< యిర్మీయా 41 >
1 ౧ కాని ఏడో నెలలో ఎలీషామా మనవడూ, నెతన్యా కొడుకూ, రాజవంశం వాడూ, రాజు ప్రధానుల్లో ఒకడైన ఇష్మాయేలూ, అతనితోపాటు మరో పదిమంది మనుషులు కలిసి, మిస్పాలో ఉన్న అహీకాము కొడుకు గెదల్యా దగ్గరికి వచ్చి అక్కడ అతనితోపాటు మిస్పాలో భోజనం చేశారు.
2 ౨ అప్పుడు నెతన్యా కొడుకు ఇష్మాయేలు, అతనితోపాటు ఉన్న ఆ పదిమంది మనుషులు లేచి, బబులోను రాజు ఆ దేశం మీద అధికారిగా నియమించిన షాఫాను మనవడూ, అహీకాము కొడుకైన గెదల్యాను ఖడ్గంతో హతం చేశారు.
3 ౩ తరువాత ఇష్మాయేలు మిస్పాలో గెదల్యా దగ్గర ఉన్న యూదులందరినీ, అక్కడ ఉన్న యోధులైన కల్దీయులను చంపాడు.
4 ౪ అది అతడు గెదల్యాను చంపిన రెండో రోజు. కానీ ఎవరికీ తెలియదు.
5 ౫ గడ్డాలు గీయించుకుని, బట్టలు చింపుకుని, శరీరాలు గాయపరచుకున్న 80 మంది పురుషులు యెహోవా మందిరానికి తీసుకెళ్ళడానికి నైవేద్యాలు, ధూపద్రవ్యాలు చేతపట్టుకుని షెకెము నుంచి, షిలోహు నుంచి, షోమ్రోను నుంచి వచ్చారు.
6 ౬ నెతన్యా కొడుకు ఇష్మాయేలు దారిపొడుగునా ఏడుస్తూ, వాళ్ళను ఎదుర్కోడానికి మిస్పాలోనుంచి బయలుదేరి వెళ్లి వాళ్ళను కలుసుకుని, వాళ్ళతో “అహీకాము కొడుకు గెదల్యా దగ్గరికి రండి,” అన్నాడు.
7 ౭ అయితే, వాళ్ళు ఆ పట్టణంలోకి ప్రవేశించినప్పుడు, నెతన్యా కొడుకు ఇష్మాయేలూ, అతనితోబాటు ఉన్నవాళ్ళు, వాళ్ళను చంపి గోతిలో పడేశారు.
8 ౮ కాని, వాళ్ళల్లో పదిమంది మనుషులు ఇష్మాయేలుతో “మమ్మల్ని చంపొద్దు, పొలంలో దాచిన గోధుమలు, బార్లీ, నూనె, తేనె మొదలైన ద్రవ్యాలు మా దగ్గర ఉన్నాయి,” అన్నారు. కాబట్టి అతడు వాళ్ళను, వాళ్ళతో ఉన్నవాళ్ళను కూడా చంపలేదు.
9 ౯ ఇష్మాయేలు గెదల్యాతోబాటు చంపిన మనుషుల శవాలన్నీ పారేసిన గొయ్యి, రాజైన ఆసా ఇశ్రాయేలు రాజైన బయషాకు భయపడి తవ్వించినదే. నెతన్యా కొడుకు ఇష్మాయేలు తాను చంపిన వాళ్ళ శవాలతో దాన్ని నింపాడు.
10 ౧౦ అప్పుడు ఇష్మాయేలు, మిస్పాలో ఉన్న మిగిలిన జనమంతటినీ, రాజకుమార్తెలందరినీ, అంటే, రాజదేహ సంరక్షకుల అధికారి నెబూజరదాను అహీకాము కొడుకు గెదల్యాకు అప్పగించిన ప్రజలందరినీ, బందీలుగా తీసుకెళ్ళిపోయాడు. వాళ్ళను తీసుకెళ్ళి అమ్మోనీయుల దగ్గర చేరాలని ప్రయత్నం చేస్తున్నప్పుడు,
11 ౧౧ కారేహ కొడుకు యోహానాను, అతనితోపాటు ఉన్న సేనాధిపతులందరూ నెతన్యా కొడుకు ఇష్మాయేలు చేసిన హాని అంతటి గురించి విన్నారు.
12 ౧౨ కాబట్టి వాళ్ళు పురుషులందరినీ తీసుకుని, నెతన్యా కొడుకు ఇష్మాయేలుతో యుద్ధం చెయ్యడానికి వెళ్ళారు. గిబియోనులో ఉన్న పెద్ద కొలను దగ్గర అతన్ని కనుగొన్నారు.
13 ౧౩ కారేహ కొడుకు యోహానాను, అతనితోపాటు ఉన్న సేనాధిపతులందరినీ చూసినప్పుడు, ఇష్మాయేలుతోపాటు ఉన్న ప్రజలు ఎంతో సంతోషించారు.
14 ౧౪ ఇష్మాయేలు మిస్పానుంచి బందీలుగా తీసుకెళ్ళిన ప్రజలందరు అతన్ని విడిచి కారేహ కొడుకు యోహానానుతో కలిశారు.
15 ౧౫ కాని, నెతన్యా కొడుకు ఇష్మాయేలూ, ఎనిమిదిమంది మనుషులు, యోహానాను చేతిలోనుంచి తప్పించుకుని, అమ్మోనీయుల దగ్గరికి పారిపోయారు.
16 ౧౬ అప్పుడు నెతన్యా కొడుకు ఇష్మాయేలు అహీకాము కొడుకు గెదల్యాను చంపిన తరువాత,
17 ౧౭ కారేహ కొడుకు యోహానానూ, అతనితోపాటు ఉన్న సేనల అధిపతులందరూ, మిస్పా దగ్గర నుంచి, ఇష్మాయేలు చేతిలో నుంచి రక్షించిన మిగిలిన ప్రజలందరినీ, అంటే, గిబియోను దగ్గరనుంచి ఇష్మాయేలు తీసుకెళ్ళిన యోధులను, స్త్రీలను, పిల్లలను, రాజకుటుంబాన్ని, మళ్ళీ తీసుకొచ్చారు.
18 ౧౮ అయితే వాళ్ళు బబులోను రాజు దేశం మీద అధికారిగా నియమించిన అహీకాము కొడుకు గెదల్యాను నెతన్యా కొడుకు ఇష్మాయేలు చంపిన కారణంగా వాళ్ళు కల్దీయులకు భయపడి, ఐగుప్తుకు వెళ్దాం అనుకుని, బేత్లెహేము దగ్గర ఉన్న గెరూతు కింహాములో కొంత కాలం ఉన్నారు.