< దినవృత్తాంతములు~ మొదటి~ గ్రంథము 29 >
1 ౧ తరువాత రాజైన దావీదు సంఘంతో “దేవుడు కోరుకున్న నా కొడుకు సొలొమోను ఇంకా అనుభవం లేని చిన్నవాడే. కట్టే ఈ ఆలయం మనిషి కోసం కాదు. ఇది దేవుడైన యెహోవా కోసం గనుక, ఈ పని చాలా గొప్పది.
2 ౨ నేను చాలా ప్రయాసపడి నా దేవుని మందిరానికి కావలసిన బంగారపు పనికి బంగారం, వెండి పనికి వెండి, ఇత్తడి పనికి ఇత్తడి, ఇనుప పనికి ఇనుము, కర్ర పనికి కర్ర, గోమేధికపు రాళ్ళు, చెక్కుడు రాళ్ళు, వింతైన రంగులున్న అనేక రకాల రాళ్ళు, చాలా విలువైన అనేక రకాల రత్నాలు, తెల్ల పాల రాయి విస్తారంగా సంపాదించాను.
3 ౩ ఇంకా, నా దేవుని మందిరం మీద నాకున్న మక్కువతో నేను ఆ ప్రతిష్ఠిత మందిరం నిమిత్తం సంపాదించిన వస్తువులు కాకుండా, నా సొంత బంగారం, వెండి, నా దేవుని మందిరం నిమిత్తం నేను ఇస్తున్నాను.
4 ౪ గదుల గోడల రేకు అతకడం కోసం బంగారపు పనికి బంగారం, వెండి పనికి వెండి, పనివాళ్ళు చేసే ప్రతి విధమైన పనికి ఆరువేల మణుగుల ఓఫీరు బంగారం, పద్నాలుగు వేల మణుగుల స్వచ్ఛమైన వెండిని ఇస్తున్నాను.
5 ౫ ఈ రోజు యెహోవాకు ప్రతిష్టితంగా, మనస్పూర్తిగా ఇచ్చేవాళ్ళు ఎవరైనా ఉన్నారా?” అన్నాడు.
6 ౬ అప్పుడు పూర్వీకుల ఇళ్ళకు అధిపతులూ, ఇశ్రాయేలీయుల గోత్రపు అధిపతులూ, సహస్రాధిపతులూ, శతాధిపతులూ, రాజు పని మీద నియామకం అయిన అధిపతులూ కలసి
7 ౭ మనస్పూర్తిగా దేవుని మందిరపు పనికి 188 మణుగుల బంగారం, 10,000 మణుగుల బంగారపు నాణాలు, 375 మణుగుల వెండి, 675 మణుగుల ఇత్తడి, 3, 750 మణుగుల ఇనుము ఇచ్చారు.
8 ౮ తమ దగ్గర రత్నాలున్న వాళ్ళు వాటిని తెచ్చి యెహోవా మందిరపు గిడ్డంగులకు అధిపతిగా ఉన్న గెర్షోనీయుడైన యెహీయేలుకు ఇచ్చారు.
9 ౯ వాళ్ళు పూర్ణమనస్సుతో యెహోవాకు ఇచ్చారు గనుక ఆ విధంగా మనస్పూర్తిగా ఇచ్చినందుకు ప్రజలు సంతోషపడ్డారు.
10 ౧౦ రాజైన దావీదు కూడా ఎంతో సంతోషపడి, సమావేశం అందరి ఎదుటా యెహోవాకు స్తోత్రాలు చెల్లిస్తూ “మాకు తండ్రిగా ఉన్న ఇశ్రాయేలీయుల దేవా, యెహోవా, నిరంతరం నువ్వు స్తోత్రానికి అర్హుడవు.
11 ౧౧ యెహోవా, భూమ్యాకాశాల్లో ఉన్న సమస్తం నీ వశం. మహాత్యం, పరాక్రమం, ప్రభావం, తేజస్సు, ఘనత నీకే చెందుతాయి. యెహోవా, రాజ్యం నీది. నువ్వు అందరిమీదా నిన్ను అధిపతిగా హెచ్చించుకొన్నావు.
12 ౧౨ ఐశ్వర్యం, గొప్పతనం, నీ వలన కలుగుతాయి. నువ్వు సమస్తం ఏలే వాడవు. బలం, పరాక్రమం నీ దానాలు. హెచ్చించేదీ, అందరికి బలం ఇచ్చేదీ నువ్వే.
13 ౧౩ మా దేవా, మేము నీకు కృతజ్ఞత, స్తుతులు చెల్లిస్తున్నాం. ప్రభావం గల నీ పేరును కొనియాడుతున్నాం.
14 ౧౪ ఈ విధంగా మనస్పూర్తిగా ఇచ్చే సామర్ధ్యం మాకు కలగడానికి నేను ఏమాత్రం వాణ్ణి? నా ప్రజలు ఏమాత్రం వాళ్ళు? అన్నీ నీ వలనే కలిగాయి గదా? నీ దానిలో నుంచి కొంత మేము నీకిచ్చాం.
15 ౧౫ మా పూర్వీకులందరిలా మేము కూడా నీ సన్నిధిలో అతిథులంగా, పరదేశులంగా ఉన్నాం. మా భూనివాస కాలం ఒక నీడ లాంటిది. శాశ్వతంగా ఉండేవాడు ఒక్కడూ లేడు.
16 ౧౬ మా దేవా యెహోవా, నీ పవిత్ర నామ ఘనత కోసం మందిరం కట్టించడానికి మేము సమకూర్చిన ఈ వస్తువులన్నీ నీ వల్ల కలిగినవే. ఇదంతా నీదే.
17 ౧౭ నా దేవా, నువ్వు హృదయాన్ని చూస్తూ, నిజాయితీ ఉన్నవాళ్ళను ఇష్టపడుతున్నావని నాకు తెలుసు. నేనైతే నిజాయితీగా ఇవన్నీ మనస్పూర్తిగా ఇచ్చాను. ఇప్పుడు ఇక్కడున్న నీ ప్రజలు కూడా మనస్ఫూర్తిగా నీకు ఇవ్వడం చూసి సంతోషిస్తున్నాను.
18 ౧౮ అబ్రాహాము, ఇస్సాకు, ఇశ్రాయేలు అనే మా పూర్వీకుల దేవా యెహోవా, నీ ప్రజలు హృదయపూర్వకంగా సంకల్పించిన ఈ ఉద్దేశాన్ని నిత్యం కాపాడు. వాళ్ళ హృదయం నీకు అనుకూలంగా ఉండేలా చెయ్యి.
19 ౧౯ నా కొడుకు సొలొమోను నీ ఆజ్ఞలకు, నీ శాసనాలకు, నీ కట్టడలకు లోబడుతూ, వాటినన్నిటినీ అనుసరించేలా నేను కట్టదలచిన ఈ ఆలయం కట్టించడానికి అతనికి నిర్దోషమైన హృదయం ఇవ్వు” అన్నాడు.
20 ౨౦ ఈ విధంగా అన్న తరువాత దావీదు “ఇప్పుడు మీ దేవుడైన యెహోవాను స్తుతించండి” అని ప్రజల సమావేశం అంతటితో చెప్పినప్పుడు వాళ్ళందరూ తమ పూర్వీకుల దేవుడైన యెహోవాను స్తుతించి యెహోవా సన్నిధిలో రాజు ముందు తల వంచి నమస్కారం చేశారు.
21 ౨౧ తరువాత వాళ్ళు యెహోవాకు బలులు అర్పించారు. తరువాత రోజు, దహనబలిగా వెయ్యి ఎద్దులను, వెయ్యి పొట్టేళ్లను, వెయ్యి గొర్రె పిల్లలను, వాటి పానార్పణలతో పాటు ఇశ్రాయేలీయులందరి సంఖ్యకు తగినట్టుగా అర్పించారు.
22 ౨౨ ఆ రోజు వాళ్ళు యెహోవా సన్నిధిలో ఎంతో సంతోషంతో అన్నపానాలు పుచ్చుకున్నారు. దావీదు కొడుకు సొలొమోనుకు రెండో సారి పట్టాభిషేకం చేసి, యెహోవా సన్నిధిలో అతన్ని పరిపాలకుడిగా, సాదోకును యాజకునిగా, అభిషేకించారు.
23 ౨౩ అప్పుడు సొలొమోను తన తండ్రి దావీదుకు బదులుగా యెహోవా సింహాసనం మీద రాజుగా కూర్చుని వర్ధిల్లుతూ ఉన్నాడు. ఇశ్రాయేలీయులందరూ అతని ఆజ్ఞకు లోబడ్డారు.
24 ౨౪ అధిపతులందరూ, యోధులందరూ, రాజైన దావీదు కొడుకులు అందరూ రాజైన సొలొమోనుకు లోబడ్డారు.
25 ౨౫ యెహోవా సొలొమోనును ఇశ్రాయేలీయులందరి ముందు ఎంతో ఘనపరచి, అతనికి ముందుగా ఇశ్రాయేలీయులను ఏలిన ఏ రాజుకైనా దక్కని రాజ్యప్రభావం అతనికి అనుగ్రహించాడు.
26 ౨౬ యెష్షయి కొడుకు దావీదు, ఇశ్రాయేలీయులందరి మీద రాజుగా ఉన్నాడు.
27 ౨౭ అతడు ఇశ్రాయేలీయులను ఏలిన కాలం నలభై సంవత్సరాలు. హెబ్రోనులో ఏడు సంవత్సరాలు, యెరూషలేములో ముప్ఫై మూడు సంవత్సరాలు అతడు ఏలాడు.
28 ౨౮ అతడు వృద్ధాప్యం వచ్చినప్పుడు ఐశ్వర్యం, ఘనత కలిగి, మంచి పండు వృద్ధాప్యంలో మరణించాడు. అతని తరువాత అతని కొడుకు సొలొమోను అతనికి బదులుగా రాజయ్యాడు.
29 ౨౯ రాజైన దావీదు సాధించిన విజయాలు ప్రవక్త సమూయేలు రాసిన చరిత్రలోను, ప్రవక్త నాతాను రాసిన చరిత్రలోను, ప్రవక్త గాదు రాసిన చరిత్రలోను ఉన్నాయి.
30 ౩౦ అతని పరిపాలన చర్యలు, అతని విజయాలు, అతనికీ, ఇశ్రాయేలీయులకూ, ఇతర రాజ్యాలన్నిటికీ జరిగిన పరిణామాల గూర్చి వారు రాశారు.