< 1 కొరింథీయులకు 16 >
1 ౧ పరిశుద్ధుల కోసం చందా విషయంలో నేను గలతీయ సంఘాలకు నియమించిన ప్రకారమే మీరు కూడా చేయండి.
2 ౨ నేను వచ్చినప్పుడే చందా పోగు చేయడం కాకుండా ప్రతి ఆదివారం మీలో ప్రతి ఒక్కడూ తాను అభివృద్ధి చెందిన కొద్దీ తన దగ్గర కొంత డబ్బు తీసి దాచి పెట్టాలి.
3 ౩ నేను వచ్చినప్పుడు ఎవరిని ఈ పనికి మీరు నిర్ణయిస్తారో వారికి ఉత్తరాలిచ్చి, వారిచేత మీ చందాను యెరూషలేముకు పంపిస్తాను.
4 ౪ నేను కూడా వెళ్ళడం మంచిదైతే వారు నాతో వస్తారు.
5 ౫ నేను మాసిదోనియ మీదుగా వెళ్తున్నాను. కాబట్టి ఆ సమయంలో మీ దగ్గరికి వస్తాను.
6 ౬ అప్పుడు మీ దగ్గర కొంతకాలం ఆగవచ్చు, ఒక వేళ శీతకాలమంతా గడుపుతానేమో. ఆ తర్వాత నా ముందు ప్రయాణం ఎక్కడికైతే అక్కడికి వెళ్ళటానికి మీరు సహాయపడవచ్చు.
7 ౭ ప్రభువు అనుమతిస్తే మీ దగ్గర కొంతకాలం ఉండాలని ఎదురు చూస్తున్నాను. కాబట్టి ఇప్పుడు మార్గమధ్యంలో మిమ్మల్ని దర్శించడం నాకిష్టం లేదు.
8 ౮ కానీ పెంతెకొస్తు వరకూ ఎఫెసులో ఉంటాను.
9 ౯ ఎందుకంటే ఒక విశాలమైన ద్వారం నా ఎదుట తెరిచి ఉంది. ఎదిరించే వారు కూడా అనేకమంది ఉన్నారు.
10 ౧౦ తిమోతి వచ్చినప్పుడు అతడు మీ దగ్గర నిశ్చింతగా నివసించేలా చూసుకోండి. నాలాగా అతడు కూడా ప్రభువు పని చేస్తున్నాడు.
11 ౧౧ కాబట్టి ఎవరూ అతన్ని చిన్న చూపు చూడవద్దు. నా దగ్గరికి అతనిని శాంతితో సాగనంపండి. అతడు సోదరులతో కలిసి వస్తాడని ఎదురు చూస్తున్నాను.
12 ౧౨ సోదరుడైన అపొల్లో విషయమేమంటే, అతనిని ఈ సోదరులతో కలిసి మీ దగ్గరికి వెళ్ళమని నేను చాలా బతిమాలాను గాని ఇప్పుడు రావడానికి అతనికి ఎంతమాత్రం ఇష్టం లేదు. అతనికి వీలైనప్పుడు వస్తాడు.
13 ౧౩ మెలకువగా ఉండండి, విశ్వాసంలో నిలకడగా ఉండండి, ధైర్యం గలిగి, బలవంతులై ఉండండి.
14 ౧౪ మీరు చేసే పనులన్నీ ప్రేమతో చేయండి.
15 ౧౫ స్తెఫను ఇంటివారు అకయ ప్రాంతానికి ప్రథమ ఫలమనీ, వారు పరిశుద్ధులకు సేవ చేయడానికి తమను అంకితం చేసుకున్నారనీ మీకు తెలుసు.
16 ౧౬ కాబట్టి సోదరులారా, అలాటి వారికి, పనిలో సహాయం చేసే వారికి, కష్టపడే వారికందరికీ లోబడి ఉండమని మిమ్మల్ని బతిమాలుతూ ఉన్నాను.
17 ౧౭ స్తెఫను, ఫొర్మూనాతు, అకాయికు అనే వారు రావడం సంతోషంగా ఉంది. మీరు లేని కొరత నాకు వీరి వల్ల తీరింది.
18 ౧౮ నా ఆత్మకు, మీ ఆత్మకు వీరు ఆదరణ కలిగించారు. అలాటి వారిని గుర్తించి గౌరవించండి.
19 ౧౯ ఆసియలోని సంఘాల వారు మీకు అభివందనాలు చెబుతున్నారు. అకుల, ప్రిస్కిల్ల, వారి ఇంట్లో ఉన్న సంఘమూ ప్రభువులో మీకు అనేక అభివందనాలు చెబుతున్నారు.
20 ౨౦ ఇక్కడి సోదరులంతా మీకు అభివందనాలు చెబుతున్నారు. పవిత్రమైన ముద్దుపెట్టుకుని, మీరు ఒకరికి ఒకరు అభివందనాలు చెప్పుకోండి.
21 ౨౧ పౌలు అనే నేను నా స్వహస్తంతో ఈ అభివందనం రాస్తున్నాను.
22 ౨౨ ఎవరైనా ప్రభువును ప్రేమించకుండా ఉంటే వారికి శాపం కలుగు గాక. ప్రభువు వస్తున్నాడు.
23 ౨౩ ప్రభు యేసు క్రీస్తు కృప మీకు తోడుగా ఉండుగాక.
24 ౨౪ క్రీస్తు యేసులో ఉన్న నా ప్రేమ మీ అందరితో ఉంటుంది. ఆమేన్.