< సమూయేలు~ మొదటి~ గ్రంథము 13 >
1 ౧ సౌలు రాజుగా పాలించడం ఆరంభించినపుడు అతని వయస్సు ముప్ఫై ఏళ్ళు. అతడు రెండేళ్ళు ఇశ్రాయేలీయులను పాలించిన తరువాత
2 ౨ ఇశ్రాయేలీయుల్లో మూడు వేలమందిని ఏర్పరచుకున్నాడు. వీరిలో రెండు వేలమంది మిక్మషు ప్రాంతంలోని బేతేలు కొండలో సౌలు దగ్గర ఉండగా, వెయ్యిమంది బెన్యామీనీయుల ఊరు గిబియాలో యోనాతాను దగ్గర ఉన్నారు. మిగిలిన వారిని అతడు తమ తమ గుడారాలకు పంపివేశాడు.
3 ౩ యోనాతాను గెబాలో ఉన్న ఫిలిష్తీయుల గుంపును సంహరించినపుడు ఆ విషయం ఫిలిష్తీయులకు తెలిసింది. దేశంలోని హెబ్రీయులంతా ఈ వార్త వినాలని సౌలు ప్రచారం చేయించాడు.
4 ౪ సౌలు ఫిలిష్తీయుల గుంపును సంహరించడం వల్ల తమపై ఫిలిష్తీయులు విరోధం పెంచుకొన్నారని ఇశ్రాయేలీయులకు తెలిసినప్పుడు వారంతా గిల్గాలులో సౌలు దగ్గరకి చేరుకున్నారు.
5 ౫ ఫిలిష్తీయులు ఇశ్రాయేలీయులతో యుద్దం చేయడానికి ముప్ఫై వేల రథాలు, ఆరు వేలమంది గుర్రపు రౌతులు, సముద్రం ఒడ్డున ఉండే ఇసుక రేణువులంత విస్తారమైన జనసమూహాన్ని సమకూర్చుకుని బయలుదేరారు. వీరంతా బేతావెను తూర్పుదిక్కున మిక్మషులో దిగారు.
6 ౬ ఇశ్రాయేలీయులు భయపడుతూ తామంతా ప్రాణాపాయంలో పడిపోయినట్టు గ్రహించి కొండ గుహల్లో, పొదల్లో, బండసందుల్లో, ఉన్నత స్థలాల్లో, సొరంగాల్లో దాక్కున్నారు.
7 ౭ కొందరు హెబ్రీయులు యొర్దాను నది దాటి గాదు దేశానికి, గిలాదుకు వెళ్ళిపోయారు. అయితే సౌలు ఇంకా గిల్గాలులోనే ఉన్నాడు. ప్రజలంతా భయపడుతూనే అతణ్ణి అనుసరించారు.
8 ౮ సమూయేలు చెప్పినట్టు అతడు వారం రోజులు వేచి ఉండి, సమూయేలు ఇంకా గిల్గాలుకు రాకపోవడం, ప్రజలు తన నుండి చెదరిపోవడం చూసి
9 ౯ హోమ బలిని, శాంతి బలిని నా దగ్గరికి తీసుకు రమ్మని చెప్పి హోమబలి అర్పించాడు.
10 ౧౦ అతడు హోమబలి అర్పించడం ముగియగానే సమూయేలు అక్కడికి వచ్చాడు. సౌలు అతణ్ణి చూసి అతనికి వందనాలు చెబుతూ ఎదురు వెళ్ళాడు.
11 ౧౧ సమూయేలు అతణ్ణి చూసి “నువ్వు చేసిన పని ఏమిటి?” అని అన్నాడు. అందుకు సౌలు “ప్రజలు నానుండి చెదరిపోవడం, అనుకున్న సమయానికి నువ్వు రాకపోవడం, ఫిలిష్తీయులు మిక్మషులో సమకూడడం నేను గమనించి
12 ౧౨ ఇక యెహోవాకు శాంతి బలి అర్పించక ముందే ఫిలిష్తీయులు గిల్గాలుకు వచ్చి నాపై దాడి చేస్తారనుకుని నా అంతట నేనే తెగించి హోమబలి అర్పించాను” అన్నాడు.
13 ౧౩ అప్పుడు సమూయేలు ఇలా చెప్పాడు. “నీ దేవుడైన యెహోవా నీకు ఇచ్చిన ఆజ్ఞ గైకొనకుండా నీవు అవివేకంగా ప్రవర్తించావు. ఇశ్రాయేలీయులపై నీ రాజ్యాధికారాన్ని కలకాలం స్థిరంగా ఉంచాలని యెహోవా తలచాడు. అయితే నీ అధికారం నిలబడదు.
14 ౧౪ యెహోవా తన హృదయానుసారియైన ఒకణ్ణి కనుగొన్నాడు. నీకు ఆజ్ఞాపించినట్టు నువ్వు చెయ్యలేకపోయావు కాబట్టి యెహోవా తన ప్రజలపై అతణ్ణి రాజుగా నియమిస్తాడు.”
15 ౧౫ సమూయేలు లేచి, ప్రయాణమై గిల్గాలు నుండి బెన్యామీనీయుల గోత్రస్థానం గిబియాకు వచ్చాడు. సౌలు తన దగ్గర సమకూడిన ప్రజలను లెక్కపెట్టినపుడు వారు సుమారు ఆరు వందలమంది ఉన్నారు.
16 ౧౬ సౌలు, అతని కుమారుడు యోనాతాను, తమ దగ్గర ఉన్న వారితో కలసి బెన్యామీనీయుల గిబియాకు చేరుకున్నారు. ఫిలిష్తీయులు మిక్మషులో దిగారు.
17 ౧౭ ఫిలిష్తీయుల దండు నుండి దోచుకొనేవారు మూడు గుంపులుగా బయలుదేరారు. ఒక గుంపు షూయాలు దేశానికి ఒఫ్రావైపుగా వెళ్లే దారిలో కాపు కాశారు.
18 ౧౮ రెండవ గుంపు బేత్ హోరోనుకు వెళ్లే దారిలో, మూడవ గుంపు అరణ్యం దగ్గరలోని జెబోయిము లోయ సరిహద్దు దారిలో కాపుకాశారు.
19 ౧౯ హెబ్రీయులు తమ కోసం కత్తులు, ఈటెలు తయారు చేయించుకొంటారేమోనని ఫిలిష్తీయులు ఇశ్రాయేలీయుల దేశమంతటిలో కమ్మరివాళ్ళు ఎవరూ ఉండకుండాా చేశారు.
20 ౨౦ కాబట్టి ఇశ్రాయేలీయులంతా తమ నాగటి కర్రలు, పారలు, గొడ్డళ్ళు, కొడవళ్ళు పదును పెట్టుకోవడానికి ఫిలిష్తీయుల దగ్గరికి వెళ్ళాల్సి వచ్చేది.
21 ౨౧ నాగటి కర్రలకు, పారలకు, మూడు ముళ్ళు ఉండే కొంకీలకు, గొడ్డళ్ళకు పదును పెట్టడానికి ఆకురాయి మాత్రమే వారి దగ్గర ఉంది.
22 ౨౨ అందువల్ల యుద్ధం జరిగే సమయంలో సౌలు, యోనాతానుల దగ్గరున్న వారిలో ఒక్కరి చేతిలో కూడా ఒక కత్తిగానీ, యీటెగానీ లేకుండా పోయింది. సౌలు దగ్గర, అతని కుమారుడు యోనాతాను దగ్గర మాత్రమే అవి ఉన్నాయి.
23 ౨౩ ఫిలిష్తీయుల సైన్యపు కాపలాదారులు కొందరు మిక్మషు కనుమకు వెళ్ళి అక్కడ ఉన్నారు.