< రాజులు~ మొదటి~ గ్రంథము 19 >
1 ౧ ఏలీయా చేసిందంతా అతడు బయలు ప్రవక్తలందరినీ కత్తితో చంపించిన సంగతీ అహాబు యెజెబెలుకు చెప్పాడు.
2 ౨ యెజెబెలు ఒక వార్తాహరునితో ఏలీయాకు ఈ కబురు పంపింది “రేపు ఈ పాటికి చనిపోయిన ఆ ప్రవక్తల ప్రాణం లాగా నేను నీ ప్రాణాన్ని చేయకపోతే దేవుళ్ళు దాని కంటే ఎక్కువ కీడు నా మీదికి తెస్తారు గాక.”
3 ౩ ఏలీయా ఈ విషయం తెలుసుకుని, లేచి తన ప్రాణం కాపాడుకోడానికి, యూదాలోని బెయేర్షెబాకు వచ్చి, తన సేవకుణ్ణి అక్కడ ఉంచాడు.
4 ౪ అతడు ఒక రోజంతా ఎడారిలోకి ప్రయాణించి ఒక రేగు చెట్టు కింద కూర్చున్నాడు. చచ్చిపోదామని ఆశించాడు. “యెహోవా, ఇంతవరకూ చాలు, చనిపోయిన నా పూర్వీకుల కంటే నేనేమంత గొప్పవాణ్ణి కాదు. నా ప్రాణం తీసుకో” అని ప్రార్థన చేశాడు.
5 ౫ అతడు రేగు చెట్టు కింద పడుకుని నిద్రపోయాడు. ఉన్నట్టుండి ఒక దేవదూత వచ్చి అతన్ని తాకి “నీవు లేచి భోజనం చెయ్యి” అన్నాడు.
6 ౬ ఏలీయా లేచి చూస్తే, అతని తల దగ్గర నిప్పుల మీద కాల్చిన రొట్టె, నీళ్ల సీసా కనిపించాయి. కాబట్టి అతడు భోజనం చేసి మళ్ళీ పడుకున్నాడు.
7 ౭ యెహోవా దూత రెండవసారి మళ్ళీ వచ్చి అతన్ని లేపి “నీవు చాలా దూరం ప్రయాణం చెయ్యాలి, లేచి భోజనం చెయ్యి” అని చెప్పాడు.
8 ౮ అతడు లేచి తిని, తాగి ఆ భోజనం బలంతో నలభై రాత్రింబగళ్లు ప్రయాణించి దేవుని పర్వతమనే పేరున్న హోరేబుకు వచ్చాడు.
9 ౯ అక్కడున్న ఒక గుహలో ఉండిపోయాడు. యెహోవా “ఏలీయా, ఇక్కడ నువ్వేం చేస్తున్నావ్” అని అతనిని అడిగాడు.
10 ౧౦ అతడు “ఇశ్రాయేలు ప్రజలు నీ నిబంధనను వదిలేసి నీ బలిపీఠాలను పడగొట్టి నీ ప్రవక్తలను కత్తితో చంపేశారు. దూతల సైన్యాల నాయకుడు యెహోవా కోసం మహా రోషంతో నేను ఒకణ్ణి మాత్రమే మిగిలాను. వారు నా ప్రాణం కూడా తీయడానికి చూస్తున్నారు” అని జవాబిచ్చాడు.
11 ౧౧ యెహోవా అతనితో “నీవు వెళ్లి పర్వతం మీద నా ఎదుట నిలబడు” అన్నాడు. అప్పుడు యెహోవా అటుగా వెళ్ళగానే ప్రచండమైన గాలి లేచింది. పర్వతాలు బద్దలై బండరాళ్ళు ముక్కలైపోయాయి గాని యెహోవా ఆ గాలిలో లేడు. గాలి వెళ్లిపోయిన తరువాత భూకంపం వచ్చింది గాని ఆ భూకంపంలో యెహోవా లేడు.
12 ౧౨ ఆ భూకంపం వెళ్ళిపోయిన తరువాత అగ్ని జ్వాలలు కన్పించాయి గాని ఆ అగ్నిలో యెహోవా లేడు. అగ్ని ఆగిపోగానే చాలా నెమ్మదిగా మాట్లాడే ఒక స్వరం వినిపించింది.
13 ౧౩ ఏలీయా ఆ స్వరం విని, తన దుప్పటితో ముఖం కప్పుకుని బయలుదేరి గుహ ఎదుట నిలబడ్డాడు. అప్పుడు “ఏలీయా, ఇక్కడ నువ్వేం చేస్తున్నావ్?” అనే మాట వినిపించింది.
14 ౧౪ ఏలీయా “ఇశ్రాయేలు ప్రజలు నీ నిబంధనను వదిలేసి నీ బలిపీఠాలను పడగొట్టి నీ ప్రవక్తలను కత్తితో చంపేశారు. దూతల సైన్యాల నాయకుడు, యెహోవా కోసం మహా రోషంతో నేను ఒకణ్ణి మాత్రమే మిగిలితే, వారు నా ప్రాణం కూడా తీయడానికి చూస్తున్నారు” అని జవాబిచ్చాడు.
15 ౧౫ అప్పుడు యెహోవా అతనితో ఇలా చెప్పాడు. “ఎడారి గుండా నీవు వచ్చిన దారిలో దమస్కు వెళ్ళు. అక్కడ సిరియా దేశం మీద హజాయేలుకు పట్టాభిషేకం చెయ్యి.
16 ౧౬ ఇశ్రాయేలు వారి మీద నింషీ కొడుకు యెహూకు పట్టాభిషేకం చెయ్యి. నీకు బదులు ప్రవక్తగా ఉండడానికి అబేల్మెహోలా వాడు షాపాతు కొడుకు ఎలీషాకు అభిషేకం చెయ్యి.
17 ౧౭ హజాయేలు కత్తిని తప్పించుకొనే వారిని యెహూ చంపేస్తాడు. యెహూ కత్తిని తప్పించుకొనే వారిని ఎలీషా చంపేస్తాడు.
18 ౧౮ అయినా ఇశ్రాయేలు ప్రజల్లో బయలుకు మొక్కకుండా, వాడి విగ్రహాన్ని ముద్దు పెట్టుకోకుండా ఇంకా 7,000 మంది నాకు మిగిలి ఉన్నారు.”
19 ౧౯ ఏలీయా అక్కడ నుండి వెళ్లిన తరువాత అతనికి షాపాతు కొడుకు ఎలీషా కనిపించాడు. అతడు తన దగ్గరున్న పన్నెండు జతల ఎడ్లతో దుక్కి దున్నిస్తూ పన్నెండవ కాడి తానే తోలుతున్నాడు. ఏలీయా అతని దగ్గరికి వెళ్లి తన పైబట్టను అతని మీద వేశాడు.
20 ౨౦ అతడు ఎడ్లను విడిచిపెట్టి ఏలీయా వెంట పరిగెత్తి “నేను వెళ్లి నా తలిదండ్రులను ముద్దు పెట్టుకుని తిరిగి వచ్చి నిన్ను వెంబడిస్తాను” అన్నాడు. ఏలీయా “వెళ్లి రా. నేను నీకేం చేశానో గుర్తు పెట్టుకో” అన్నాడు.
21 ౨౧ ఎలీషా అతన్ని విడిచి వెళ్లి, కాడి ఎడ్లను వధించి వాటి మాంసాన్ని కాడి మానులతో వంట చేసి ప్రజలకు వడ్డించాడు. వారు భోజనం చేసిన తరువాత అతడు లేచి ఏలీయా వెంట వెళ్లి అతనికి సేవకుడయ్యాడు.