< 1 యోహాను 5 >
1 ౧ యేసే క్రీస్తు అని నమ్మినవారంతా దేవుని ద్వారా పుట్టినవాళ్ళే. తండ్రిగా అయిన వాణ్ణి ప్రేమించిన వారంతా ఆయన ద్వారా పుట్టినవాణ్ణి కూడా ప్రేమిస్తారు.
2 ౨ మనం దేవుణ్ణి ప్రేమిస్తూ, ఆయన ఆజ్ఞలను పాటిస్తూ ఉంటే, దేవుని పిల్లలను ప్రేమిస్తున్నామని దాని వల్ల మనకు తెలుసు.
3 ౩ ఆయన ఆజ్ఞలను పాటిస్తే మనం దేవుణ్ణి ప్రేమించినట్టే. ఆయన ఆజ్ఞలు భారం కాదు.
4 ౪ దేవుని ద్వారా పుట్టినవారు అందరూ లోకాన్ని జయిస్తారు. లోకాన్ని జయించింది మన విశ్వాసమే.
5 ౫ లోకాన్ని జయించేది ఎవరు? యేసు దేవుని కుమారుడు అని నమ్మినవాడే!
6 ౬ నీళ్ళ ద్వారా, రక్తం ద్వారా వచ్చినవాడు యేసు క్రీస్తే. ఆయన కేవలం నీటి ద్వారా మాత్రమే కాదు. నీళ్ళ ద్వారా, రక్తం ద్వారా కూడా వచ్చాడు. దేవుడు ఆత్మ రూపి గనక ఆత్మే ఇది సత్యమని సాక్షమిస్తున్నాడు.
7 ౭ సాక్ష్యం ఇచ్చే వారు ముగ్గురున్నారు.
8 ౮ ఆత్మ, నీళ్ళు, రక్తం-ఈ మూడూ ఒకే సాక్ష్యం చెబుతున్నాయి.
9 ౯ మనుషుల సాక్ష్యం మనం స్వీకరిస్తాం. కాని దేవుని సాక్ష్యం అంతకన్నా గొప్పది. దేవుని సాక్ష్యం ఆయన కుమారుణ్ణి గూర్చినదే.
10 ౧౦ దేవుని కుమారుని పట్ల విశ్వాసం ఉంచిన వారిలోనే సాక్ష్యం ఉంటుంది. దేవుణ్ణి నమ్మని వ్యక్తి దేవుణ్ణి అబద్ధికుడుగా చేసినట్టే. ఎందుకంటే దేవుడు తన కుమారుని విషయం చెప్పిన సాక్ష్యం ఆ వ్యక్తి నమ్మలేదు.
11 ౧౧ ఆ సాక్ష్యం ఇదే, దేవుడు మనకు శాశ్వత జీవం ఇచ్చాడు. ఈ జీవం తన కుమారుడిలో ఉంది. (aiōnios )
12 ౧౨ కుమారుడు ఉన్నవాడికి జీవం ఉంది. దేవుని కుమారుడు లేని వాడికి జీవం లేదు.
13 ౧౩ దేవుని కుమారుని నామంలో విశ్వాసం ఉంచిన మీకు శాశ్వత జీవం ఉందని మీరు తెలుసుకోడానికి ఈ సంగతులు మీకు రాస్తున్నాను. (aiōnios )
14 ౧౪ ఆయన దగ్గర మనకున్న ధైర్యం ఇదే, ఆయన చిత్తానికి అనుగుణంగా మనం ఏది అడిగినా, ఆయన మన విన్నపం వింటాడు.
15 ౧౫ మనం అడిగిన విషయాలన్నీ ఆయన వింటాడని తెలిస్తే, మనం అడిగినవి మనకు కలిగాయని మనకు తెలుసు.
16 ౧౬ తన సోదరుడు, మరణం కలిగించని పాపం చెయ్యడం ఎవరైనా చూస్తే, చూసినవాడు ఆ సోదరుని కోసం ప్రార్థించాలి. అతణ్ణి బట్టి మరణం కలిగించని పాపం చేసిన వాడికి దేవుడు జీవం ఇస్తాడు. మరణం కలిగించే పాపం ఉంది. దాని విషయంలో అతడు ప్రార్థించాలని నేను చెప్పను.
17 ౧౭ సమస్త దుర్నీతీ పాపమే. కాని మరణం కలిగించని పాపం కూడా ఉంది.
18 ౧౮ దేవుని ద్వారా పుట్టినవాడు పాపం చెయ్యడు. దేవుని ద్వారా పుట్టిన వాణ్ణి దేవుడు పాపం నుండి కాపాడుతాడు. దుష్టుడు ముట్టకుండా ఉంచుతాడు.
19 ౧౯ మనం దేవుని సంబంధులం అని మనకు తెలుసు. లోకమంతా దుష్టుని ఆధీనంలో ఉంది.
20 ౨౦ దేవుని కుమారుడు వచ్చి మనకు అవగాహన ఇచ్చాడు. నిజమైన దేవుడెవరో అర్థం అయ్యేలా చేశాడు. మనం ఆ నిజ దేవునిలో, ఆయన కుమారుడు యేసు క్రీస్తులో ఉన్నాం. ఈయనే నిజమైన దేవుడూ శాశ్వత జీవం కూడా. (aiōnios )
21 ౨౧ పిల్లలూ, విగ్రహాలకు దూరంగా ఉండండి.