< 1 కొరింథీయులకు 14 >
1 ౧ ప్రేమ కలిగి ఉండడానికి ప్రయత్నం చేయండి. ఆత్మ సంబంధమైన వరాలను ఆసక్తితో కోరుకోండి. ముఖ్యంగా దైవసందేశం ప్రకటించగలిగే వరం కోరుకోండి.
2 ౨ ఎందుకంటే తెలియని భాషలతో మాట్లాడేవాడు మనుషులతో కాదు, దేవునితో మాట్లాడుతున్నాడు. అతడు పలికేది ఎవరికీ అర్థం కాదు. అతడు ఆత్మ ద్వారా రహస్య సత్యాలను పలుకుతున్నాడు.
3 ౩ అయితే దైవసందేశం ప్రకటించేవాడు వినేవారికి క్షేమాభివృద్ధి, ఆదరణ, ఓదార్పు కలిగే విధంగా మనుషులతో మాట్లాడుతున్నాడు.
4 ౪ భాషతో మాట్లాడేవాడు తనకు మాత్రం మేలు చేసుకుంటాడు గాని దైవసందేశం ప్రకటించేవాడు ఆదరణ, ఓదార్పు కలిగిస్తూ సంఘానికి క్షేమాభివృద్ధి కలగజేస్తాడు.
5 ౫ మీరంతా తెలియని భాషలతో మాట్లాడాలని నేను కోరుతున్నాను గాని, మీరు దైవసందేశం ప్రకటించేవారుగా ఉండాలని మరెక్కువగా కోరుతున్నాను. సంఘం అభివృద్ధి చెందడానికి భాషలతో మాట్లాడే వాడి కంటే (అర్థం చెబితే తప్ప) దేవుని పక్షంగా దేవుడు తెలియ చేసిన సందేశాన్ని ప్రకటించే వాడే గొప్పవాడు.
6 ౬ సోదరులారా, ఆలోచించండి. నేను మీ దగ్గరికి భాషలతో మాట్లాడుతూ వచ్చాననుకోండి. నా మాటలు మీకు అర్థం కాక, వాటిలో దేవుడు బయలు పరచిన విషయాలను గానీ, జ్ఞానం గానీ, దేవుడు చెప్పమన్న సందేశం గానీ, లేక ఎదైనా ఉపదేశం గానీ లేకుండా ఉంటే నా వలన మీకు ప్రయోజనమేమిటి?
7 ౭ నిర్జీవమైన వస్తువులైన వేణువు ఊదినా, వీణ వాయించినా, అవి వేరు వేరు స్వరాలు పలకకపోతే, వాడిన వాయిద్యమేదో ఎలా తెలుస్తుంది?
8 ౮ బాకా స్పష్టంగా వినిపించకపోతే యుద్ధానికి ఎవరు సిద్ధపడతారు?
9 ౯ అలాగే మీ నాలుకతో స్పష్టమైన మాటలు పలకకపోతే వినేవారికి ఏం అర్థమౌతుంది? అది మీరు గాలితో మాట్లాడుతున్నట్టే ఉంటుంది కదా!
10 ౧౦ లోకంలో ఎన్నో భాషలున్నా, వాటన్నిటికీ స్పష్టమైన అర్థాలు ఉంటాయి.
11 ౧౧ మాటల అర్థం నాకు తెలియకపోతే మాట్లాడేవాడు నాకూ, నాకు అతడూ పరాయివారంగా ఉంటాం.
12 ౧౨ మీరు ఆత్మ సంబంధమైన వరాల విషయంలో ఆసక్తిగలవారు గనుక సంఘాన్ని అభివృద్ధి పరిచే వరాలను కోరుకుని వాటిలో అమితంగా అభివృద్ధి చెందండి.
13 ౧౩ కాబట్టి తెలియని భాషతో మాట్లాడేవాడు దానికి అర్థం చెప్పే సామర్ధ్యం కోసం ప్రార్థన చేయాలి.
14 ౧౪ నేను తెలియని భాషతో ప్రార్థన చేసినపుడు నా ఆత్మ ప్రార్థన చేస్తుంది గాని నా మనసు చురుకుగా ఉండదు.
15 ౧౫ కాబట్టి నేనేం చెయ్యాలి? నా ఆత్మతో ప్రార్ధిస్తాను, మనసుతో కూడా ప్రార్ధిస్తాను. ఆత్మతో పాడతాను, మనసుతో కూడా పాడతాను.
16 ౧౬ అలా కాకుండా, నీవు ఆత్మతో మాత్రమే స్తుతులు చెల్లిస్తే నీవు పలికిన దాన్ని గ్రహించలేని వ్యక్తి నీవు చెప్పిన కృతజ్ఞతలకు, “ఆమేన్” అని చెప్పలేడు కదా!
17 ౧౭ నీకై నీవు బాగానే స్తుతులు చెల్లిస్తావు గానీ ఎదుటి వ్యక్తికి మేలు కలగదు.
18 ౧౮ దేవునికి స్తుతులు! నేను మీ అందరికంటే ఎక్కువగా తెలియని భాషలతో మాట్లాడతాను.
19 ౧౯ అయినా సంఘంలో తెలియని భాషతో పదివేల మాటలు పలకడం కంటే, ఇతరులకు ఉపదేశం దొరికేలా నా మనసుతో ఐదు మాటలు చెప్పడం మంచిది.
20 ౨౦ సోదరులారా, ఆలోచనలో చిన్న పిల్లల్లాగా ఉండవద్దు. చెడు విషయంలో పసివారిలాగా ఉండండి గానీ ఆలోచించడంలో పరిణతి చెందినవారుగా ఉండండి.
21 ౨౧ ధర్మశాస్త్రంలో ఇలా రాసి ఉంది, “తెలియని భాషలు మాట్లాడే ప్రజల ద్వారా, తెలియని మనుషుల పెదవుల ద్వారా, ఈ ప్రజలతో మాట్లాడతాను. అయినప్పటికీ వారు నా మాట వినరు అని ప్రభువు చెబుతున్నాడు.”
22 ౨౨ కాబట్టి భాషలు విశ్వాసులకు కాదు, అవిశ్వాసులకే సూచన. దేవుడిచ్చిన సందేశాన్ని ప్రకటించడం అవిశ్వాసులకు కాదు, విశ్వాసులకే సూచన.
23 ౨౩ సంఘమంతా ఒకేసారి తెలియని భాషలతో మాట్లాడుతున్నప్పుడు, బయటి వ్యక్తులు లేక అవిశ్వాసులు లోపలికి వచ్చి చూస్తే మిమ్మల్ని వెర్రివారు అని చెప్పుకొంటారు కదా?
24 ౨౪ అయితే అందరూ దేవుడిచ్చిన సందేశాన్ని ప్రకటిస్తూ ఉంటే బయటి వ్యక్తి లేక అవిశ్వాసి లోపలికి వచ్చి చూస్తే మీ అందరి ఉపదేశం వలన తాను పాపినని గ్రహిస్తాడు, అందరి మూలంగా అతనికి ఒప్పుదల కలుగుతుంది.
25 ౨౫ అప్పుడతని హృదయ రహస్యాలు బయలుపడతాయి. అప్పుడతడు సాగిలపడి దేవుణ్ణి ఆరాధించి, దేవుడు నిజంగా మీలో ఉన్నాడని ప్రకటిస్తాడు.
26 ౨౬ సోదరులారా, ఇప్పుడేం జరుగుతున్నది? మీరు సమావేశమైనప్పుడు ఒకడు ఒక కీర్తన పాడాలని, ఇంకొకడు దేవుని మాటలు ఉపదేశించాలని చూస్తున్నాడు, వేరొకడు దేవుడు తనకు బయలు పరచిన దాన్ని ప్రకటించాలని చూస్తున్నాడు. ఒకడు తెలియని భాషతో మాటలాడాలని చూస్తుండగా మరొకడు దానికి అర్థం చెప్పాలని కనిపెడుతున్నాడు. సరే, అంతటినీ సంఘాభివృద్ధి కోసం జరిగించండి.
27 ౨౭ ఎవరైనా తెలియని భాషతో మాట్లాడితే, ఇద్దరు, అవసరమైతే ముగ్గురికి మించకుండా, ఒకరి తరువాత ఒకరు మాట్లాడాలి. ఒకరు దానికి అర్థం చెప్పాలి.
28 ౨౮ అర్థం చెప్పేవాడు లేకపోతే అతడు సంఘంలో మౌనంగా ఉండాలి. అయితే అతడు తనతో, దేవునితో మాట్లాడుకోవచ్చు.
29 ౨౯ ప్రవక్తలు ఇద్దరు ముగ్గురు మాటలాడవచ్చు. మిగిలినవారు ఆ ఉపదేశాన్ని వివేచనాపూర్వకంగా వినాలి.
30 ౩౦ అయితే అక్కడ కూర్చున్న మరొకనికి ఏదైనా వెల్లడి అయితే మొదటివాడు మౌనంగా ఉండాలి.
31 ౩౧ అందరూ నేర్చుకొనేలా, ప్రోత్సాహం పొందేలా మీరంతా ఒకడి తరవాత ఒకడు దేవుడిచ్చిన సందేశం ప్రకటించ వచ్చు.
32 ౩౨ ప్రవక్తల ఆత్మలు ప్రవక్తల స్వాధీనంలో ఉన్నాయి.
33 ౩౩ ఎందుకంటే దేవుడు శాంతి సమాధానాలు కలిగించే వాడే గాని గందరగోళం కలిగించేవాడు కాడు. పరిశుద్ధుల సంఘాలన్నిటిలో
34 ౩౪ స్త్రీలు సంఘ సమావేశాల్లో మౌనంగా ఉండాలి. వారు లోబడి ఉండవలసిందే. వారికి మాట్లాడేందుకు అనుమతి లేదు. ఇదే విషయాన్ని ధర్మశాస్త్రం కూడా చెబుతున్నది.
35 ౩౫ వారు దేనినైనా తెలుసుకోవాలంటే వారి ఇంట్లో తమ భర్తలను అడగాలి. సంఘంలో స్త్రీ మాట్లాడడం అవమానకరం.
36 ౩౬ ఏం, దేవుని వాక్కు మీ నుండే బయలుదేరిందా? మీ దగ్గరికి మాత్రమే వచ్చిందా?
37 ౩౭ ఎవరైనా తాను ప్రవక్తననీ లేక ఆత్మీయ వ్యక్తిననీ భావిస్తే ఇక్కడ నేను మీకు రాస్తున్నవి ప్రభువు చెప్పిన ఆజ్ఞలని అతడు కచ్చితంగా తెలుసుకోవాలి.
38 ౩౮ ఎవరైనా దీన్ని పట్టించుకోక పొతే అ వ్యక్తిని పట్టించుకోకండి.
39 ౩౯ కాబట్టి నా సోదరులారా, దేవుడిచ్చిన సందేశం ప్రకటించడం అనే వరాన్ని ఆసక్తితో కోరుకోండి. తెలియని భాషలతో మాట్లాడటాన్ని ఆపకండి.
40 ౪౦ అంతా మర్యాదగా, క్రమంగా జరగనీయండి.