబ్షాలోమా” అని కేకలు వేస్తూ “అయ్యో నా బిడ్డా, నీ బదులు నేను చనిపోయినా బాగుండేది. నా బిడ్డా, అబ్షాలోమా, నా బిడ్డా” అని విలపిస్తూ ఉన్నాడు.