< రాజులు~ మొదటి~ గ్రంథము 6 >
1 ౧ ఇశ్రాయేలీయులు ఐగుప్తు దేశం నుండి బయలుదేరి వచ్చిన 480 వ సంవత్సరంలో, అంటే సొలొమోను పాలనలో నాలుగో సంవత్సరం, జీప్ అనే రెండో నెలలో అతడు యెహోవా మందిర నిర్మాణం ప్రారంభించాడు.
2 ౨ సొలొమోను రాజు యెహోవాకు కట్టించిన మందిరం పొడవు 60 మూరలు, వెడల్పు 20 మూరలు, ఎత్తు 30 మూరలు.
3 ౩ పరిశుద్ధ స్థలం ఎదుట ఉన్న ముఖమంటపం పొడవు మందిరం వెడల్పుతో సమానంగా 20 మూరలు. మందిరం ఎదుట ఆ మంటపం వెడల్పు 10 మూరలు.
4 ౪ అతడు మందిరానికి నగిషీ పని చేసిన అల్లిక కిటికీలు చేయించాడు.
5 ౫ మందిరం గోడ చుట్టూ గదులు కట్టించాడు. మందిరం గోడలకు పరిశుద్ధ స్థలం బయటి గోడల వరకూ ఆ గదులు గర్భాలయానికి చుట్టూ నాలుగు వైపులా అతడు కట్టించాడు.
6 ౬ కింది అంతస్తు గది 5 మూరల వెడల్పు, మధ్య అంతస్తు గది 6 మూరల వెడల్పు, మూడవ అంతస్తు గది 7 మూరల వెడల్పు. ఎలా అంటే దూలాలు మందిరం గోడ లోపల ఆనకుండా మందిరం గోడ చుట్టూ బయటి వైపున చిమ్ము రాళ్లు ఉంచారు.
7 ౭ అయితే మందిరం కట్టే సమయంలో ముందుగా సిద్ధపరచి తెచ్చిన రాళ్లతో కట్టారు. మందిరం కట్టే స్థలం లో సుత్తె, గొడ్డలి మొదలైన ఇనప పనిముట్ల శబ్దం ఎంత మాత్రం వినబడలేదు.
8 ౮ మందిరం కుడి పక్కన మధ్య అంతస్తుకు తలుపు ఉంది. మధ్య అంతస్తు గదికీ మధ్య అంతస్తు గదిలో నుండి మూడవ అంతస్తు గదికీ ఎక్కి వెళ్ళడానికి చుట్టూ మెట్ల చట్రాలున్నాయి.
9 ౯ ఈ విధంగా అతడు మందిర నిర్మాణం ముగించి మందిరాన్ని దేవదారు దూలాలతో, పలకలతో కప్పించాడు.
10 ౧౦ మందిరానికి చుట్టూ గదులు కట్టించాడు. ఇవి ఐదు మూరల ఎత్తు కలిగి దేవదారు దూలాల చేత మందిరంతో గట్టిగా సంధించి ఉన్నాయి.
11 ౧౧ అంతలో యెహోవా వాక్కు సొలొమోనుకు ప్రత్యక్షమై ఇలా చెప్పాడు.
12 ౧౨ “ఈ మందిరాన్ని నీవు కట్టిస్తున్నావు కదా, నీవు నా చట్టాలు, న్యాయవిధులు పాటిస్తూ, నా ఆజ్ఞలన్నిటికీ విధేయత చూపితే నీ తండ్రి దావీదుతో నేను చేసిన వాగ్దానాన్ని నీ విషయంలో స్థిరపరుస్తాను.
13 ౧౩ ఇశ్రాయేలీయులనే నా ప్రజలను విడిచి పెట్టక నేను వారి మధ్య నివాసం చేస్తాను.”
14 ౧౪ ఈ విధంగా సొలొమోను మందిర నిర్మాణాన్ని ముగించాడు.
15 ౧౫ అతడు మందిరం లోపలి గోడలను దేవదారు పలకలతో కట్టించాడు. అడుగు నుండి పైకప్పు వరకూ గోడలను దేవదారు పలకలతో కప్పించాడు. మందిరం నేలను సరళ మాను పలకలతో కప్పించాడు.
16 ౧౬ మందిరం పక్కలను కింది నుండి గోడల పై భాగం వరకూ దేవదారు పలకలతో 20 మూరల ఎత్తు కట్టించాడు. అతడు దాన్ని గర్భాలయం కోసం, అంటే అతి పరిశుద్ధ స్థలం కోసం కట్టించాడు.
17 ౧౭ అయితే దాని ఎదుట ఉన్న పరిశుద్ధ స్థలం పొడవు 40 మూరలు.
18 ౧౮ మందిరం లోపల ఉన్న దేవదారు పలకల మీద గుబ్బలు, వికసించిన పువ్వులు చెక్కి ఉన్నాయి. అంతా దేవదారు కర్ర పనే, రాయి ఒక్కటి కూడా కనిపించ లేదు.
19 ౧౯ యెహోవా నిబంధన మందసాన్ని ఉంచడానికి మందిరం లోపల అతి పరిశుద్ధ స్థలాన్ని సిద్ధపరిచాడు.
20 ౨౦ అతి పరిశుద్ధ స్థలం లోపల 20 మూరల పొడవు, 20 మూరల వెడల్పు, 20 మూరల ఎత్తు ఉంది. దీన్ని మేలిమి బంగారంతో పొదిగించాడు. దేవదారు చెక్కతో చేసిన బలిపీఠాన్ని కూడా ఇదే విధంగా పొదిగించాడు.
21 ౨౧ ఈ విధంగా సొలొమోను మందిరం లోపల అంతా మేలిమి బంగారంతో పొదిగించి అతి పరిశుద్ధ స్థలం ఎదుట బంగారు గొలుసులు ఉన్న తెర చేయించి బంగారంతో దాన్ని పొదిగించాడు.
22 ౨౨ ఏ భాగాన్నీ విడిచి పెట్టకుండా మందిరమంతా బంగారంతో పొదిగించాడు. అతి పరిశుద్ధ స్థలం దగ్గర ఉన్న బలిపీఠాన్ని బంగారంతో పొదిగించాడు.
23 ౨౩ అతడు అతి పరిశుద్ధ స్థలం లో 10 మూరల ఎత్తున్న రెండు కెరూబులను ఒలీవ కర్రతో చేయించాడు.
24 ౨౪ ఒక్కొక్క కెరూబుకు 5 మూరల పొడవైన రెక్కలున్నాయి. ఒక రెక్క చివరి నుండి రెండవ రెక్క చివరి వరకూ 10 మూరలు పొడవు.
25 ౨౫ రెండవ కెరూబు రెక్కలు కూడా 10 మూరలు ఉంది. కెరూబులు రెండింటికీ ఒకే కొలతలు, ఒకే ఆకారం ఉన్నాయి.
26 ౨౬ ఒక కెరూబు 10 మూరల ఎత్తు, రెండవ కెరూబు కూడా అంతే ఎత్తు.
27 ౨౭ అతడు ఈ కెరూబులను గర్భాలయంలో ఉంచాడు. ఆ కెరూబుల రెక్కలు పూర్తిగా విప్పుకుని ఒకదాని రెక్క ఇవతలి గోడకీ, రెండవదాని రెక్క అవతలి గోడకీ అంటుకుని ఉన్నాయి. అతి పరిశుద్ధ స్థలం లో వీటి రెక్కలు ఒకదానితో ఒకటి అంటుకుని ఉన్నాయి.
28 ౨౮ ఈ కెరూబులను అతడు బంగారంతో పొదిగించాడు.
29 ౨౯ మందిరం గోడలన్నిటి మీదా లోపలా బయటా కెరూబు ఆకారాలను, ఖర్జూర చెట్ల ఆకారాలను, వికసించిన పూలను చెక్కించాడు.
30 ౩౦ లోపలి, బయట గదుల్లో మందిరం నేలంతా బంగారంతో పొదిగించాడు.
31 ౩౧ అతి పరిశుద్ధ స్థలం ద్వారానికి ఒలీవకర్రతో తలుపులు చేయించాడు. ద్వారబంధం మీది కమ్మీ, నిలువు కమ్మీల వెడల్పు, గోడ వెడల్పులో ఐదో భాగం ఉన్నాయి.
32 ౩౨ రెండు తలుపులూ ఒలీవ కర్రతో చేసినవి. వాటి మీద కెరూబులు, ఖర్జూర వృక్షాలు, వికసించిన పూవుల ఆకారాలు చెక్కించి వాటిని బంగారంతో పొదిగించాడు. కెరూబుల మీదా ఖర్జూర వృక్షాల మీదా బంగారం పొదిగించాడు.
33 ౩౩ పరిశుద్ధ స్థలం ద్వారానికి ఒలీవ కర్రతో రెండు నిలువు కమ్ములు చేయించాడు. వీటి వెడల్పు గోడ వెడల్పులో నాలుగో వంతు.
34 ౩౪ రెండు తలుపులు దేవదారు కలపతో చేసినవి. ఒక్కొక్క తలుపుకు రెండేసి మడత రెక్కలు ఉన్నాయి.
35 ౩౫ వాటి మీద అతడు కెరూబులనూ ఖర్జూర చెట్లనూ వికసించిన పూవులనూ చెక్కించి వాటి మీద బంగారు రేకు పొదిగించాడు.
36 ౩౬ లోపల ఉన్న పెద్ద గదిని మూడు వరసల చెక్కిన రాళ్లతో, ఒక వరుస దేవదారు దూలాలతో కట్టించాడు.
37 ౩౭ నాలుగో సంవత్సరం జీప్ నెలలో యెహోవా మందిరం పునాది వేశారు.
38 ౩౮ పదకొండవ సంవత్సరం బూలు అనే ఎనిమిదో నెలలో దాని ఏర్పాటు ప్రకారం దాని విభాగాలన్నిటితో మందిరం పూర్తి అయ్యింది. దాన్ని కట్టించడానికి సొలొమోనుకి ఏడు సంవత్సరాలు పట్టింది.