< దినవృత్తాంతములు~ రెండవ~ గ్రంథము 9 >
1 ౧ షేబ రాణి సొలొమోను గొప్పతనం గూర్చి విని క్లిష్టమైన ప్రశ్నలతో అతనిని పరీక్షించాలని, గొప్ప పరివారంతో, సుగంధ ద్రవ్యాలు, విస్తారమైన బంగారం, ప్రశస్తమైన రత్నాలు ఒంటెల మీద ఎక్కించుకుని యెరూషలేముకు వచ్చింది. ఆమె సొలొమోను దగ్గరికి వచ్చి తన మనస్సులోని విషయాలన్నిటి గురించి అతనితో మాటలాడింది.
2 ౨ సొలొమోను ఆమె ప్రశ్నలన్నిటినీ ఆమెకు విడమర్చి చెప్పాడు. అతడు ఆమెకు జవాబు చెప్పలేని గూఢమైన మాట ఏదీ లేకపోయింది.
3 ౩ షేబ రాణి సొలొమోను జ్ఞానాన్నీ అతడు కట్టించిన నగరాన్నీ
4 ౪ అతని భోజనపు బల్ల మీది పదార్ధాలు, అతని అధిపతులు కూర్చుండడం, అతని సేవకులు కనిపెట్టడం, వారి వస్త్రాలు, అతనికి గిన్నెలందించేవారు, వారి వస్త్రాలు, యెహోవా మందిరంలో అతడు అర్పించే దహన బలులు, వీటన్నిటినీ చూసినప్పుడు, ఆమె ఎంతో విస్మయానికి గురైంది.
5 ౫ ఆమె రాజుతో “నీ పనులను గురించీ, నీ జ్ఞానం గురించీ నేను నా దేశంలో విన్న సమాచారం నిజమైనదే గాని, నేను వచ్చి నా కళ్ళారా చూసేటంత వరకూ వారి మాటలు నమ్మలేదు.
6 ౬ నీ గొప్ప జ్ఞానం గూర్చి సగమైనా వారు నాకు చెప్పలేదు. నిన్ను గూర్చి నేను విన్నదాని కంటే నీ కీర్తి ఎంతో ఎక్కువగా ఉంది.
7 ౭ నీ సేవకులెంత భాగ్యవంతులు! ఎల్లకాలం నీ సన్నిధిలో ఉండి నీ జ్ఞాన సంభాషణ వింటూ ఉండే నీ సేవకులు ఎంత ధన్యులు.
8 ౮ నీ దేవుడైన యెహోవా సన్నిధిలో రాజుగా ఆయన సింహాసనం మీద ఆసీనుడయ్యే విధంగా నీ పైన అనుగ్రహం చూపినందుకు నీ దేవుడైన యెహోవాకు స్తోత్రాలు కలుగు గాక. ఇశ్రాయేలీయులను నిత్యమూ స్థిరపరచాలన్న దయగల ఆలోచన నీ దేవునికి కలగడం వల్లనే నీతిన్యాయాలు జరిగించడానికి ఆయన నిన్ను వారిమీద రాజుగా నియమించాడు” అని చెప్పింది.
9 ౯ ఆమె రాజుకు 4,000 కిలోగ్రాముల బంగారాన్ని, విస్తారమైన సుగంధ ద్రవ్యాలనూ రత్నాలనూ ఇచ్చింది. షేబదేశపు రాణి సొలొమోను రాజుకి ఇచ్చిన సుగంధ ద్రవ్యాలతో మరేదీ సాటి రాదు.
10 ౧౦ అంతే కాక, ఓఫీరు నుండి బంగారం తెచ్చిన హీరాము పనివారూ సొలొమోను పనివారూ అక్కడి నుంచి గంధం మానులు, ప్రశస్తమైన రత్నాలు కూడా తెచ్చారు.
11 ౧౧ ఆ గంధం కొయ్యలతో రాజు యెహోవా మందిరానికి, రాజనగరానికి మెట్లూ, గాయకులకి తంబురలూ సితారాలూ చేయించాడు. అటువంటి చెక్కడపు పని అంతకు ముందు యూదా దేశంలో ఎవ్వరూ చూడలేదు.
12 ౧౨ షేబ దేశపు రాణి రాజుకు తీసుకు వచ్చిన వాటికి అతడిచ్చిన ప్రతి బహుమానాలు కాక ఆమె ఇష్టపడి అడిగిన వాటన్నిటినీ సొలొమోను ఆమెకిచ్చాడు. ఆ తరువాత ఆమె తన సేవకులతో తన దేశానికి తిరిగి వెళ్లిపోయింది.
13 ౧౩ సుగంధ ద్రవ్యాలు అమ్మే వర్తకులు, ఇతర వర్తకులు తీసుకొచ్చే బంగారం కాక సొలొమోనుకు ప్రతి సంవత్సరం వచ్చే బంగారం బరువు 23 వేల కిలోలు.
14 ౧౪ అరబ్బు దేశపు రాజులు, దేశాధిపతులు కూడా సొలొమోను దగ్గరికి బంగారం, వెండి తీసుకు వచ్చారు.
15 ౧౫ సొలొమోను రాజు బంగారాన్ని సాగగొట్టి 200 డాళ్ళు చేయించాడు. ఒక్కొక్క డాలుకు ఆరు కిలోగ్రాముల బంగారం పట్టింది.
16 ౧౬ సాగగొట్టిన బంగారంతో 300 కవచాలు చేయించాడు. ఒక్కొక్క కవచానికి మూడు కిలోగ్రాముల బంగారం పట్టింది. వాటిని రాజు లెబానోను అరణ్యంలో ఉన్న తన అంతఃపురంలో ఉంచాడు.
17 ౧౭ సొలొమోను రాజు దంతంతో ఒక గొప్ప సింహాసనం చేయించి మేలిమి బంగారంతో దాన్ని పొదిగించాడు.
18 ౧౮ ఆ సింహాసనానికి ఆరు బంగారు మెట్లు ఉన్నాయి. సింహాసనానికి బంగారు పాదపీఠం కట్టి ఉంది. కూర్చునే చోటికి రెండు వైపులా చేతి ఊతలున్నాయి. ఊతల దగ్గర రెండు సింహాలున్నాయి.
19 ౧౯ ఆ ఆరు మెట్ల మీద రెండు వైపులా 12 సింహాల ఆకారాలు నిలబడి ఉన్నాయి. మరి ఏ రాజ్యంలోనూ అలాటి పని ఎవరూ చేసి ఉండలేదు.
20 ౨౦ సొలొమోను రాజుకున్న పానపాత్రలన్నీ బంగారంతో చేసినవే. లెబానోను అరణ్యం అంతఃపురంలో ఉన్న వస్తువులన్నీ కూడా బంగారంతో చేశారు. హీరాము పంపిన పనివారితో కలిసి రాజు ఓడలు తర్షీషుకు పోయి మూడు సంవత్సరాలకు ఒకసారి బంగారం, వెండి, ఏనుగు దంతం, కోతులు, నెమళ్ళు మొదలైన సరకులతో వచ్చేవి.
21 ౨౧ సొలొమోను కాలంలో వెండి అసలు లెక్కకు రాలేదు.
22 ౨౨ సొలొమోను రాజు భూమి పైన రాజులందరికంటే ఐశ్వర్యంలో, జ్ఞానంలో అధికుడయ్యాడు.
23 ౨౩ దేవుడు సొలొమోను హృదయంలో ఉంచిన జ్ఞానోక్తులు వినడానికి భూరాజులంతా అతనిని దర్శించాలని కోరేవారు.
24 ౨౪ ఒక్కొక్కరూ ప్రతి సంవత్సరం వెండి, బంగారు వస్తువులు, వస్త్రాలు, ఆయుధాలు, సుగంధద్రవ్యాలు, గుర్రాలు, కంచర గాడిదలు కానుకలుగా తీసుకు వచ్చారు.
25 ౨౫ సొలొమోనుకు రథాలు నిలిపి ఉంచే పట్టణాల్లో, తన దగ్గర, యెరూషలేములో, గుర్రాలకు, రథాలకు 4,000 శాలలు ఉండేవి. 12,000 గుర్రపు రౌతులు ఉండేవారు.
26 ౨౬ యూఫ్రటిసు నది మొదలుకుని ఫిలిష్తీయుల దేశం వరకూ, ఐగుప్తు సరిహద్దు వరకూ ఉన్న రాజులందరిపై అతడు పరిపాలన చేశాడు.
27 ౨౭ సొలొమోను యెరూషలేములో వెండిని రాళ్లంత విస్తారంగా, దేవదారు మ్రానులను షెఫేలా ప్రదేశంలో ఉన్న మేడివృక్షాలంత విస్తారంగా ఉండేలా చేశాడు.
28 ౨౮ ఐగుప్తు నుండీ ఇతర అన్ని దేశాల నుండీ సొలొమోనుకు గుర్రాలు సరఫరా అవుతూ ఉండేవి.
29 ౨౯ సొలొమోను చేసిన కార్యాలన్నిటి గూర్చి నాతాను ప్రవక్త రాసిన గ్రంథంలో, షిలోనీయుడైన అహీయా రచించిన ప్రవచన గ్రంథంలో, నెబాతు కొడుకు యరొబాము గూర్చి దీర్ఘదర్శి ఇద్దో గ్రంథంలో రాసి ఉంది.
30 ౩౦ సొలొమోను యెరూషలేములో ఇశ్రాయేలీయులందరి మీద 40 సంవత్సరాలు పరిపాలించాడు.
31 ౩౧ ఆ తరవాత సొలొమోను తన పూర్వీకులతో కన్నుమూశాడు. అతనిని అతని తండ్రి అయిన దావీదు పట్టణంలో పాతిపెట్టారు. అతనికి బదులుగా అతని కొడుకు రెహబాము రాజయ్యాడు.